Techie Suicide: వారిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. ప్రేమించుకున్నారు.. ఆపై మ్యారేజ్ చేసుకున్నారు. మొదట్లో అంతా బాగానే సాగింది. ఆ తర్వాత ఫ్యామిలీలో కలతలు మొదలయ్యాయి. పెళ్లయిన కొద్ది రోజులకే భార్యభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. తీవ్రమనస్తానికి గురైన భార్య, ఆత్మహత్యకు పాల్పడింది. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది.
ప్రేమ.. ఆపై పెళ్లి
స్టోరీలోకి వెళ్దాం.. సూసైడ్ చేసుకున్న నవ వధువు పేరు దేవిక. వయస్సు 25 ఏళ్లు. సొంతూరు వికారాబాద్ జిల్లా కమలాపురం ప్రాంతం. పుణెలో ఎంబీఏ చేసిన ఈమె, హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అదే కంపెనీలో పని చేస్తున్న మంచిర్యాలకు చెందిన సతీశ్ చంద్రతో పరిచయం ఏర్పడింది.
ఖరగ్‌పూర్ ఐఐటీలో చదువుకున్న సతీష్ హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. దేవిక- సతీష్‌చంద్ర పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతవరకు స్టోరీగా బాగానే నడిచింది. ప్రేమ విషయాన్ని ఇద్దరు తమతమ పెద్దలకు చెప్పారు. వారిని ఒప్పించారు కూడా.
గతేడాది ఆగస్టు 23న గోవాలో దేవిక-సతీష్ చంద్ర పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత కొత్త దంపతులు రాయదుర్గం పరిధిలోని ప్రశాంతి హిల్స్‌లో కాపురం పెట్టారు. మొదట్లో అంతా సాఫీగా సాగింది. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేక పోయేవారు. ఆఫీసు నుంచి రావడం కాస్త ఆలస్యమైనా ఒకరి కోసం మరొకరు ఎదురుచూసేశారు.
ALSO READ: మలక్‌పేట్‌లో వివాహిత అనుమానాస్పద మృతి
చిటికీ మాటికీ గొడవలు
ఇష్టపడి చేసుకున్న ప్రేమ పెళ్లి ఎక్కువ రోజులు సంతోషంగా లేదు. రోజులు, నెలలు గడిచాయి. అయినా భార్యభర్తల మధ్య గొడవలు రెట్టింపు అవుతున్నాయి. ఏ ఒక్కరూ తనదే పైచేయి అంటే తనదేనని ఇలా ఒకరికొకరు గొడవలు పడేవారు. ముఖ్యంగా చిన్న చిన్న విషయాలు పెద్ద అగాధాన్ని క్రియేట్ చేశాయి. వీటికి ఎప్పటికప్పుడు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రయత్నాలు చేయలేదు.
ఆ రాత్రి ఏం జరిగింది?
ఆదివారం రాత్రి దేవిక-సతీష్ చంద్ర మళ్లీ గొడవపడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన దేవిక, తన గదిలోకి వెళ్లింది. లోపలి నుంచి గడియ పెట్టుకుంది. గొడవ తర్వాత సతీష్ చంద్ర కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి సమయంలో ఇంటికి తిరిగి వచ్చాడు. కోపంతో లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో నిద్రపోయిందని భావించాడు సతీష్. చివరకు తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు.
తెల్లవారుజామున లేచిన సతీష్ మరోసారి దేవిక గది తలుపులు కొట్టాడు. లోపలి నుంచి ఎలాంటి స్పందించ రాలేదు. సోమవారం ఉదయం పని మనిషి వచ్చి తలుపు కొట్టినా దేవిక ఓపెన్ చేయలేదు. అనుమానం వచ్చిన తలుపులు బద్దల గొట్టి లోపలికి వెళ్లి చూశాడు సతీష్. గదిలో ఆ సన్నివేశాన్ని చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. కాసేపు నోటి వెంట మాట రాలేదు.
గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది దేవిక. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సతీష్ ఇంటికి వచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దేవిక మృతి విషయాన్ని పేరెంట్స్ చెప్పాడు సతీష్. మృతురాలి తల్లి రామలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
దేవిక పేరెంట్స్ ఏమన్నారు?
కట్నం కోసం తరచూ వేధించడంతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మ్యారేజ్ సమయంలో ఐదు లక్షలు కట్నం గా ఇచ్చామన్నారు. దీనికితోడు 15 తులాల బంగారం ఇచ్చినట్టు ప్రస్తావించారు. రోజురోజుకూ భర్త టార్చర్ తట్టుకోలేక మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు దేవిక కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.