Terrorists open Fire on Bus in Jammu and Kashmir: జమ్మూకాశ్మీర్ లో టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10మంది యాత్రికులు మృతిచెందారు. ఆదివారం రీయాసీ జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. బస్సు శివఖోడా ఆలయం నుంచి కత్రాకు తిరిగి వస్తున్న తరుణంలో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన జరగడంతో బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు 10 మంది మృతిచెందారు. 33 మంది వరకు గాయపడ్డారు. దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే పోలీసులు, సైన్యం, పారామిలటరీ బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని పోలీసులు చెప్పారు.
కాల్పుల నేపథ్యంలో డ్రైవర్ బస్సుపై కంట్రోల్ కోల్పోవడంతో బస్సు లోయలో పడిపోయిందని రీయాసీ ఎస్పీ మోహిత తెలిపారు. పొరుగన ఉన్న పూంచ్, రాజౌరిలతో పోలిస్తే రియాసీ జిల్లాలో ఉగ్రవాదుల కార్యకలాపాలు చాలా తక్కువ, అయినా కూడా ఈ దాడి జరిగింది. ప్రయాణికుల గుర్తింపు ఇంకా ధృవీకరించలేదని తెలుస్తోంది. మృతులంతా స్థానికులు కాదని సమాచారం. భద్రతా బలగాలు ఘటనా స్థలంలో దర్యాప్తును ప్రారంభించాయి.
Also Read: జీతం డబ్బులు అడిగాడని.. కొడుకుని తుపాకీతో కాల్చి చంపిన తండ్రి
కాగా, ఈ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఉద్దేశపూర్వకంగానే మన జాతీయ భద్రతకు భంగం కలిగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉగ్రవాదంపై బీజేపీ ప్రభుత్వానిది అసత్యప్రచారమే అని ఆయన అన్నారు.