BIG TV LIVE Originals: దేశంలో చాలా మంది రైలు ప్రయాణం చేసేందుకు మొగ్గుచూపుతారు. రైల్లోకి ఎక్కిన తర్వాత టికెట్ ను టీటీఈకి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయన వచ్చిన సమయంలో వాష్ రూమ్ కు వెళ్తే? మీరు ఎక్కలేదని టీటీఈ అనుకుంటారా? టికెట్ క్యాన్సిల్ అవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సాధారణంగా టీటీఈ రైలు బయల్దేరిన 2 గంటల లోపు లేదంటే ప్రధాన స్టేషన్లలో టికెట్లను చెక్ చేస్తారు. వారు వచ్చినప్పుడు ప్రయాణీకులు సీట్లలో ఉండటం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. టీటీఈ వచ్చినప్పుడు సదరు ప్రయాణీకులు సీట్లలో లేకపోతే ఎక్కలేదని భావిస్తారు. అలాగని టికెట్ క్యాన్సిల్ చేయడం, వెంటనే ఆ సీటును మరొకరికి కేటాయించడం లాంటివి జరగవు. ప్రయాణికులు వాష్ రూమ్ లో, ప్యాంట్రీలో, లేదంటే కోచ్ లో మరెక్కడైనా ఉండవచ్చని టీటీఈ భావిస్తారు. సదరు ప్రయాణీకుల గురించి ఆరా తీస్తారు. టీటీఈ తనిఖీ చేయనంత మాత్రాన టికెట్ రద్దు చేయబడదు. ధృవీకరించబడిన, RAC టికెట్ మొత్తం ప్రయాణానికి చెల్లుబాటులో ఉంటుంది. TTE మీ టికెట్ పరిశీలించనప్పటికీ ఎలాంటి సమస్య లేకుండా ప్రయాణించే అవకాశం ఉంటుంది.
అరుదైన సమయంలో మరొకరికి సీటు కేటాంపు
రైలు అత్యంత రద్దీగా ఉన్న సమయంలో సదరు ప్రయాణీకులు ఎక్కలేదని టీటీఈ భావిస్తే, సదరు సీటు లేదంటే బెర్త్‌ను వెయిట్ లిస్ట్ చేయబడిన లేదంటే RAC ప్రయాణీకుడికి కేటాయించే అవకాశం ఉంటుంది. ఒకవేళ కన్ఫర్మ్ టికెట్ ఉంటే మీ సీటు మీకే లభిస్తుంది. అందుకే, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా టీటీఈకి టికెట్ చూపించడం ఉత్తమం.
RAC, వెయిట్ లిస్ట్ టిక్కెట్లతో ఇబ్బందులు
ఒకవేళ ప్రయాణీకులు రిజర్వేషన్ అగై నెస్ట్ క్యాన్సిలేషన్ (RAC), వెయిట్ లిస్ట్ చేయబడిన కౌంటర్ టికెట్ లో ప్రయాణిస్తుంటే, TTE మీరు లేరని భావిస్తే, సీటును కన్ఫర్మ్ కాకపోవచ్చు. ఆ తర్వాత జరిమానా కట్టాల్సి ఉంటుంది. లేదంటే.. సీట్లు అందుబాటులో లేకపోతే రైలు నుంచి దింపడం లాంటి ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. పూర్తిగా వెయిట్ లిస్ట్ చేయబడిన ఇ-టికెట్లు తుది చార్ట్ తయారు చేసిన తర్వాత ఆటోమేటిక్ గా రద్దు చేయబడతాయి.
ప్రయాణీకులు ఏం చేయాలి?
TTE వచ్చినప్పుడు మీరు అందుబాటులో లేకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టాయిలెట్ కి వెళ్లే ముందు, మీ ఫ్రెండ్స్ కు లేదంటే పక్కవారికి చెప్పి వెళ్లండి. టీటీఈ వస్తే చెప్పమనండి. AC కోచ్ లలో, మీరు తాత్కాలికంగా దూరంగా ఉన్నా కోచ్ అటెండెంట్ కు చెప్పండి. మీ టికెట్, చెల్లుబాటు అయ్యే ID మీతో ఉంచుకోండి. టీటీఈ కనిపిస్తే వెంటనే వాటిని చూపించండి. టీటీఈ వచ్చే వరకు సీట్ లోనే ఉండడం ఉత్తమం. ఒకవేళ మీరు వెళ్లక ముందే టీటీఈ మీ సీటు దగ్గరికి వచ్చి వెళ్తే, మీరు వెళ్లి టీటీఈని కలిసి టికెట్ చూపించడం ఉత్తమం. ఎమర్జెన్సీ సాయం కోసం ఇండియన్ రైల్వేస్ హెల్ప్ లైన్ (139) కు కూడా కాల్ చేయవచ్చు. టీటీఈ చెక్ మిస్ అయినంత మాత్రాన మీ టికెట్ రద్దు చేయబడదు. మీరు రద్దు చేయాలనుకుంటనే క్యాన్సిల్ అవుతుంది.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: ఆ నగరాలకూ బుల్లెట్ రైళ్లు.. జాబితాలో ఏపీ, తెలంగాణ ఉన్నాయా? ప్రాజెక్ట్ డిటైల్స్ ఇవే!