Arunachala Shiva: శివుడి ఆజ్ఞ లేనిదే.. చీమైనా కుట్టదు! ఆ పరమశివుడి అనుమతి లేనిదే.. అరుణాచలంలో ఎవరూ అడుగు పెట్టలేరు. ఆ స్వామిని దర్శించుకోలేరు. పంచభూత శివలింగ క్షేత్రమైన అరుణాచలంలో.. ఆ అరుణగిరినే సాక్షాత్తూ దైవస్వరూపంగా ఎందుకు భావిస్తారు? అరుణాచలం చరిత్రేంటి? ఈ శైవ క్షేత్రానికి ఉన్న విశిష్టత ఏంటి? అరుణాచల దర్శనం వల్ల ఏం జరుగుతుంది?
మహేశ్వర లీలా విన్యాస వైభవాచలం!
పార్వతీ తపోపునీత పావనాచలం!
నిగ్రహానుగ్రహాన్ని పొందిన రమణ సిద్ధాచలం!
అగ్నికి ప్రతిరూపంగా అరుణాచలంలో కొలువైన శివుడు
సిద్ధులు, సాధువులు, బుుషులు, మునులు, దేవతలు, సకల గణాలు నిత్యం ఆ ఆది దంపతుల్ని పూజించే పుణ్యాచలం.. అరుణాచలం! పంచ భూతాలను ఆవరించుకొని ఉండేవాడు ఆ పరమశివుడు. పంచభూతాల్లో ఒక్కో స్వరూపానికి గుర్తుగా.. ఒక్కో క్షేత్రంలో లింగరూపుడై వెలిశాడు. పంచభూతాల్లో అగ్నికి ప్రతిరూపంగా.. అగ్ని లింగంగా శివుడు అవతరించిన పవిత్ర ప్రదేశమే.. ఈ అరుణాచలం. పంచభూత శివలింగ క్షేత్రమైన అరుణాచలంలో.. అరుణగిరినే సాక్షాత్తూ దైవస్వరూపంగా భావిస్తారు.
అరుణ అంటే ఎర్రని.. అచలం అంటే కొండ అని అర్థం!
అరుణాచలంలో.. అరుణ అంటే ఎర్రని అని, అచలం అంటే కొండ అని అర్థం. అరుణాచలమంటే మన రుణ పాపాల్ని తొలగించేదని పండితులు చెబుతుంటారు. తమిళనాడులో అన్నామలైగా ప్రసిద్ధి చెందింది. తమిళంలో తిరువన్నామలై అంటే.. శివ భక్తులు కైలాస పర్వతంగా భావిస్తారు. తిరు అంటే శ్రీ అని, అన్నామలై అంటే పెద్ద కొండ అని అర్థం. మన దేశంలోని గొప్ప పుణ్యక్షేత్రాల్లో.. అరుణాచలం కూడా ఒకటి.
అరుణ తేజోలింగ స్వరూపమై భాసిల్లుతున్న శివుడు
చరిత్ర ఊహకందని కొన్ని వేల ఏళ్ల నుంచి ఆ పరమశివుడు.. అరుణ తేజోలింగ స్వరూపమై అరుణాచలంలో భాసిల్లుతున్నాడు. అరుణాచల పర్వతానికి సమీపంలో.. 25 ఎకరాల్లో నలుదిశలా ఠీవిగా నిలిచి ఉన్న గోపురాలతో అద్భుతంగా కనిపిస్తుంది ఈ క్షేత్రం. ఆకాశాన్ని అంటే గోపురాలు, అద్భుతమైన శిల్పకళా సౌందర్యంతో.. అలరారుతోంది. నాలుగు ద్వారాలు, ఐదు ప్రాకారాలు, 9 గోపురాలతో నిర్మితమైంది ఈ ఆలయం. ప్రధాన దేవాలయంలో.. ఉపాలయాలు, తీర్థాలు ఎన్నో ఉన్నాయి.
ఆలయంలోని ఒక్కో గోపురానికి ఒక్కో ఘనమైన చరిత్ర
ఆలయానికి తూర్పున ఉన్న ప్రధాన రాజగోపురాన్ని.. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారని చెబుతారు. తూర్పు రాజగోపురం గుండా లోపలికి ప్రవేశిస్తే.. ఆ పక్కనే వేయికాళ్ల మండపం ఉంటుంది. అలా.. ఒక్కో గోపురానికి ఒక్కో ఘనమైన చరిత్ర ఉంది. ఇక.. గర్భాలయంలో దివ్య మంగళ స్వరూపంతో కొలువైన స్వామివారు. నయన మనోహరంగా ఉంటారు. దీనినే.. తేజో లింగం అంటారు. సన్యాసి జీవితం ద్వారా కర్తవ్యం, ధర్మం, త్యాగం విముక్తికి ప్రతికే.. ఈ అగ్ని లింగం అని చెబుతుంటారు.
గర్భాలయంలో దివ్య మంగళ స్వరూపంతో కొలువైన స్వామి
పరమ పవిత్రమైన అరుణాచలేశ్వర స్వయంభు లింగం.. సుందరమై.. సురచిరమై, సర్వసిద్ధిపదమైన ఉంటుంది. లింగం, పానమట్టం కలిసే చోట.. బంగారు రేకు చుట్టబడి ఉంటుంది. శతాబ్దాల తరబడి పూజలు, చందనం పూతలు, అభిషేకాలు అందుకున్న అరుణాచలేశ్వర లింగం.. పరమ విశిష్టంగా భక్తిని, ముక్తిని ప్రసాదిస్తుంది. ఆది దేవుని అపారమైన అనుగ్రహానికి ఆలవాలం.. అరుణాచలం.
217 అడుగుల ఎత్తులో ప్రధాన రాజగోపురం
సంప్రదాయ ద్రావిడ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, విజయనగర చక్రవర్తులు, తంజావూరు నాయకులు.. ఇలా ఎందరో రాజులు వెయ్యేళ్ల పాటు ఎన్నో మార్పులు, చేర్పులతో నిర్మించారు. 2 పుష్కరిణిలు, అనేక మందిరాలు, విగ్రహాలు, చూడచక్కని శిల్పాలతో.. అరుణాచల క్షేత్ర నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. 217 అడుగుల ఎత్తులో ఉన్న ప్రధాన రాజగోపురం.. దేశంలోనే రెండో అతిపెద్ద గోపురంగా ఖ్యాతి చెందింది. సింహం శరీరం, ఏనుగు తలతో ఉన్న యాళీ రూపంలో చెక్కిన స్తంభ శిల్పకళ.. ఎంతో సుందరంగా కనిపిస్తుంది.
అరుణాచలం అష్టదిక్కుల్లో కొలువైన అష్ట లింగాలు
అయిదో ప్రాంగణంలోని వేయి స్తంభాల మండపాన్ని.. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. మూడో ఆవరణలో.. పదహారు స్తంభాల దీపదర్శన మండపం ఉంటుంది. ఇక్కడున్న వృక్షాన్ని.. ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక.. ఆలయం లోపలున్న నేలమాళిగలో.. పాతాళ లింగం ఉంటుంది. అక్కడే.. రమణ మహర్షి ధ్యాన ముద్రలో ఉండగా.. శరీరాన్ని చీమలు ఛిద్రం చేస్తున్న దశలో ఆయనకు ఆత్మ సాక్షాత్కారమైందనే నమ్మకంతో.. ఈ ప్రదేశాన్ని ముక్తి స్థలం అని పిలుస్తారు.
మరో ప్రసిద్ధమైన ఉత్సవం.. తిరువుడల్ ఉత్సవం
ఈ క్షేత్రంలో జరిగే కార్తీక దీపోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి శివ భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఈ క్షేత్రంలో జరిగే మరో ప్రసిద్ధమైన ఉత్సవం.. తిరువుడల్ ఉత్సవం. ఆది దంపతులు ప్రణయ కలహోత్సవాన్ని.. ఇక్కడి అర్చకులు అద్భుతంగా నిర్వహిస్తారు. ఇవి మాత్రమే కాదు.. ప్రతినెలా త్రయోదశి నాడు ప్రదోష వేళలో.. నందికి నిర్వహించే అభిషేకం.. నేత్రానందభరితంగా ఉంటుంది.
అరుణాచలం పేరుని ఉచ్ఛరించినా ముక్తి లభిస్తుందనే నమ్మకం
ఈ భూమండలం మీద ఉన్న అన్ని ప్రదేశాల కంటే అతి పురాతనమైనది, ప్రాచీనమైనది.. అరుణాచలం అని చెబుతారు. హిమాలయాల ఆవిర్భావం కంటే పూర్వం నుంచే అరుణాచలం ఉందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల.. చిదంబరాన్ని దర్శించినా, కాశీలో మరణించినా, తిరువారూరులో జన్మించినా కలిగే మోక్షప్రాప్తి.. ఒక్క అరుణాచలం అన్న పేరుని ఉచ్ఛరించినా చాలు.. ముక్తి లభిస్తుందని నమ్ముతారు. జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్లు.. ఈ క్షేత్రాన్ని తప్పక దర్శిస్తుంటారు.
అరుణాచలాన్ని ఆత్మస్వరూపంగా భావించిన రమణ మహర్షి
అరుణాచల క్షేత్ర మహత్యం గురించి స్కంద పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, శివ పురాణం, అరుణాచల పురాణంలో.. అద్భుతంగా వర్ణించారు. అరుణ గిరి సృష్టి ఆది కాలంలో ఏర్పడిందంటారు. మహా ప్రళయ కాలంలోనూ.. అరుణ గిరి నిలిచే ఉంటుందని ప్రతీతి. అరుణాచల క్షేత్రం మూలాలు తెలియాలంటే.. పురాణాల్లోకి వెళ్లాల్సిందే. సృష్టి ప్రారంభ సమయంలో.. బ్రహ్మ, విష్ణువు మధ్య ఎవరు గొప్పవారనే వివాదం తలెత్తింది. దీనిని పరిష్కరించేందుకు.. ఆ పరమశివుడు భారీ అగ్ని స్తంభంగా అవతరించాడు.
తన కిరీటాన్ని, పాదాలని కనుగొనమని.. బ్రహ్మ, విష్ణువులకు సవాల్ చేశాడు. అప్పుడు.. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిలోకి లోతుగా వెళ్లాడు. బ్రహ్మ హంస రూపాన్ని తీసుకొని.. ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అయితే.. ఇద్దరూ శివుని అగ్ని రూపానికి సంబంధించిన ఆది, అంతాలని కనుగొనలేకపోయారు. ఆ తర్వాత.. తన రూపాన్ని కుదించుకున్న శివుడు.. నిరాకార, నిరామయ, నిర్గుణ స్వరూపడై.. తిరువన్నామలై కొండ కింద తేజోమయ అగ్ని లింగ రూపంలో అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి.
శివుడు జ్యోతి స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడని మరో పురాణగాథ
ఈ ఆలయానికి సంబంధించిన మరో ముఖ్యమైన పురాణగాథ ఏమిటంటే.. జగన్మాత పార్వతీదేవి ఒకసారి సరదాగా శివుని కళ్లని మూయడం వల్ల.. లోకం అంధకారమైందంటారు. దీనికి.. ప్రాయశ్చిత్తంగా.. ఆమె అరుణాచలం కొండపై తీవ్రమైన తపస్సు చేసిందని.. అప్పుడు శివుడు జ్వాలా రూపంలో ప్రత్యక్షమై లోకానికి వెలుగునిచ్చాడని చెబుతారు. ఆ తర్వాత.. గౌరీదేవికి తన దేహంలో స్థానమిచ్చి.. అర్థనారీశ్వరుడిగా మారి.. అరుణాచలంలో వెలిశాడని అంటారు. అంతేకాదు.. దేవేంద్రుడి అహం తొలగించేందుకు.. శివుడు జ్యోతి స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడని మరో పురాణగాథ. గౌతమి మహర్షి తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహం పొందింది ఇక్కడే. ఆదిభిక్షువుగా.. ఆదిదేవుడు భిక్షాటన చేసిన తొలి ప్రదేశం అరుణాచలమే. బృంగి మోక్షం పొందిన స్థలం కూడా ఇదే! చంద్రుడు, ఇంద్రుడు, సూర్యుడితో పాటు మరెందరో దేవతలు.. శాప విమోచనం పొందిన ప్రదేశం అరుణాచలం. బ్రహ్మదేవుడి మొహం తొలగింది, శుక్రాచార్యులు దృష్టి పొందింది, లక్ష్మీదేవి కుబేరుని గురించి తపస్సు చేసింది.. ఈ అరుణాచలంలోనే!
అరుణగిరి పైభాగం శ్రీచక్రమేరవుగా భావిస్తారు
పరమశివుడే అగ్ని స్తంభంగా అవతరించిన ఈ అరుణాచలం.. వివిధ యుగాల్లో వివిధ రూపాల్ని సంతరించుకున్నట్లు పురాణగాథలు చెబుతున్నాయి. కృతయుగంలో అగ్నిగా, త్రేతాయుగంలో మాణిక్కంగా, ద్వాపరయుగంలో బంగారంగా, కలియుగంలో శిలగా రూపాంతరం చెందింది. అరుణగిరి.. 43 కోణాలు కలిగిన శ్రీ చక్రంగా చెబుతారు. అరుణగిరి పైభాగం శ్రీచక్రమేరవుగా భావిస్తారు. ఈ కొండకు ఎందుకింత ప్రాముఖ్యత అంటే.. ఇక్కడ నివసించే జీవులు.. ఏ సాధనాలు, పూజలు, నోములు, వ్రతాలు, నియమాలు ఏవీ లేకుండానే.. ముక్తిని పొందుతాయనేది.. శివుని ఆజ్ఞ. ఎందరో మునులు, దేవతలు, సిద్ధులు, యక్షులు.. అరుణగిరిని సేవించి ధన్యులయ్యారు. వారి పేరుతో లింగాలు, దేవాలయాలు.. అరుణాచలం చుట్టూ ఏర్పడ్డాయి. అష్టదిక్కుల్లో.. అష్ట లింగాలు కొలువుదీరాయ్. అనేక మంది బుుషులు ఇక్కడే తపస్సు చేసి.. నిర్వికల్ప సమాధిని, సహజ సమాధిని పొందారు. ముక్కోటి దేవతలు, అష్టదిక్పాలకులు.. అరుణాచలాన్ని అనేక రూపాల్లో ఆరాధించారు.
మోక్ష క్షేత్రమే కాదు.. భోగ క్షేత్రంగానూ అరుణాచలం ప్రసిద్ధి
అరుణాచలంతో ఎందరో యోగులకి, సిద్ధులకి.. అనుబంధం ఉంది. రమణ మహర్షి అరుణాచలాన్ని ఆత్మస్వరూపంగా భావించేవారు. ఇది కేవలం మోక్ష క్షేత్రమే కాదు.. భోగ క్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ.. శివుడు అనేక రూపాల్లో దర్శనమిస్తాడు. గర్భాలయంలో కొలువైన అగ్ని లింగంగానూ, అరుణ గురి రూపంలోనూ, శిఖరంపైన వటవృక్షం కింద దక్షిణామూర్తి స్వరూపంగానూ వెలుగొందుతున్నాడు. అంతేకాదు.. సాక్షాత్తూ ఆ శివ పార్వతులే.. అరుణాచలంలో ప్రతి రోజూ తిరుగుతారని మరో నమ్మకం. పరమశివుడు, జగన్మాత పార్వతీ నడయాడే నేలలో ఒక్కసారైనా అడుగుపెట్టాలని.. ఎంతోమంది శివ భక్తులు పరితపిస్తుంటారు. అక్కడ అగ్ని రూపంలో కొలువై ఉన్న శంకరుడిని దర్శించుకోవాలని అనుకుంటారు. ఈ పవిత్ర భారత నేలపై.. ఎన్నో దేవాలయాలు, మరెన్నో క్షేత్రాలు ఉన్నాయి. మరెక్కడా లేనివిధంగా.. అరుణ గిరి చుట్టూ 300 ఆశ్రమాలు ఉన్నాయి. నిత్యాన్నదానాలు, మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు.. నిత్యం జరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశంలో చేసే ఏ పుణ్యకార్యానికైనా.. శివానుగ్రహం లభిస్తుందనేది భక్తుల విశ్వాసం.
అరుణగిరినే సాక్షాత్తూ దైవ స్వరూపంగా భావించే భక్తులు
కృతయుగంలో రత్నాచలంగా, త్రేతాయుగంలో కనకాచలంగా, ద్వాపరయుగంలో రజతాచలంగా, ఈ కలియుగంలో అరుణాచలంగా ప్రసిద్ధి పొందింది.. ఈ పుణ్యక్షేత్రం. ఈ అరుణాచలానికి అరుణ గిరి, షోణనగిరి, సుదర్శనగిరి అనే నామాలున్నాయి. ఈ భూమి మీద ఎన్నో క్షేత్రాల్లో శివుడు కొలువై ఉన్నాడు. కానీ.. శివ రూపమే అరుణాచలం. పంచభూత శివలింగ క్షేత్రమైన అరుణాచలంలో.. అరుణగిరినే సాక్షాత్తూ దైవ స్వరూపంగా భావిస్తారు. అందువల్లే.. ఇక్కడ గిరి ప్రదక్షిణకు ఇంతటి ప్రాముఖ్యత. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే.. ఆ పరమేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణం చేసినట్లుగా చెబుతారు. ఈ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగు.. జన్మజన్మల పాపాల్ని కడిగేస్తుందని నమ్ముతారు.
గిరి ప్రదక్షిణ జన్మజన్మల పాపాల్ని కడిగేస్తుందనే నమ్మకం
అరుణాచలాన్ని సందర్శించే వాళ్లెవరైనా తప్పకుండా గిరి ప్రదక్షిణ చేస్తారు. కొందరు పౌర్ణమి తిథి చూసుకొని మరీ ఈ క్షేత్రాన్ని దర్శించి.. గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ సమయంలోనే.. అనేక శివలింగాల్ని దర్శించుకుంటారు. వాటిలో.. ఇంద్ర లింగం, అగ్ని లింగం, యమ లింగం, నైరుతి లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం, ఈశాన్య లింగం అనే ఎనిమిది లింగాలతో పాటు రాజరాజేశ్వరి, దక్షిణామూర్తి ఆలయాలు, తీర్థాలను దర్శించి.. గిరి ప్రదక్షిణ పూర్తి చేస్తారు. అరుణాచల గిరి ప్రదక్షిణకు.. పౌర్ణమి రోజున అధిక సంఖ్యలు భక్తులు వస్తుంటారు.
పౌర్ణమి రోజున అరుణాచల గిరి ప్రదక్షిణకు భారీ సంఖ్యలో భక్తులు
అరుణాచల క్షేత్రంలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా, ఎలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నా.. నిత్యం ఎవరో ఒకరు గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉంటారు. పురాణాల ప్రకారం.. గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకం, విష్ణులోకం లాంటి అన్యలోక వాసులు కూడా అరుణాచలానికి వచ్చి.. భూలోకంలో ఉండే వివిధ జీవరాశుల రూపంలో అరుణాచలేశ్వురుడి గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని నమ్ముతారు. శివ పార్వతులు సైతం.. ప్రతి రోజూ ఉభయ సంధ్య వేళల్లో గిరి ప్రదక్షిణ చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి విశిష్టత, ప్రాముఖ్యత ఉన్న అరుణ గిరి చుట్టూ.. చెప్పులు లేకుండా శివనామస్మరణ చేస్తూ.. ప్రదక్షిణ చేస్తే.. ఎంతో పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారు. గిరి ప్రదక్షిణ చేసేవారికి మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు. ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల వెలుగులో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల.. జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయనేది భక్తుల నమ్మకం.
అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు ఎంతో ప్రాముఖ్యత
ఈ గిరి ప్రదక్షిణం మొత్తం 14 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఒక్కో అడుగుకి.. అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుందని నమ్ముతారు. అరుణాచలం అంటే పాపాల్ని తొలగించేదని పండితులు చెబుతారు. కోరికల కోసం కాకుండా.. జ్ఞాన సముపార్జన కోమసే పౌర్ణమి రోజుల్లో భక్తులు గిరి ప్రదక్షిణం చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజున.. భక్తుల సంఖ్య కొన్ని లక్షలు దాటుతుంది. పౌర్ణమి నాటి చంద్రకాంతి సమక్షంలో.. కొండమీద ఉన్న ఔషధ మొక్కల చల్లని గాలుల్ని ఆస్వాదిస్తూ.. శివనామస్మరణ చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం ప్రాప్తిస్తుందని యోగులు, సిద్ధులూ చెబుతుంటారు. ప్రదక్షిణ అనే పదంలోనే చాలా అర్థం ఉంది. ప్ర అంటే పాపాలను శక్తిమంతంగా పోగెట్టేది! ద అంటే.. కోరిన కోరికులు నెరవేర్చేది! క్షి అంటే.. కర్మలని నశింపజేసేదని అర్థం. అందుకోసమే.. అరుణ గిరి ప్రదక్షిణం.. సమస్త పుణ్య ఫలప్రదం అంటారు.
అరుణాచల స్మరణంతోనే ముక్తిని పొందుతారనే నమ్మకం
అరుణాచల దర్శనం చేసుకోలేకపోతున్నామని బాధపడేవారు.. కేవలం అరుణాచల స్మరణంతోనే ముక్తిని పొందుతారని చెబుతుంటారు పండితులు. ఆ పరమేశ్వరుడిని.. అరుణాచల శివ అని ధ్యానించినంతటనే.. జన్మజన్మల పాపాలు నశిస్తాయంటారు. యుగయుగాలుగా ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా విలసిల్లుతున్న అరుణాచలాన్ని.. జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని చెబుతారు. అగ్ని లింగం కొలువైన ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే.. జన్మజన్మల పుణ్యఫలం దక్కుతుందంటారు.