మన దేశంలో ఎన్నో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో అప్పుల నుంచి పేదరికం నుంచి కాపాడే ఆలయాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ సంపదకు దేవత అయిన కుబేరుడి దేవాలయాలు.
భారతదేశంలో దేవాలయాలు ఎక్కువ. మనదేశంలో ఆధ్యాత్మిక నియమాలను పాటించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. కాశీలో ప్రతి వీధిలో ఒక శివలింగం కనిపిస్తుంది. చిన్నచిన్న ఆలయాలు కూడా ఎన్నో ఉంటాయి. ప్రజల కష్టాలను తీర్చే దేవుళ్ళు, ఆలయాల గురించి నమ్మకాలు కూడా ఎక్కువ. చర్మవ్యాధులను నయం చేసే దేవతలు, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆలయాలు, డబ్బు సంపదను ఇచ్చే దేవుళ్ళు ఉన్నారని నమ్ముతారు. అలా మన దేశంలో కుబేరుడికి అంకితం చేసిన దేవాలయాలు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్తే కష్టాలన్నీ తీరిపోతాయని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని చెప్పుకుంటారు. అలాగే పేదరికం నుంచి బయటపడతారని కూడా చెప్పుకుంటారు.
కుబేరుడు సంపదకు దేవుడు. అతడిని యక్షులకు రాజుగా చెప్పుకుంటారు. అతడు దేవతలందరికీ కోశాధికారి అని కూడా అంటారు. అతని విగ్రహం లేదా యంత్రం ఇంట్లో పెట్టుకుంటే అనంతమైన సంపద కలుగుతుందని నమ్ముతారు. అతని చేతిలో అతని పెంపుడు జంతువైన ముంగిస కనిపిస్తూ ఉంటుంది.
మనదేశంలో కుబేరుడికి ఆలయాలు చాలా అరుదు. గుజరాత్ లో ప్రసిద్ధ కుబేర బండారి ఆలయం ఉంది. అలాగే చెన్నైలోని శ్రీ లక్ష్మీ కుబేర ఆలయం, వారణాసిలోని అన్నపూర్ణ మాత ఆలయం పక్కనే ఉన్న చిన్న కుబేర ఆలయం వంటివి ప్రసిద్ధి చెందాయి. ఉత్తరాఖండ్ లో కూడా కుబేరుడికి కొన్ని ఆలయాలు ఉన్నాయి.
కుబేరుడు సంపదను ఇస్తాడు… కాబట్టి హిందూ విశ్వాసాల ప్రకారం అతడిని పూజించడం ద్వారా పేదరికం నుండి బయటపడవచ్చు. అయితే లక్ష్మీదేవినే సంపదకు అధిదేవతగా చెప్పుకుంటారు. కానీ ఆ డబ్బును పంపిణీ చేసే బాధ్యత మాత్రం కుబేరుడిదే. కాబట్టి కుబేరుడిని కూడా పూజించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక స్థిరత్వం, వ్యాపారంలో విజయం, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం వంటివన్నీ కుబేరుడు చేయగలడు.
కుబేర యంత్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. సంపద, విజయం వంటివి దక్కుతాయి. కాబట్టి ఇంట్లో కుబేర యంత్రం తప్పనిసరిగా పెట్టుకోండి. కుబేర యంత్రాన్ని మీరు డబ్బు పెట్టే చోట, బంగారం దాచే చోట ఉంచితే మంచిదని అంటారు. ఈ యంత్రం సంపదను, శక్తులను ఆకర్షిస్తుంది. ఈ కుబేర యంత్రం రేఖాగణిత చిత్రంలాగా ఉంటుంది. ఇది స్థిరమైన ఆర్థిక అభివృద్ధిని అందిస్తుంది. నష్టాలనుండి బయటపడేస్తుంది.
కుబేర దేవాలయాలలో ఆచారాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఇతడికి ఉత్తరాఖండ్ లోని అల్మారాలో ఒక కుబేర ఆలయం ఉంది. ఇక్కడ కుబేరుడికి పాయసాన్ని ప్రసాదంగా అందించాలి. ఇలా చేయడం వల్ల కుబేరుడి ఆశీస్సులు దక్కుతాయని చెబుతారు. వారి జీవితాల్లో సంపద కురుస్తుందని అంటారు.
Also Read: శివునికి తులసి ఆకులతో ఎందుకు పూజ చేయకూడదు?
ఉత్తరాఖండ్‌లోని మరొక ఆలయం ఉంది. ఇక్కడ వెండి నాణాన్ని ఇస్తారు. భక్తులు ఆ వెండి నాణాన్ని పసుపు రంగు వస్త్రంలో చుట్టి ఇంట్లో డబ్బు పెట్టే లాకర్లలో ఉంచుకుంటే మంచిదని చెబుతారు. ఇది వారి డబ్బును రెండింతలు చేస్తుందని, ఆర్థిక విషయాలలో సానుకూల శక్తిని ప్రసరించేలా సహాయపడుతుందని అంటారు. స్వచ్ఛమైన భక్తితో ఆలయాన్ని సందర్శించే ఏ భక్తుడిని కూడా కుబేరుడు ఖాళీ చేతులతో పంపించడని చెబుతారు.