Donga mallanna temple: శ్రీశైలం మల్లన్న తెలుసు.. కొమురెల్లి మల్లన్న తెలుసు.. కానీ దొంగ మల్లన్న గురించి మీకు తెలుసా..? ఆయనకో గుడి ఉందని.. అక్కడో పెద్ద జాతర జరగుతుందని మీకు తెలుసా..? అసలు ఆ గుడికి, గుడిలో దేవుడికి దొంగ మల్లన్న అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి ఎంటర్ అవ్వాల్సిందే.
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న మల్లన్నపేట మల్లిఖార్జున స్వామి గుడికి ఉన్న మరో ప్రసిద్దమైన పేరే దొంగ మల్లన్న గుడి. ఆ చుట్టు పక్కల ప్రాంతాలలో మల్లన్నపేట మల్లిఖార్జున స్వామి అంటే అంతగా ఎవ్వరికీ తెలియదు కానీ దొంగ మల్లన్న గుడి అని చెప్తే మాత్రం ఇట్టే పసిగట్టేస్తారు. ఓహో మన దొంగ మల్లన్న గుడే కదా అనేంతగా ఆ పేరు ప్రాచుర్యం పొందింది. అయితే దొంగ మల్లన్న స్వామి అంటే ఆ గుడిలో దేవుడు దొంగ కాదు. ఆ గుడి ఏం దొంగల అడ్డా కాదు కానీ కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన ఒక సంఘటన వల్లే ఆ గుడికి ఇలాంటి విచిత్రమైన పేరు వచ్చిందని స్థానికులు చెప్తున్నారు.
పొలాసకు చెందిన పాలకుల ఆవులను ఎవరో దొంగలు దొంగిలించి తీసుకెళ్తుంటే.. వారిని రాజభటులు వెంబడించారట. ఆ టైంలో దొంగలు మల్లన్నపేటలోని మల్లిఖార్జునస్వామి గుడిలోకి వెళ్లి దాక్కున్నారట. తమ వెనకాలే తరుముకుంటూ.. వస్తున్న రాజభటులను చూసిన దొంగలు తమను ఆ రాజభటుల నుంచి కాపాడాలని తమను, తాము దొంగిలించిన ఆవులను రంగులు మారేలా చేయాలని ఇక్కడి స్వామి వారిని దొంగలు వేడుకున్నారట. అలా కాపాడితే ఇక్కడే పెద్ద గుడి కడతామని మొక్కుకున్నారట.
వాళ్లు కోరుకున్నట్లుగానే ఆవుల రంగులు మారడమే కాకుండా దొంగల రంగులు కూడా మారిపోయాయని.. వాళ్లను తరుముకుంటూ వెనకాలే వచ్చిన రాజభటులు గుడిలో ఉన్న దొంగలను అక్కడి ఆవులను చూసి గుర్తు పట్టకుండా వెళ్లిపోయారట. రాజభటులను నుంచి ఆ స్వామే తమను కాపాడారని వెంటనే గుడి కట్టడానికి పూనుకున్నారట ఆ దొంగలు. రాత్రికి రాత్రే స్వామి వారికి గుడి పూజలు చేశారని అలయ చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి ఈ గుడిని గుడిలో దేవుడిని కూడా దొంగ మల్లన్న గుడిగా అని పిలవడం ఆనవాయితీగా వచ్చిందట.
తర్వాత పొలాస పాలకులు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారట. ఆ స్వామికి ఎంతో మహిమ ఉందని గ్రహించిన పాలకులు తాము కూడా పెద్ద గుడి కట్టిస్తామని మొక్కుకున్నారట. ఇప్పుడున్న గుడి పొలాస పాలకులు కట్టించిందేనని చెప్తారు. ఇక 18 వ శతాబ్దపు మధ్య భాగంలో ఈ గుడి పొలాస పాలకుల నుంచి తమ్మిడీల చేతిలోకి వెళ్ళింది. అప్పటి నుంచి నేటి వరకు ఆలయంలో తమ్మిడి కులస్తులే పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది డిసెంబర్‌లో ఈ గుడికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దొంగ మల్లన్న దర్శనం చేసుకుంటారు.
స్వామివారికి ప్రీతికరమైన ఆది, బుధవారాల్లో జాతర భక్తులతో సందడిగా ఉంటుంది. భక్తులు కుటుంబ సభ్యులతో జాతరకు వచ్చి పట్నాలు వేస్తారు. పరమాన్నం వండి మంగళ వాయిద్యాలు, ఒగ్గు కళాకారులు డమరుక నాదాలతో పవిత్రంగా బోనాలు తీసి నైవేద్యంగా సమర్పిస్తారు. ముఖ్యంగా గొల్లకురుమల ఆరాధ్య దైవంగా ప్రసిద్ది చెందిన ఈ ఆలయలో డప్పు వాయిద్యాలతో, శివసత్తుల పునకాలతో ఏడువారాల పాటు ఆలయ ప్రాంగణం అంతా శివనామ స్మరణతో మారుమోగుతుంది. స్వామివారిని దర్శించుకుంటే సకల భాదలు పోయి శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్