Road Accidents: మంగళవారం ఉదయం ఏపీలో వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లి నేషనల్ హైవేపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న రోడ్డు రోలర్‌ను వెనుక వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు.
చిత్తూరు నుంచి తిరుపతికి వస్తుండగా ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఆర్టీసీ బస్సు రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని రుయా ఆస్పత్రి సిబ్బందికి సూచించారు.
కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు సమీపంలో ప్రమాదవ శాత్తు ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్ధులకు తీవ్రగాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను సమీప ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Also Read: నారాయణ స్కూల్‌లో దారుణం.. 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య..
ఇదిలా ఉంటే.. గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భావ్ నగర్ జిల్లా జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో పది మందికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం తెలుసుకుని గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.