Crime News: స్వేచ్ఛ బ్యూరో: వీసా గడువు ముగిసినా అక్రమంగా నివాసముంటూ హైదరాబాద్ లో డ్రగ్స్ దందా చేస్తున్న యెమన్ దేశస్తున్ని రాజేంద్రనగర్ పోలీసులు హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ అధికారులతో కలిసి అరెస్ట్ చేశారు. దీంట్లో అతనికి సహకరిస్తున్న పాలస్తీనా దేశం గాజాకు చెందిన మరో పెడ్లర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 25లక్షల రూపాయల విలువ చేసే 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, ఓ కత్తితోపాటు నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్.శ్రీనివాస్, అదనపు డీసీపీ కే.శ్రీనివాస్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం టోలీచౌకీలో నివాసముంటున్న అల్ అకర్ అబ్దురబు మహ్మద్ అబ్దురబు (37) సొంత దేశం యెమన్. 2008లో మొదటిసారి మన దేశానికి టూరిస్ట్ వీసాపై వచ్చి కొన్నిరోజులు పూణెలో ఉన్నాడు. ఆ తరువాత స్వదేశానికి వెళ్లిపోయి తిరిగి 2009లో స్టూడెంట్ వీసాపై వచ్చాడు. బీసీఏ కోర్సులో చేరి మధ్యలోనే వదిలేశాడు. 2011లో హైదరాబాద్ వచ్చి సిక్కిం మణిపాల్ యూనివర్సిటీలో చేరిన అబ్దురబు ఆ మరుసటి ఏడాది యెమన్ వెళ్లిపోయాడు. తిరిగి 2015లో మరోసారి స్టూడెంట్ వీసాపై హైదరాబాద్ వచ్చాడు. 2020లోనే వీసా గడువు ముగిసినా అక్రమంగా ఇక్కడే ఉంటున్నాడు.
ఈ క్రమంలో పాలస్తీనా దేశానికి చెందిన సయీద్ అలీ అనే వ్యక్తి ద్వారా అబ్దురబుకు ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్, డ్రగ్ సప్లయర్ చిడితో పరిచయం ఏర్పడింది. మాదక ద్రవ్యాల కేసులో పోలీసులు చిడి కోసం గాలిస్తున్నపుడు అబ్దురబు అతనికి తన గదిలో ఎనిమిది నెలలపాటు ఆశ్రయం కల్పించాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య సాన్నహిత్యం పెరిగింది. ఈ క్రమంలో చిడి సహకారంతో అబ్దురబు తేలికగా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ దందా మొదలు పెట్టాడు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడి కర్ణాటక రాష్ట్రం యలహంక జైలుకు కూడా వెళ్లాడు.
Also Read: Iran Strategy: యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో మేమే తేలుస్తాం.. ఇరాన్ వార్నింగ్ వెనుకున్న బలమేంటి?
జైల్లో పాలస్తీనా దేశం గాజాకు చెంది డ్రగ్స్ కేసులోనే అరెస్టయిన హసన్ డబ్ల్యు ఏ. హాషీమ్ (28)తో అబ్దురబుకు పరిచయం ఏర్పడింది. నిజానికి హసన్ 2016లో స్టూడెంట్ వీసాపై భారత్ వచ్చి కర్ణాటకలో బీసీఏ చదివాడు. తిరిగి స్వదేశానికి వెళ్లిపోయి 2022లో బిజినెస్ వీసాపై మళ్లీ ఇక్కడికి వచ్చాడు. ఆ తరువాత డ్రగ్స్ దందా మొదలు పెట్టి అరెస్ట్ అయి యలహంక జైలు పాలయ్యాడు. బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత ఇద్దరు కలిసి మాదక ద్రవ్యాల దందాను కొనసాగిస్తూ వచ్చారు.
ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న అబ్దురబు వాట్సాప్ ద్వారా నైజీరియాకు చెందిన సప్లయర్ల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొంటున్నాడు. హసన్ ఆ డ్రగ్స్ ను కలెక్ట్ చేసుకుని బెంగళూరు, హైదరాబాద్ లలో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డవారికి కొన్నిసార్లు నేరుగా..మరికొన్నిసార్లు డెడ్ డ్రాప్ పద్దతిలో సరఫరా చేస్తూ వస్తున్నాడు.
ఈ ఇద్దరు కలిసి సాగిస్తున్న ఈ దందా గురించి తెలిసి ఏసీపీ టీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో రాజేంద్రనగర్ ఇన్స్ పెక్టర్ ముత్తు యాదవ్, ఎస్ఐ ప్రశాంత్ కుమార్ రెడ్డి, హైదరాబాద్ నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ ఇన్స్ పెక్టర్ డేనియల్, ఎస్ఐ వెంకటరాములు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆపరేషన్ జరిపారు. నిందితుల కదలిలకను ఎప్పటికప్పుడు గమనిస్తూ వచ్చి బుధవారం అబ్దురబు, హసన్ లను అరెస్ట్ చేశారు. వారి నుంచి డ్రగ్స్, కత్తి, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ క్రయవిక్రయాల గురించి తెలిస్తే వెంటనే నార్కొటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్ కు 8712661601 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని డీసీపీ శ్రీనివాస్ కోరారు. దాంతోపాటు 100, 112 నెంబర్లకు కూడా ఫోన్ చేసి వివరాలు అందించ వచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా పెడతామన్నారు.