Srikakulam Crime: శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కంచిలి, జలంత్ర కోట రహదారి సమీపంలో ఓ దాబా వద్ద దారుణ హత్య జరిగింది. ఉద్దేశ పూర్వకంగానే ఇద్దరు వ్యక్తుల మీదకు లారీ ఎక్కించి ఓ డ్రైవర్ కిరాతకంగా హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బిహార్ కు చెందిన ఓ లారీ డ్రైవర్ భోజనం చేసేందుకు జలంత్ర కోట రహదరి వద్దన ఉన్న ఓ దాబా వద్ద ఆగాడు. అదే దాబాకు వేరే వాహనంలో భోజనం చేసేందుకు మరి కొంత మంది వచ్చారు. అయితే ఉన్నట్టుండి వాహనం నుంచి దిగిన వ్యక్తులకు, లారీ డ్రైవర్ కు మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త పెద్ద గొడవకు దారి తీసింది.
గొడవ జరిగిన అనంతరం బిల్లు విషయంలో డ్రైవర్ కు, దాబా యజమానికి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో డ్రైవర్ నేరుగా వెళ్లి లారీ ఎక్కేందుకు ప్రయత్నించాడు. చివరకు డ్రైవర్ లారీ ఎక్కాడు. దీనికి దాబా యజమాని అడ్డుగా వచ్చాడు. దీంతో డ్రైవర్ లారీని యజామాని పైనుంచి వెళ్లించడంతో స్పాట్ లోనే అతను మృతిచెందాడు. దాబాకి పాలు ఇచ్చేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఈ ప్రమాదాన్ని ఆపేందుకు ఎదురుగా వెళ్లాడు. అతనిపై నుంచి కూడా లారీ దూసుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తికి కాళ్లు విరిగి తీవ్రమైన రక్త స్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు.
లారీ డ్రైవర్ దారుణంగా ఇద్దరినీ హత్య చేసి వాహనంతో పాటు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడ ఉన్న వారితో పాటు సమీప గ్రామస్థులు డ్రైవర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.