Mogallu Woman Assault: పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం.. మోగల్లులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తన భర్తతో వివాహేతర సంబందం పెట్టుకుందని ఆరోపిస్తూ.. భార్య, ఆమె బంధువులు ఓ మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు. మంగళవారం రాత్రి నుంచి ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. దెబ్బలు తగిలిన ఆ మహిళ గట్టిగా విలపించినా.. ఎవరూ ఆమెను కాపాడేందుకు ముందుకు రాలేదు. మిగతా గ్రామస్థులు చూస్తూ ఉండిపోయారు. ఆమెను కట్టేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
వైరల్ వీడియో.. పోలీసుల యాక్షన్
ఈ ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే మోగల్లుకు చేరుకుని బాధిత మహిళను చెట్టుకు నుండి విడదీశారు. ఆమెకు తీవ్ర గాయాలవడంతో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
పోలీసులు ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి, దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నదని పాలకోడేరు ఎస్‌ఐ రవివర్మ తెలిపారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారి పై ఉక్కుపాదం
ఓ మహిళపై ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి, చట్టబద్ధంగా పరిగణించకుండా ఆమెను చెట్టుకు కట్టి కొట్టడం, చిత్రహింసలు పెట్టడం పూర్తిగా చట్ట విరుద్ధం. ఎవరి పట్ల అయినా అనుమానం ఉంటే, సంబంధిత న్యాయ సంస్థల ద్వారా ఫిర్యాదు చేయాల్సిందే కానీ, ఇలా స్వయంగా శిక్ష విధించడం కరెక్ట్ కాదు.
అంతేకాకుండా, ఇది మహిళా హక్కుల పట్ల గౌరవం లేకపోవడాన్ని సూచిస్తుంది. స్త్రీలు సమాజంలో భద్రతగా ఉండాలంటే, చట్టం చేతిలోనే న్యాయం జరిగే నమ్మకం ప్రజలలో ఉండాలి. కానీ ఇలా ఒక మహిళను సమాజం ముందు అవమానపర్చడం దారుణం.
గ్రామస్తుల మౌనానికి విమర్శలు
ఈ దారుణ ఘటన సమయంలో.. గ్రామస్తుల నిర్లక్ష్యం, మౌనంగా ఉండిపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. బాధిత మహిళ విలపిస్తున్నా, సహాయం చేయకుండా ఉండటం.. మానవత్వాన్ని మరిచారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: విద్యార్థునుల ఫొటోలు తీసి.. ఆ వీడియోలు చూపించి.. వార్డెన్‌ను చితకబాదిన పేరెంట్స్
పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకున్న ఈ అమానవీయ ఘటన.. మనుషులలో ఉన్న క్రూరత్వానికి మరోసారి బయటపెట్టింది. ఇలాంటి ఘటనలకు కఠిన శిక్షలు విధించాలి. బాధితురాలికి న్యాయం జరగాలంటే, ఆమెపై దాడి చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరంగా.. చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఇతరులకు గుణపాఠంగా నిలవగలదు. ఒక మహిళను అవమానించడమే నేరమైతే, ఆమెను పబ్లిక్‌గా చెట్టుకు కట్టేసి.. చిత్రహింసలకు గురి చేయడం అతి దారుణమైన నేరం. ప్రభుత్వ, పోలీసు యంత్రాంగం దీనిపై కఠిన చర్యలు తీసుకొని.. సమాజానికి స్పష్టమైన సందేశం ఇవ్వాలి.