Prakasam District News: చదువు చెప్పాల్సిన గురువు దుర్భుద్దితో విద్యార్థినిపై కన్నేశాడు. ఆ పాఠశాల మానివేసినా కూడ, తన పద్దతిలో మార్పు రాలేదు. ఏకంగా ఆ విద్యార్థిని ఉన్న పాఠశాలకు వెళ్లి మాయమాటలు చెప్పి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, అతనికి మరణించేంత వరకు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరగగా, సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.
అసలేం జరిగిందంటే..
ప్రకాశం జిల్లాలోని ఓ స్కూల్ లో విద్యను అభ్యసిస్తున్న బాలికతో అదే స్కూల్ లో మ్యాథ్స్ టీచర్ గా పని చేస్తున్న షేక్. మొహమ్మద్ అప్సర్ బాషా చనువుగా ఉంటూ ఫోన్లో చాటింగ్ చేసేవాడు. తనతో టీచర్ అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడని స్కూల్ ప్రిన్సిపాల్ కి విద్యార్థిని కంప్లైంట్ ఇవ్వగా, అతన్ని స్కూల్ నుండి తొలగించారు.
మళ్ళీ కొంతకాలం తర్వాత అతను, బడి మారి వేరేచోట చదువుకుంటున్న ఆ మైనర్ బాలికకు (15 సం.) మాయమాటలు చెప్పి ఆగస్ట్ 6, 2017లో తనతో హైదరాబాద్, నరసరావుపేట నగరాలకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై ఒంగోలు లోని టూ టౌన్ పీఎస్ లో పోక్సో యాక్ట్ కింద నాడు కేసు నమోదైంది. అప్పటి ఒంగోలు డిఎస్పీ సమగ్ర దర్యాప్తు చేపట్టి ముద్దాయిని అరెస్టు చేశారు. అనంతరం న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్ కు పంపి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు, సాక్షులను కోర్టులో హాజరు పరచగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ N. వసుంధర ప్రాసిక్యూషన్ తరుపున వాదించారు. జిల్లా ఎస్పీ దామోదర్ అధ్వర్యంలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ టీం ద్వారా ట్రయల్ నడిపి సరైన సాక్ష్యాధారాలతో నిందితుడిపై పలు సెక్షన్ ల క్రింద నేర నిరూపణ చేశారు. దీనితో ఒంగోలులోని ఫోక్సో కోర్టు ఇంచార్జ్ జడ్జి టి.రాజా వెంకటాద్రి సోమవారం నిందితుడికి మరణించేంత వరకు జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధించారు.
అదే విధంగా భాదితురాలికి రూ.7 లక్షల పరిహారం అందేలా చూడాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థను కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ముద్దాయికి శిక్ష పడటంలో కృషి చేసిన అప్పటి ఒంగోలు డిఎస్పీలు గుంటుపల్లి శ్రీనివాసరావు, B. శ్రీనివాసరావు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ N. వసుంధర, కోర్ట్ లైజన్ ASI E.V. స్వామి, కానిస్టేబుల్ M.యల్లమంద, ఒంగోలు టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ T. శ్రీనివాసరావు లను జిల్లా ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. ఎవరైనా బాలికలు, మహిళలపై దాడులకు పాల్పడినా, అసభ్యకరంగా ప్రవర్తించినా ఎన్నటికీ చట్టం నుండి తప్పించుకోలేరని ఎస్పీ అన్నారు. మహిళల భద్రతకు తాము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. మొత్తం మీద అక్షరాలు దిద్దించి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు చివరకు కటకటాల పాలయ్యాడు.