Ganesh Chaturthi 2025: వినాయక చవితి, హిందూ సంస్కృతిలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో ఒకటి. విఘ్ననాయకుడైన వినాయకుడిని పూజించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవచ్చని భక్తుల విశ్వాసం. ఈ సంవత్సరంలో వినాయక చవితి ఎప్పుడు వస్తుంది, పూజకు సరైన సమయం ఏది అనే వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వినాయక చవితి తేదీ, సమయం:
2025లో వినాయక చవితి పండుగ ఆగస్టు 27, బుధవారం నాడు వస్తుంది. ఈ రోజున ఉదయం గణపతి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి, సాయంత్రం శుభ ముహూర్తంలో ప్రతిష్టించి పూజలు చేయడం ఆనవాయితీ.
చంద్ర దర్శనం నిషేధ సమయం:
వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు చంద్రుడిని చూసినవారికి ‘మిథ్యా ఆరోపణలు’ అంటే అబద్ధపు నిందలు పడే అవకాశం ఉందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే.. చంద్రుడిని చూడకూడని సమయాన్ని తెలుసుకోవడం ముఖ్యం. 2025లో చంద్రుడిని చూడకూడని సమయం ఆగస్టు 26, సాయంత్రం 5:26 గంటల నుంచి ఆగస్టు 27, రాత్రి 8:54 గంటల వరకు ఉంటుంది.
శుభ ముహూర్తం:
వినాయకుడి పూజకు అత్యంత శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 12:20 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఉంటుంది. ఈ సమయంలో గణపతిని ప్రతిష్టించి పూజలు చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
పూజా విధానం:
వినాయక చవితి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. పూజకు అవసరమైన 21 రకాల పత్రాలు, గరిక, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, అక్షతలు, కొబ్బరికాయ, బెల్లం, నైవేద్యాలు సిద్ధం చేసుకోవాలి. వినాయకుడికి ఇష్టమైన లడ్డూలు, ఉండ్రాళ్ళు, బూరెలు వంటి వాటిని నైవేద్యంగా పెట్టాలి.
మొదటగా.. గణపతిని ప్రతిష్టించి, అష్టోత్తర శతనామావళి పఠిస్తూ పూజ చేయాలి. 21 రకాల పత్రాలతో వినాయకుడిని పూజించడం ఈ పూజలో విశేషం. పూజ ముగిసిన తర్వాత గణపతికి మంగళ హారతి ఇచ్చి, ప్రసాదం పంచుకోవాలి.
Also Read: వినాయక చవితి రోజు.. ఎలాంటి ప్రసాదాలు దేవుడికి సమర్పించాలి ?
విగ్రహ ప్రతిష్టాపన, నిమజ్జనం:
గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించిన తర్వాత, భక్తులు వారి వీలును బట్టి 1, 3, 5, 7, లేదా 11 రోజులు పూజలు చేస్తారు. ఈ కాలంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేసి, నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత.. విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేయడానికి శుభ సమయం ఆగస్టు 27.. సాయంత్రం 4:30 గంటల తర్వాత లేదా 28 వ తేదీ ఉదయం 6:00 గంటల నుంచి 10:30 గంటల వరకు ఉంటుంది.
వినాయక చవితి పండుగ కేవలం పూజలతో మాత్రమే ముగిసిపోదు. అది ఆధ్యాత్మికత, సంస్కృతి, కుటుంబ బంధాలను బలోపేతం చేసే ఒక మహోత్సవం. ఈ పండుగ రోజున గణపతి అనుగ్రహం పొంది, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆశిద్దాం.