Goddess Udasalamma: ఆ ఆలయానికి వెళుతున్నారా.. అయితే మీ చేతిలో రాయి ఉండాల్సిందే. అదేంటి ఆలయానికి వెళుతుంటే రాయి ఎందుకు అనుకుంటున్నారా.. అందుకు పెద్ద కథే ఉంది. ముందుగా మీరు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారా.. కుటుంబ సమస్యలు వేధిస్తున్నాయా.. ఘర్షణకు తలెత్తుతున్నాయా అయితే ఈ ఆలయానికి ఓసారి వెళ్లి రండి అంటున్నారు భక్తులు. ఇంతకు ఈ ఆలయం ఎక్కడుంది? వెళితే సరే రాయి ఎందుకు తీసుకువెళ్లాలి? దాని వెనుక ఉన్న కథేంటో తెలుసుకుందాం.
కర్ణాటక రాష్ట్రంలోని సిరా గ్రామం నుండి చిత్రదుర్గ వెళ్లే రహదారిలో మనకు ఈ చిన్న ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయంలో కొలువైన అమ్మవారి పేరు ఉడసలమ్మ అమ్మవారు. ఇక్కడ కేవలం ఒక చెట్టు కింద వెలసి ఉన్నారు అమ్మవారు. అదేంటి మహిమలు గల తల్లికి ఆలయం నిర్మించలేదా అనుకుంటున్నారా.. దానికి ఓ కథ ఉంది. ఇక్కడ ఆలయాన్ని నిర్మించవద్దని, సమస్త లోకమంతా తాను ఉన్నట్లు అమ్మవారు వాక్కు చెప్పారట. అందుకే ఈ అమ్మవారికి ఆలయం నిర్మించలేదట.
ఈ ఆలయంకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. కేవలం స్థానిక భక్తులే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇక్కడికి తరలివచ్చి అమ్మవారిని మొక్కుకుంటారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఈ అమ్మవారు ఇక్కడ ప్రసిద్ధి చెందారు. ఏదైనా కష్టాల్లో ఉండి అమ్మ శరణు శరణు అంటే చాలు.. తమ కోరికలు నెరవేరుస్తుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. అయితే ఈ ఆలయానికి ఉన్న ఓ ఆచారం తెలుసుకుందాం.
ఈ ఆలయానికి వచ్చే భక్తులు అమ్మవారికి మొక్కుకున్న అనంతరం.. అమ్మవారి ఎదురుగా ఓ రాయి పై కూర్చుంటారు. ఆ రాయి దానికంతట అదే కుడి వైపుకు తిరిగితే, కోరికలు తీరిపోతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు ఎడమవైపుకు తిరిగితే ఆ కోరిక నెరవేరదని అమ్మవారి సూచించినట్లుగా ఇక్కడి భక్తులు చెబుతారు. ఈ అమ్మవారి ఆలయానికి వచ్చి తమ కోరికలు విన్నవించుకుంటే వెంటనే ఆ కోరికలు తీరుతాయా లేదా అన్నది తెలుసుకునేందుకు రాళ్లపై కూర్చుని తిరుగుతారు భక్తులు. అందుకే ఈ ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, రాయిపై కూర్చుంటారు. ఈ సాంప్రదాయం అమ్మవారు కొలువైన సమయం నుండి కొనసాగుతుందని స్థానిక భక్తులు తెలుపుతారు.
Also Read: Astrology 25 November 2024: ఈ రాశుల వారు ఈ రోజు ప్రయాణాల్లో జాగ్రత్త
అంతేకాదు ఈ ఆలయం వద్ద పూజలు నిర్వహిస్తున్నది ఒక ముస్లిం మహిళ. కులమతాలకు అతీతంగా ఉడసలమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఇక్కడికి తరలివస్తారని ఆమె తెలిపారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా అమ్మవారు ఇక్కడ ప్రసిద్ధి చెందారని, రహదారిలో రాకపోకలు సాగించే భక్తులు, అమ్మవారిని దర్శించుకుని తమ ప్రయాణం కొనసాగిస్తారన్నారు. మరి మీరు కూడా ఈ అమ్మవారిని దర్శించాలనుకుంటున్నారా.. మీ కోరికలు నెరవేరుతాయో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే వెంటనే అమ్మవారిని వెళ్లి దర్శించండి.. రాయిపై కూర్చోండి.