
Akshaya Tritiya:- వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. అక్షయ తృతీయ నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నారు. అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తృతీయ తిథి అని పురోహితులు అంటున్నారు. ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి
పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష చేపట్టి.. ఏ పుణ్య కార్యం చేసినా దాని ఫలితం అక్షయంగానే ఉంటుందని పండితులు చెబుతారు. ఈ తిథి రోజున అక్షయుడైన విష్ణుమూర్తిని పూజిస్తారు. అందుకే ఈరోజును అక్షయ తృతీయ అని పిలుస్తారు. ఈరోజున బంగారం కొనాలని శాస్త్రాల్లో ఎక్కడా లేదు. ఇంట్లోని పూజగదిలో శ్రీయంత్రాన్ని ప్రతిష్టించడం చాలా శుభప్రదం. మరోవైపు.. శ్రీ యంత్రాన్ని కొనుగోలు చేయడానికి అక్షయ తృతీయ రోజు ఉత్తమమైనది. దీంతో.. అక్షయ తృతీయ కోసం షాపింగ్ చేసేటప్పుడు, మీరు బంగారం బదులు శ్రీయంత్రాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు.
అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాన్నైనా వారం, వర్జ్యం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చునని పురోహితులు అంటున్నారు. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం వంటి మంచి కార్యాలను చేయవచ్చునని పురోహితులు సూచిస్తున్నారు.ఇంకా గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం.
అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో, ఫలమో భగవంతుడికి సమర్పించినా, దైవనామస్మరణ చేసినా, చివరికి నమస్కారం చేసిన సంపద, పుణ్యఫలం కలుగుతుంది.