Gadwal Accident: స్వేచ్ఛ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోయిల్ దిన్నె గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో బలైపోవడంతో ఆ కుటుంబాన్ని, గ్రామాన్ని కలిచివేసింది. ప్రాణంగా పెంచుకున్న పశువుల కోసం వరి గడ్డి తీసుకురావడానికి వెళ్లడమే వారి పాలిట మృత్యుపాశమైంది.
ప్రమాదం జరిగిన తీరు..
గ్రామానికి చెందిన వి.కృష్ణారెడ్డి, వి.తిక్కా రెడ్డి, వి.చంద్రమోహన్ రెడ్డి అనే ముగ్గురు అన్నదమ్ములు రైతులు. తమ పాడి పశువుల కోసం వనపర్తి జిల్లా పెబ్బేరు నుండి ట్రాక్టర్‌పై వరి గడ్డిని లోడ్ చేసుకుని గ్రామానికి తిరిగి వస్తున్నారు. 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా సమీపంలోని బెటాలియన్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే.. వేగంగా వచ్చిన ఒక డీసీఎం వాహనం వీరి ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి గడ్డి లోడుపై కూర్చున్న ముగ్గురు సోదరులు ఎగిరి కింద పడటంతో తలలకు, శరీరాలకు తీవ్ర గాయాలయ్యాయి.
చికిత్స పొందుతూ మృతి..
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణారెడ్డి, తిక్కారెడ్డి అదే రోజు కన్నుమూశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో సోదరుడు చంద్రమోహన్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆయన కూడా మరణించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
గ్రామంలో మిగిలిన విషాదం..
ఆరుగురు పిల్లలు, ముగ్గురు భార్యలు తమ ఆశ్రయాన్ని కోల్పోయి గుండెలవిసేలా విలపిస్తున్నారు. పశువుల గ్రాసం కోసం వెళ్లిన వారు శవాలై తిరిగి రావడాన్ని గ్రామస్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఊరంతా మూగబోయింది. కష్టజీవులైన ఆ ముగ్గురు అన్నదమ్ములు లేని లోటు ఆ కుటుంబానికి ఎవరూ పూడ్చలేనిది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: కన్నకూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన తండ్రి.. 62 ఏళ్ల జైలు శిక్ష!