Karur Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ తమిళనాడులో కరూర్ జిల్లా తిరుచ్చి జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న కారు-బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో స్పాట్ లో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులున్నారు. బస్సు వేగానికి కారు నుజ్జు నుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
బుధవారం తెల్లవారుజామున కరూర్ జిల్లాలో కులితలై సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరంతంగి నుండి తిరుప్పూర్ వైపు వెళ్తున్న ప్రభుత్వ ఆర్టీసీ బస్సు-తిరుచ్చి వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. బస్సు కింద ఇరుక్కుపోయిన కారును బయటకు తీయడానికి అగ్నిమాపక సిబ్బంది చాలా ఇబ్బందిపడ్డారు. కొద్దిగంటలపాటు శ్రమించి బస్సు నుంచి కారును వేరు చేశారు. కారు నుజ్జు నుజ్జు అయ్యింది.
ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు మృతదేహాలను శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై ఆరా తీస్తున్నారు. కోయంబత్తూరు జిల్లా కునియముత్తూరు నివాసి సెల్వరాజ్, అతడి భార్య కలైయరసి, కూతురు అకళ్య, కొడుకు అరుణ్ తంజావూరులోని ఓ ఆలయంలో పూజలు చేయడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ALSO READ: యువతిని ఛేజ్ చేసిన తాగుబోతులు
ఈ ప్రమాదంలో ఈ రోడ్ జిల్లాకు చెందిన విష్ణు అనే ప్రయాణికుడు మరణించాడు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి వాహనాలు జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. చివరకు బస్సు నుంచి కారును వేరు చేసిన తర్వాత వాటిని పక్కకు పెట్టారు. దీంతో రాకపోకలు యథాతధంగా కొనసాగుతున్నాయి. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి అతి వేగంగా వస్తున్న బస్సును ఢీకొనడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.