Friend Murder: వికారాబాద్ జిల్లా కరన్‌కోట పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. స్నేహితుడనే కనికరం లేకుండా.. కేవలం మూఢనమ్మకంతో ఒక వ్యక్తిని అత్యంత పాశవికంగా నరికి చంపాడు మరో స్నేహితుడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది.
కరన్‌కోట గ్రామానికి చెందిన సాయిలు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. అదే గ్రామానికి చెందిన బాలప్పతో అతనికి ఎప్పటి నుంచో స్నేహం ఉంది. అయితే.. గత కొంతకాలంగా బాలప్పకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. సాయిలు తనపై చేతబడి చేయించడం వల్లే తనకు ఈ ఇబ్బందులు వస్తున్నాయని బాలప్ప బలంగా నమ్మాడు. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా.. సాయిలుపై తీవ్రమైన కక్ష పెంచుకున్నాడు.
పథకం ప్రకారం.. బాలప్ప తన స్నేహితుడైన సాయిలును ఒంటరిగా ఉన్న సమయంలో పదునైన ఆయుధంతో అటాక్ చేశాడు. తప్పించుకునే లోపే విచక్షణారహితంగా నరికి చంపాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సాయిలు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్నేహితుడే హంతకుడిగా మారడంతో గ్రామస్తులు విస్తుపోయారు.
సమాచారం అందుకున్న కరన్‌కోట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపుమడుగులో ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించారు. నిందితుడు బాలప్పను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. చేతబడి అనుమానమే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read:ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరిని బలి తీసుకున్న వాటర్ ట్యాంకర్!