Guntur Crime News: గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. డీజీపీ ఆఫీసుకు కూత వేటు దూరంలో ఓ మహిళలను రేప్ చేసి, ఆపై దారుణంగా హత్య చేశారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపింది. పోలీసుల బాస్ ఆఫీసు సమీపంలో ఇలాంటి ఘటన జరగడం వెనుక అసలేం జరిగింది? స్థానికుల ప్రమేయం ఉందా? అనేదానిపై లోతుగా కూపీ లాగుతున్నారు పోలీసులు.
మహిళ దారుణ హత్య
విజయవాడ-గుంటూరు నేషనల్ హైవే మధ్య డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. కొలనుకొండ జాతీయ రహదారి నుంచి గుంటూరు ఛానల్ మీదుగా ఇప్పటం వెళ్లే రహదారి ఇది. ఈ ఘటన ఈనెల 22న జరిగినట్టు తెలుస్తోంది. ఓ వైపు పోలీసులు, నిఘా వర్గాల కదలిక నిత్యం ఆ ప్రాంతంపై ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే నిత్యం అక్కడ పోలీసుల హడావుడి ఉంటుంది.
ఏదో ఒక యాక్టివిటీ జరుగుతూనే ఉంటుంది. అలాంటి ప్రాంతంలో చెట్ల పొదల్లోకి ఓ మహిళను తీసుకుని అత్యాచారం చేశారు. ఆపై దారుణంగా హత్య చేశారు. మహిళ మృతదేహానికి ఎడమ వైపు గొంతుపై బలంగా పొడిచినట్లు ఉంది. మహిళ మొహంపై పూర్తిగా రక్తం ఉండడంతో ఆనవాళ్లు సరిగా కనిపించడం లేదు. ఆమె ప్రైవేటు పార్టు కొంత డ్యామేజ్ అయినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.
ఇంతకీ ఆ మహిళ ఎవరు? స్థానిక మహిళ? బయట ప్రాంతానికి చెందిన మహిళ? ఇంత దారుణంగా హత్య చేయడానికి కారణాలేంటి? ఆర్థిక పరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? లేక పాత కక్షలు నేపథ్యంలో హత్య జరిగిందా? ఆమెని కిడ్నాప్ చేసి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనిపై స్థానికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ: హైదరాబాద్ లో దారుణం, బాలీవుడ్ నటిపై దాడి
స్థానిక వ్యభిచారం విషయంలో ఈమెకు ప్రమేయమున్నట్లు ఆ ప్రాంతవాసులు కొందరు చెబుతున్నమాట. మహిళ కాళ్లు మోకాలు నుంచి కిందకు వంచి ఉన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లేసరికి హత్య జరిగి సుమారు గంట అవుతుందని భావిస్తున్నారు. తాడేపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి అది హత్యగా నిర్ధారించారు.
రెండు నెలల కిందట కూడా
ఆ ప్రాంతంలో లభించిన సెల్‌ఫోన్, హ్యాండ్ బ్యాగ్ ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళ ఎవరనేది త్వరలో గుర్తిస్తామని చెబుతున్నారు. అన్నట్టు జనవరి 31న నులకపేటకు వచ్చే రహదారిలో ఓ మహిళ హత్యకు గురైంది. ఈ ఘటన డీజీపీ కార్యాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో జరిగింది.
ఇప్పటివరకు ఆ మహిళకు సంబంధించి ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈలోగా రెండురోజుల కిందట మరో హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ రెండు హత్యలు ఒకేలా జరగడంతో ఒకరే చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ కేసుల వ్యవహారం స్థానిక పోలీసులకు సవాల్‌గా మారింది. తీగ లాగితే డొంక ఎంతవరకు కదులుతుందో చూడాలి.
ALSO READ: ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం, ఆపై జంప్