Sunil Hekre SUV Crash: వర్షం పడుతున్న రహదారి.. అదే సమయాన వేగంగా దూసుకెళ్లిన విలాసవంతమైన కారు.. ఒక్క క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆ సమయంలో.. ఎవరూ ఊహించని దారిలో ప్రయాణం సాగింది. అడ్వాన్స్ సిస్టమ్స్, భారీ ధర, సెవెన్ స్టార్ భద్రతా ప్రమాణాలు… ఇవేవీ ఆ ప్రయాణికుడిని రక్షించలేకపోయాయి. ఒక్క తప్పు, ఒక్క నిర్లక్ష్యం.. ఓ జీవితం పూర్తిగా నిలిచిపోయింది. లక్షలాది మందికి ఆదర్శంగా నిలిచిన అతనికి ఆ క్షణం అంతిమంగా మారింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే ప్రశ్న వినిపిస్తోంది – వాహనం విలువ ఎంతైనా, ప్రాణానికి భద్రత ఏమిటి? ఇలా అనిపించే ఘటనే ఇది.
అసలేం జరిగిందంటే?
మహారాష్ట్ర సమృద్ధి మహామార్గపై మరో విషాద ఘటన చోటుచేసుకుంది. నాశిక్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ హెక్రే ఘోర రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నాశిక్ పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. కుటుంబంతో కలిసి ముంబయి నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఇగత్పురి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హెక్రే కుటుంబం ప్రయాణిస్తున్న మెర్సిడెస్ GLS 400D SUV రోడ్డు పై అదుపుతప్పి, పల్టీలు కొడుతూ ఎదురుగా వస్తున్న లైనులోకి దూసుకెళ్లి, గ్రిల్‌ను ఢీకొంది.
ఓ క్షణం.. ఓ స్ప్లాష్.. ఓ ప్రాణం
పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిల్వ ఉంది. అదే సమయంలో ఎదురుగా వచ్చిన ఓ వాహనం వేగంగా వెళ్లడంతో, ఆ వాహన చక్రాల నుండి నీరు హెక్రే కుటుంబం ప్రయాణిస్తున్న కారుపై స్ప్లాష్ అయింది. windshield పై నీరు పడటంతో డ్రైవర్‌గా ఉన్న సునీల్ కుమారుడికి క్షణాల పాటు ఎదురుగా ఏమీ కనిపించలేదు. ఈ క్రిటికల్ సెకన్లలోనే వాహనం అదుపుతప్పి రోడ్డుపై తలకిందులైంది. కారులో మొత్తం నలుగురు ఉన్నారు. ప్రమాద సమయంలో మితిమీరిన వేగంతో వాహనం దూసుకుపోయినట్లు సీసీటీవీ ప్రత్యక్ష సాక్ష్యాలతో తెలుస్తోంది.
9 ఎయిర్‌బ్యాగులు ఉన్నా ప్రాణం?
రూ.1.5 కోట్లు విలువ చేసే లగ్జరీ SUV లో అత్యాధునిక సురక్షణ వ్యవస్థలు ఉన్నాయి. 9 ఎయిర్‌బ్యాగులు, అడ్వాన్స్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), స్టెబిలిటీ కంట్రోల్ వంటి సాంకేతిక వ్యవస్థలు వాహనంలో ఉన్నప్పటికీ, ఆ ఒక్క క్షణం తప్పిదం ప్రాణాల్ని తీసేసింది. దురదృష్టవశాత్తు, సునీల్ హెక్రే సీట్ బెల్ట్ ధరించలేదు. వాహనం పల్టీ కొడుతూ బయటకు ఎగిరిపడ్డ ఆయన అక్కడికక్కడే మరణించారు. ఆయన భార్య, కుమారుడు, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌గా ఉన్న కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
సమృద్ధి మార్గంపై మరో మరణ ఘంటం
ఇటీవలి కాలంలో సమృద్ధి మహామార్గపై వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. గత నెల రోజులలోనే పది పైగా మృతులతో కూడిన ఘటనలు నమోదు కావడంతో ఈ రహదారి భద్రతపై ప్రశ్నలు ఉద్భవించాయి. భారీగా ఖర్చు చేసి, హైటెక్ హైవే పేరుతో ప్రారంభించిన ఈ మార్గం నిర్మాణ లోపాలు, నీటి ప్రవాహ వ్యవస్థల లేమి, స్పీడ్ కంట్రోల్ లేకపోవడంతో ప్రమాదాలకు కేంద్ర బిందువవుతోంది. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్డుపై నీరు నిలిచిపోయే సమస్య పునరావృతమవుతోంది.
రోడ్డు కాదు.. ఇదొక ప్రమాదాల పుట్ట?
ఇటువంటి మార్గాల్లో అధిక వేగం, నిబంధనలు పాటించకపోవడం వంటి అంశాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. నేడు ప్రయాణించే వాహనాల్లో అత్యాధునిక సాంకేతికత ఉన్నప్పటికీ, దాన్ని సమర్థంగా ఉపయోగించని పరిస్థితుల్లో ప్రయోజనం లేదు. అందులోనూ రోడ్డు నిర్వహణలో అధికారుల అలసత్వం, సిగ్నేజ్ లేకపోవడం, వరద నీటి తొలగింపు వ్యవస్థలు సరిగా లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సునీల్ హెక్రే మృతిపై పరిశ్రమ వర్గాల దిగ్భ్రాంతి
సునీల్ హెక్రే మరణంతో నాశిక్ పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉద్యోగులు, వ్యాపార భాగస్వాములు, సన్నిహితులు ఈ విషాదానికి శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన దేశీ ఉత్పత్తులకు మద్దతుగా నిలిచే పారిశ్రామికవేత్తగా మంచి గుర్తింపు సంపాదించారు. ఆయన వాహన ప్రమాదంలో ఇలా చనిపోవడం పరిశ్రమకు తీరని లోటుగా అభిప్రాయపడుతున్నారు.
ఈ సంఘటన మరోసారి రోడ్డుప్రమాదాలపై సామాజిక చింతనను రేకెత్తించింది. లగ్జరీ కార్లు, సాంకేతిక సదుపాయాలున్నా, ఒక్క సెకన్ల లోపం ప్రాణాల్ని బలిగొంటోంది. వర్షాకాలంలో డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండటం, వేగాన్ని నియంత్రించడం, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించడం తప్పనిసరిగా పాటించాల్సిన అంశాలు. అలాగే సమృద్ధి మార్గం వంటి హై స్పీడ్ రోడ్లపై వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.