Chittoor Crime News: చిత్తూరు పట్టణంలోని గాంధీ రోడ్డు ప్రాంతంలో బుధవారం ఉదయం కాల్పులు కలకలం రేపాయి. లక్ష్మీ థియేటర్ సమీపంలోవున్న పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. తమతో తెచ్చుకున్న గన్స్‌తో కాల్పులు సైతం జరిపి ఇంట్లో వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. వెంటనే యజమాని అప్రమత్తం అయ్యారు.
ఆ మాత్రం ఆలస్యం చేయకుండా యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు అధికారులు, కాల్పులు జరిగిన తీరును తెలుసుకున్నారు. ఇంట్లో కాల్పులు జరిపిన నలుగురి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వ్యానులో వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రెండు తుపాకులు, కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.
కాల్పుల వెనుక
అటు జిల్లా ఎస్పీ మణికంఠ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాల్పుల ఘటన గురించి స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. దొంగలు చొరబడిన ఇంటి పక్కనే బ్యాంక్ ఉంది. దీంతో వారంతా దోపిడీకి వచ్చారనే అనుమానాలు లేకపోలేదు. ఈ క్రమంలో బ్యాంకు చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు.
దొంగలను పట్టుకునేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. చొరబడిన ఇంట్లో కొంతమందిని బందీలుగా చేసుకుని, తమ ప్లాన్ అమలు చేయాలని భావించారట. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా వెల్లడిస్తేనే అసలు ఏం జరిగింది? అనేదానిపై ఓ క్లారిటీ రానుంది.
ALSO READ: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంటైనర్
దుండగుల ప్లాన్ ఇదేనా?
ప్రశాంతంగా ఉండే చిత్తూరులో కాల్పులు జరగడం ఒక్కసారిగా కలకలం రేపింది. వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దుండగులు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇంట్లో వారిని బెదిరించి బందీలుగా తీసుకోవాలనే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అప్రమత్తమైన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
పోలీసులు బెటాలియన్‌తో దిగడంతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. మరోవైపు కాల్పులు జరిగిన ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు నలుగుర్ని అరెస్ట్ చేశారు. అయితే వీరంతా చోరీ చేయడానికి వచ్చారా? వ్యాపారి హత్యకు కుట్ర ప్లాన్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మొత్తానికి స్థానికుల సాయంతో నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.