రష్యా రాజధాని మాస్కో సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా భారతీయ పర్యాటకులకు ప్రత్యేక ఆహ్వానం పలికింది. ఇండియన్ టూరిస్టుల సంఖ్య రోజు రోజుకు పెరగడం, ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 2025 ఫస్ట్ క్వార్టర్ లో మాస్కోకు భారతీయ పర్యాటకుల సంఖ్య 1.5 రెట్లు పెరిగింది. దాదాపు 18,000 మంది ఆ దేశంలో పర్యటించారు. రష్యన్ రాజధాని తన పర్యాటక మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగుపరుస్తూనే ఉంది. ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి ఎక్కువ మంది ప్రయాణీకులు సందర్శించేలా చర్యలు తీసుకుంటుంది.
భారతీయ పర్యాటకులు ఎక్కువగా వెళ్లే దేశాల్లో ఇప్పుడు రష్యా కూడా చేరింది. ఈజీగా వీసా పొందే అవకాశం ఉండటం, ఢిల్లీ నుంచి మాస్కోకు రోజువారీ విమానాల కనెక్టివిటీ ఉండటంతో ఎక్కువగా వెల్తున్నారు. నిజానికి, భారతీయ పర్యాటకులను ఆకర్షించడానికి మాస్కో చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా, భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రయత్నాల ద్వారా మాస్కో పర్యాటక ఆకర్షణ మరింత పెరిగింది. ఈ వేసవిలో అనేక పెద్ద కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. అలాంటి వాటిలో ఒకటి మనేజ్నాయ స్క్వేర్ లో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పేరుతో జరిగింది. ఈ వేడుకల్లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ‘సమ్మర్ ఇన్ మాస్కో’ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ ప్రయాణీకుల కోసం, యోగా ఈవెంట్, హిందీ పాఠాలు, కథక్, ఒడిస్సీ నృత్య ప్రదర్శనలు, సాంప్రదాయ భారతీయ వంటకాలను అందుబాటులో ఉంచారు. ఇక మహిళలు చక్కగా చీరలు ధరించి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
భారతీయ పర్యాటకులలో మాస్కో పట్ల పెరుగుతున్న ఆసక్తికి చాలా కారణాలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య నేరుగా కనెక్టవిటీ ఉంది. రోజు వారీ విమానాలు నడుస్తున్నాయి. రష్యా- భారత్ మధ్య దీర్ఘకాలంగా ఉన్న స్నేహపూర్వక సంబంధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. భారతీయ పర్యాటకుల పట్ల మాస్కో చూపించే ఆదరణ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. మాస్కో భారతీయ సంస్కృతికి మంచి ప్రాధాన్యత ఇస్తుంది. భారత్ ఉత్సవ్‌తో పాటు, భారతీయ రాయబార కార్యాలయం నిర్వహించిన యోగాడే వేడుకల్లో ఏకంగా 7,000 మందికి పైగా హాజరయ్యారు.
మాస్కో భారతీయులను ఆకట్టుకోవడానికి మరో కారణం ఇండియన్ వంటకాలు. భారతీయ శాఖాహార వంటకాలను అందించే రెస్టారెంట్లు, కేఫ్‌లు ఇప్పుడు నగరం అంతటా విస్తృతంగా ఉన్నాయి, హై ఎండ్ డైనింగ్ సంస్థల నుంచి స్థానిక మార్కెట్లలో క్యాజువల్ ఫుడ్ స్టాల్స్ వరకు వెలిశాయి. ఈ భోజన ఎంపికలు భారతీయ పర్యాటకులకు ఇంటి రుచిని అందిస్తున్నాయి. మొత్తంగా భారతీయులను మాస్కో ఎంతగానో ఆకట్టుకుంటుంది.
Read Also: స్వర్గాన్ని తలపించే 10 రహస్య దీవులు, ఎక్కడో కాదు.. ఇండియాలోనే!