విష్ణు పురాణంలో విశ్వం సృష్టి నుంచి నాశనం వరకు అన్ని విషయాల ప్రస్తావనలో ఉన్నాయి. ఈ సృష్టిని ఎవరు పాలిస్తారు? కలియుగంలో వినాశనం ఎలా జరుగుతుంది? వంటి అనేక అంశాలను విష్ణు పురాణంలో చర్చించారు. ఇప్పుడు మనం కలియుగంలోనే ఉన్నాము. విష్ణు పురాణం ప్రకారం కలియుగంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. కలియుగం అంతానికి వచ్చేసరికి దుర్భరమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి.
విష్ణు పురాణంలో ఎన్ని శ్లోకాలు
విష్ణు పురాణంలో 23 వేల శ్లోకాలు ఉన్నాయి. దీని ప్రకారం విష్ణువే ప్రధాన దేవుడు. ఈ పురాణం ధర్మం, నీతి ప్రాముఖ్యతను భక్తులకు చెబుతుంది. మనుషులు ఎలా ప్రవర్తించాలో జీవితాన్ని ఎలా గడపాలో కూడా వివరిస్తుంది. విష్ణు పురాణం మైత్రేయ మహర్షి అతని గురువైన పరాశర మహర్షి మధ్య సంభాషణతో ప్రారంభమవుతుంది అని విష్ణు పురాణం చెబుతోంది.
విష్ణు పురాణం ప్రకారం కలియుగంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. అవి మన ఊహకు కూడా అందని విధంగా కలియుగం ముగింపు దశకు వస్తున్నప్పుడు మనిషి జీవితం దుర్భరంగా మారిపోతుంది. అతడు పురుగులాగా జీవితం సాగించాల్సి వస్తుంది.
విష్ణు పురాణం ప్రకారం కలియుగం వయస్సు 4,32,000 సంవత్సరాలు. కలియుగం ప్రారంభమై 5,126 సంవత్సరాలు గడిచాయి. అంటే ఇంకా కలియుగం 4,26,874 సంవత్సరాలు కొనసాగుతుంది.అప్పటికి మనిషి జీవితం భూమిపై దుర్భరంగా మారిపోతుంది.
కలియుగంలో అన్యాయం, అధర్మం పెరిగిపోతాయి. దానివల్ల మనుషులు ఎంతో బాధలు పడతారు. మానవత్వం, దయ, సానుభూతి వంటి మనుషుల లక్షణాలను దాదాపు ప్రజలు మరిచిపోతారు. ఎదుటి మనుషులు పట్ల భయంకరంగా ప్రవర్తిస్తారు.
విష్ణు పురాణం చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి జుట్టు 12 సంవత్సరాల నుంచే నెరిసిపోవడం ప్రారంభమవుతుంది. అంటే వారు 12 ఏళ్ళకే ముసలివారు అవ్వడం మొదలవుతుంది. 20 ఏళ్ల సంవత్సరానికే వారు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కలియుగాంతానికి ముందు చాలా చిన్న వయసులోనే ప్రజలు చనిపోతారు. అంటే మనుషుల ఆయుర్దాయం తగ్గిపోయి 20 ఏళ్లకు వచ్చేస్తుంది. కలియుగం చివరినాటికే ఒక వ్యక్తి 12 నుంచి 20 ఏళ్ల వరకు మాత్రమే జీవిస్తాడు.
ఆరేళ్లకే గర్భం
కలియుగంలో మనుషుల ఆయుష్షు తగ్గిపోవడమే కాదు… వారు తల్లిదండ్రులు అయ్యే వయస్సు కూడా చాలా తగ్గిపోతుంది. అమ్మాయిలు ఆరేడు సంవత్సరాలకే గర్భం ధరించి తల్లులు అవుతారు. ఇక అబ్బాయిలు ఎనిమిదేళ్లకే తండ్రులుగా మారుతారు.
కలియుగంలో మానవుల వయసుతో పాటూ వారి ఎత్తు కూడా కుచించుకుపోతుంది. ఇప్పుడు మనిషి సగటు ఎత్తు 5 అడుగుల ఆరు అంగుళాల వరకు వరకు ఉంటుంది. కానీ కలియుగం చివరినాటికి వచ్చేసరికి ఒక మనిషి ఎత్తు నాలుగు అంగుళాలు తగ్గిపోతుంది. మనుషుల జీవితం కీటకంలా మారిపోతుంది. అంటే కీటకాలు ఎంత దుర్భరంగా జీవిస్తాయో, ఎంత తక్కువకాలం జీవిస్తాయో మనిషి కూడా అలా పురుగుల మారి తక్కువ కాలంలోనే దుర్భరమైన మరణాన్ని పొందుతాడు.
విష్ణు పురాణంలోని ఆరవ అధ్యాయంలో కలియుగం గురించి వివరించారు. అది ఎంత దుర్మార్గంగా, క్రూరంగా, బాధలతో నిండి ఉంటుందో వివరించారు. అయితే అలాంటి కాలంలో కూడా విష్ణువుకు తమను తాను అంకితం చేసుకోవడం ద్వారా అద్భుతమైన మోక్షాన్ని పొందవచ్చని విష్ణుపురాణం చెబుతోంది.