Visakha Crime: సోమరితనానికి అలవాటు పడినవారు ఏ పని చేయక దొంగ వృత్తిని ఎంచుకునేవారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఉన్నతస్థాయి వర్గానికి చెందినవారు ఈ వృత్తిలోకి దిగుతున్నారు. ముంబైలో ఓ వ్యాపారవేత్త ఇలాంటి దొంగగా మారి అడ్డంగా బుక్కయ్యాడు. ఇప్పుడు విశాఖలో ఓ టెక్కీ వంతైంది. ఇందుకు కారణాలు కేవలం జల్సాలకు అలవాటు పడడమే. ఇంతకీ విశాఖలో దొంగగా మారిన టెక్కీ వెనుక అసలు విషయాల్లోకి వెళ్దాం.
విశాఖలో పోలీసులకు చిక్కిన టెక్కీ దొంగ
బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. కొన్ని రంగాలకు చెందిన వ్యక్తుల చూపు అటువైపు పడింది. కొనుగోలు చేయడానికి కాదండోయ్.. దొంగతనాలు చేయానికి. జల్సాలకు అలవాటు పడిన వివిధ రంగాలకు చెందిన కొందరు వ్యక్తులు దొంగతనాలను వృత్తిగా స్వీకరించడం మొదలుపెట్టారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న సన్నీ అలియాస్ మహేష్‌రెడ్డి కూడా ఒకడు.
అతడి వయస్సు దాదాపు 27 ఏళ్లు, స్వస్థలం కాకినాడ జిల్లా, కాకపోతే విశాఖ సిటీ మాధవధార ప్రాంతంలోని పార్క్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదవిన సన్నీ, టెక్నాలజీ పరిజ్ఞానం అంది పుచ్చుకున్నాడు. ఫలితంగా హైదరాబాద్ లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐటీ ఉద్యోగమంటే పైసలకు కొదవ ఉండదు. టాలెంట్ ఉండాలేగానీ లక్షలకు లక్షలు సంపాదించవచ్చు.
ఏకంగా 26 ఇళ్లలో చోరీ.. బీఎండబ్ల్యూ కారు కూడా
లగ్జరీ జీవితం కోసం ఓ వైపు టెక్కీగా పని చేస్తూనే మరోవైపు దొంగతనాలు చేయడం హాబీగా మార్చుకున్నాడు. ఆ తర్వాత దాన్ని వృత్తిగా స్వీకరించడం మొదలుపెట్టేశాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకునేవాడు. విశాఖ సిటీ పరిధిలో ఏకంగా 26 ఇళ్లలో చోరీలు చేశాడు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 62 కేసులు అతడిపై ఉన్నాయంటే ఏ రేంజ్‌లో దొంగతనాలు చేశాడో అర్థం చేసుకోవచ్చు.
ఇతగాన్ని గాజువాక పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. సన్నీ విలాసవంతమైన జీవతం కోసం దొంగగా మారినట్టు తేలింది. దొంగిలించిన డబ్బుతో బీఎండబ్ల్యూ కారుని కొనుగోలు చేశాడు. అంతేకాదు తరచుగా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేశాడు. ఇప్పటివరకు ఆరుసార్లు విదేశీ ప్రయాణం చేశాడంటే ఏ రేంజ్‌లో జల్సాలకు చేశావాడో అర్థమవుతోంది.
ALSO READ: కోకాపేట్‌లో ఆకాశాన్ని తాకుతున్న అక్రమ నిర్మాణాలు
ఇళ్లలోకి చొరబడేటప్పుడు మాస్కులు, టోపీలు, చేతికి తొడుగులు ధరించేవాడు. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సుత్తి, స్క్రూ డ్రైవర్లు, కటింగ్ ప్లేయర్లు డ్రిల్లింగ్ యంత్రాలను ఉపయోగించేవాడు.ఈ దొంగ నుంచి 1,084 గ్రాముల బంగారం, 6,333 గ్రాముల వెండి, 40,500 వేల నగదు ఉన్నాయి. అరెస్టు తర్వాత పోలీసులు వాడి నుంచి 699 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి.
3.805 కిలోల వెండి ఆభరణాలు, 15 లక్షల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. అందులో బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది. అన్నట్లు 15 ఏళ్ల వయస్సులో సన్నీ పీఎం పాలెంలో నాలుగు ఇళ్లలో దొంగతనాలు చేశాడు. మైనర్ కావడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలల సంరక్షణ గృహానికి పంపారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో 14 నెలలపాటు జైలు శిక్ష అనుభవించాడు కూడా. మంచివాళ్లు ఇలాంటి పనులకు దిగితే.. మరి దొంగల పని ఏంటంటూ పాత ఖైదీల్లో వినబడుతోంది.