Pulivendula Crime News : మందు ఎన్ని దారుణాలకు కారణమవుతుందో, ఎన్ని ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇష్టారాజ్యంగా మందు తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుని చనిపోయే వారు కొందరైతే, ఎక్కువగా తాగేసి ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో పక్కవారికి ప్రమాదకరంగా మారే వారు మరికొందరు. ఇలా.. మద్యం మత్తులో ఇంట్లో నిదురిస్తున్న భార్యా, కుతురు గొంతు కోశాడో దుర్మార్గుడు. కట్టుకున్న భార్య , కన్న బిడ్డ అనే సోయి లేకుండా.. హత్యలకు పాల్పడ్డాడు. గాఢ నిద్రలో ఉన్న వారి ప్రాణాల్ని.. నిద్రలోనే తీసేసి పరారైయ్యాడు.
పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం తుమ్మలపల్లిలో సోమవారం అర్ధరాత్రి దారుణం ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొండూరు గ్రామానికి చెందిన గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి మద్యానికి బానిసగా మారాడు. నిత్యం తాగి వచ్చే కుటుంబ సభ్యుల్ని హింసించే వాడు. రోజూ లాగే.. ఆ రోజు తాగుతూ, కుటుంబాన్ని మర్చిపోయి ఇంటికి రాలేదు. భర్త కోసం ఎదురు చూసీ, చూసి భార్య .. తండ్రిని చూద్దామని ఎదురుచూసిన కూతురు.. ఎంత సేపటికీ రాకపోయే సరికి.. భోజనం చేసి నిద్రలోకి జారుకున్నారు. ఆ నిద్రే వారి చివరి నిద్ర అవుతుందని వాళ్లు ఊహించలేదు.
ఎప్పుడో రాత్రి వేళ ఇంటికి చేరుకున్న గంగాధర్ రెడ్డి.. మద్యం మత్తులో విచక్షణ మరిచిపోయాడు. ఏం చేస్తున్నాడో అర్థం కాని స్థితిలో భార్యా శ్రీలక్ష్మీ (37), కూతురు గంగ్రోత్రి (14) లను గొంతు కోసి హతమార్చాడు. ఈ ఘటన తెల్లవారు జామున వెలుగులోకి రావడంతో.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
మద్యం మత్తులోనే గొడవ జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే.. అంతకు ముందు రోజు ఏమైనా జరిగిందా. వీరి ఇద్దర మధ్య ఇంకేవైనా విషయాలపై మనస్పర్థలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే.. ఈ ఘటనలో కుమార్తెను ఎందుకు హతమార్చాడనే విషయం తెలియాల్సి ఉంది. భార్యాభర్తలకు వివాదాలు ఉంటే.. గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ ఘటనలో కూతురును ఎందుకు చంపాల్సి వచ్చింది అనేదే ప్రధాన అనుమానంగా ఉంది. కాగా.. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
Also read : చినిగిన షర్టు ముక్కతో హంతకుడిని పట్టుకున్న పోలీసులు.. సినిమా కాదు రియల్!
త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని తెలిపిన పోలీసులు.. కేసులో పూర్తి విషయాలు తెలుసుకున్న తర్వాత వెల్లడిస్తామని ప్రకటించారు. నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని, కచ్చితంగా శిక్ష పడేలా చూస్తామని చెబుతున్నారు.