కాల్పుల విరమణ అమలులోకి రావడంతో పాకిస్తాన్ కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ని క్షమించేది లేదని అంటున్నారు భారతీయ అధికారులు. పాకిస్తాన్ పాపాలకు ప్రాయశ్చిత్తం లేదని, ఉగ్రవాదాన్ని పూర్తిగా పక్కనపెట్టే వరకు ఆ దేశంపై జాలి చూపేది లేదని తేల్చి చెబుతున్నారు. తాజాగా సింధు జలాల పంపిణీ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ అధికారులు మరోసారి స్పష్టత ఇచ్చారు. పాకిస్తాన్ కి సింధు జలాలు వదిలేది లేదని తేల్చి చెప్పారు.
VIDEO | Addressing a press conference, MEA spokesperson Randhir Jaiswal says,"The other day, you saw that after the Cabinet Committee on Security (CCS) decision, the Indus Water Treaty has been put in abeyance. I would also like to take you back a little. The Indus Water Treaty… pic.twitter.com/p1IMz26kUa
— Press Trust of India (@PTI_News) May 13, 2025
యుద్ధం ఆగినా..
పహల్గాం దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మతంపేరు అడిగి మరీ పర్యాటకుల్ని చంపిన ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు భారత సైన్యం రంగంలోకి దిగింది. 9 ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. అదే సమయంలో దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చేందుకు, పాకిస్తాన్ ని అష్టదిగ్బంధనం చేసేందుకు చర్యలు చేపట్టింది. సింధు జలాల పంపిణీని నిలిపివేసింది. పాకిస్తాన్ కి నీరు ఇచ్చే డ్యామ్ గేట్లు మూసేసింది. దీంతో పాకిస్తాన్ లోని సింధు నదీ పరివాహక ప్రాంతాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. తాగు, సాగు నీటికోసం అలమటిస్తున్నాయి. ఇది పాక్ స్వయంకృతాపరాధం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్, దేశ ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదు. భారత్ ని దెబ్బతీయాలనే ఆలోచనతో అనుకోకుండానే తమ దేశ ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టింది పాక్.
ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టడంతో పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది. భారత్ కేవలం ఉగ్రవాద శిబిరాలనే టార్గెట్ చేస్తే, పాక్ సైన్యం భారత్ లోని పౌరుల నివాసాలను, భారత సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది. అంటే ఒకరకంగా యుద్ధం మొదలు పెట్టింది పాకిస్తానే. అయితే భారత్ మరింత ధీటుగా సమాధానం చెప్పే సరికి పాక్ కాళ్లబేరానికి వచ్చింది. కాల్పుల విరమణకు దిగొచ్చింది. కాల్పుల విరమణ అమలులోకి రావడంతో పాకిస్తాన్ కాస్త ఊపిరి పీల్చుకుంది. అదే క్రమంలో సింధు జలాల విషయంలో కూడా భారత్ సానుకూలంగా స్పందిస్తుందని అనుకుంది పాక్ ప్రభుత్వం. కానీ భారత్ ఈ విషయంలో తగ్గేదే లేదని తేల్చి చెప్పింది. ఉగ్రవాదులకు పాక్ మద్దతు ఉపసంహరించుకునేవరకు సింధు డ్యామ్ నుంచి చుక్క నీటిని కూడా వదిలేది లేదని స్పష్టం చేసింది. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు నిలిపివేసే వరకు సింధు జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని పేర్కొన్నారు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్.
జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. ద్వైపాక్షిక చర్చలు మినహా ఎలాంటి మధ్యవర్తిత్వాన్ని భారత్ అంగీకరించదని స్పష్టం చేసారు. ఇక పీవోకేను పాక్ ఖాళీ చేయడం మినహా ఈ సమస్యకు పరిష్కారం లేదని తేల్చి చెప్పారు.
దేశ విభజన తర్వాత పాకిస్తాన్, భారత్ మధ్య అంతర్జాతీయ నదుల విషయంలో 1960లో ఒక ఒప్పందం జరిగింది. దీని ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్‌పై భారతదేశానికి నియంత్రణ ఉంటుంది. పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలంపై పాకిస్తాన్ కి హక్కులు ఉంటాయి. అయితే సింధు నది విషయంలో భారత్ లో ఉన్న డ్యామ్ గేట్లు ఎత్తితేనే పాకిస్తాన్ కి నీరు వెళ్తుంది. దీనికోసం ఒప్పందం జరిగింది. అయితే పహల్హాం అటాక్ తర్వాత ఏప్రిల్ 23న సింధు జలాల ఒప్పందాన్ని నిలిపవేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా కాల్పుల విరమణ నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఉపసంహరించుకునే వరకు సింధు జలాల విషయంలో తమ వైఖరి మారదని భారత్ స్పష్టం చేయడం విశేషం.