Manchu Manoj : గత రెండు రోజులుగా జరుగుతున్న మంచు ఫ్యామిలీ వివాదానికి ఇంకా తెరపడలేదు. నిన్న రాత్రి జరిగిన పలు నాటకీయ పరిణామాల మధ్య మోహన్ బాబు ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఇక పోలీస్ నోటీసుల మేరకు మంచు మనోజ్ (Manchu Manoj) తాజాగా విచారణ కోసం బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధాకరం అంటూ, క్షమాపణ కోరుతున్నానని వెల్లడించారు.
ప్రముఖ నటుడు మోహన్ బాబు (Mohan Babu) ఇంట్లో ఆస్తి వివాదాలు పరస్పరం భౌతిక దాడులకు దారి తీసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు తన కొడుకు, కోడలికి ఆస్తిగా ఆస్తిలో చెల్లి గవ్వ ఇవ్వను అని తెగేసి చెప్పడమే కాకుండా, మనోజ్ తో పాటు అతని భార్య వల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈనెల 8వ తేదీన మంచు మనోజ్(Manchu Manoj), అతని అనుచరులు ఇంటికి వచ్చి గొడవ చేశారని, భయభ్రాంతులకు గురి చేశారని మోహన్ బాబు చెబుతున్నారు. మరోవైపు మంచు మనోజ్ తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అంటూ మోహన్ బాబు అనుచరులపై కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక నిన్న రాత్రి మంచు మనోజ్(Manchu Manoj) తన కూతురు ఇంట్లోనే ఉందని, చూడనివ్వాలని గేట్ పగలగొట్టుకొని మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లడం తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. ఈ క్రమంలో మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేసిన సంగతి విదితమే. అయితే తండ్రి, కొడుకుల మధ్య తారస్థాయికి జరిగిన ఈ గొడవపై పోలీసులు సీరియస్ అయ్యారు. మోహన్ బాబు వల్ల గాయపడ్డ జర్నలిస్టుకు తీవ్ర గాయాలయ్యాయి. ముక్కు, చెవికి మధ్య మూడు చోట్ల ఎముక ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయనపై మూడు సెక్షన్ల కింద కేసుని నమోదు చేశారు. ఇక మంచు మనోజ్, విష్ణులకు రాచకొండ సిపీ ఈరోజు ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. జల్పల్లిలోని ఘటనపై సిపి విచారణ చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా మంచు మనోజ్(Manchu Manoj) విచారణ కోసం బయటకు వచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఇప్పుడు చూస్తున్న నాన్న మా నాన్న కాదు. ఇలాంటి ఓ రోజు వస్తుందని అసలు అనుకోలేదు. నా బంధువులపై దాడి చేశారు. నా భార్య గర్భవతిగా ఉన్న నాటి నుంచి అనుభవిస్తున్నా. ఇక ఆగలేను” అంటూ మనోజ్ కన్నీరు పెట్టుకున్నాడు. “నాన్నా, అన్న తరపున నేను క్షమాపణలు చెబుతున్నా” అంటూ జర్నలిస్ట్ లకు సంఘీభావం తెలిపారు. మోహన్ బాబు (Mohan Babu) దాడి ఖండిస్తూ జర్నలిస్ట్‌లు చేస్తున్న ఆందోళన దగ్గరికి మంచు మనోజ్ చేరుకుని, మద్దతు ప్రకటించారు. “నాకు సపొర్ట్‌గా వచ్చిన మీకు ఇలా జరగడం బాధాకరం. నాన్న, అన్న తరుపున నేను క్షమాపణలు చెబుతున్నా. బాధితులకు నేను అండగా ఉంటాను. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రూఫ్స్ తో సహ అన్నీ బయట పెడతా. వాళ్ళకు మనస్పూర్తిగా గొడ్డులా పని చేశాను. నేను ఆస్తిని అడగలేదు. మేమిద్దరం ఎలాంటి సపోర్ట్ తీసుకోకుండా సొంతంగా పని చేసుకుని బతుకుతున్నాము” అంటూ మంచు మనోజ్ కామెంట్స్ చేశాడు.