Crime News: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన ఓ మహిళ, నిర్మానుష్య ప్రాంతంలో విగతజీవిగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్ గ్రామానికి చెందిన మొగులమ్మ (49) అనే మహిళ దారుణ హత్యకు గురైంది.
మొగులమ్మ గత కొన్ని రోజులుగా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, ఇప్పటికే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తుండగానే, ఖానాపూర్ పరిసర ప్రాంతాల్లో ఆమె మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న వెంటనే నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం లభించిన తీరును బట్టి ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు.
మృతురాలి శరీరాన్ని పరిశీలించగా.. ఆమె మెడ, ముఖంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దుండగులు ఆమెపై రాయితో దాడి చేసి, తల పగులగొట్టి అత్యంత కిరాతకంగా చంపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి, పెనుగులాట జరిగినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పాత కక్షల వల్ల ఈ హత్య జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో సంఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించారు. మొగులమ్మ చివరిగా ఎవరితో మాట్లాడింది? ఆమెకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా? అనే అంశాలపై కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఖానాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ALSO READ: Jaggery: వీరు బెల్లం తినడం చాలా ప్రమాదకరం, తింటే ఏమవుతుందంటే…