దక్షిణ భారతదేశము ఎన్నో ఆలయాలకు నెలవు. వేలకొద్దీ ఆలయాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువ గుడులు ఉన్నట్టు చెబుతారు. అయితే దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక ఆలయంలో ఏడాదికి ఒక రోజు పురుషులను అడుగుపెట్టకుండా నిషేధం విధించారు. అక్కడ మహిళలు మాత్రమే ఆరోజు పెద్ద వేడుకలు నిర్వహిస్తారు. ఆ ఆలయం పేరు అట్టుకల్ భగవతి ఆలయం.
అట్టుకల్ భగవతి ఆలయం
ఈ ఆలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ప్రతి ఏడాది అక్కడ పొంగళ పండుగ నిర్వహిస్తారు. ఆ పండుగలో వందలాది మంది మహిళలు తిరువనంతపురంలో వీధుల్లో గుమిగూడుతారు. దేవతకు పూజలు చేస్తారు. మట్టికుండలలో బియ్యం, బెల్లం కలిపి ప్రసాదం వండి సమర్పిస్తారు. ఆ సమయంలో ఆ ఆలయ ప్రాంగణంలోకి పురుషులు ఎవరూ అడుగు పెట్టకూడదు. అయితే ఇది తాత్కాలిక నిషేధం మాత్రమే. స్త్రీ భక్తిని ఉన్నతంగా చూపించడానికి సాంప్రదాయాల్లో దీని భాగం చేసినట్టు అంటారు.
మహిళల శబరిమల ఇది
ఈ ఆలయానికి మహిళల శబరిమల అని కూడా పిలుచుకుంటారు. ఎందుకంటే శబరిమలకు ఎప్పటినుంచో మహిళలపై నిషేధం ఉంది. ఆ విషయంలో ఎన్నో వివాదాలు కూడా జరుగుతున్నాయి. అందుకే అట్టుకల్ భగవతి ఆలయాన్ని మహిళల శబరిమల అని అంటారు. పొంగళ్ల సమయంలో స్త్రీల అధికారమే అక్కడ కనిపిస్తుంది. మహిళలంతా ఇక్కడ సామూహికంగా పూజలు నిర్వహిస్తారు.
కేవలం ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే ఈ ఆలయానికి పురుషులపై నిషేధం ఉంటుంది. మిగతా రోజుల్లో ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేయవచ్చు.
అయితే పొంగళ పండుగ సమయంలో పురుషులను ఈ ఆలయం నుంచి బయట ఉంచడం వివక్షతేనని అంటున్నవారు కూడా ఉన్నారు. అయితే శబరిమల వంటి ఆలయాల్లోకి మహిళలకు ఎంట్రీ లేకపోవడం గురించి మాత్రం వీరు ఏమీ వాదించడం లేదు. స్థానిక మతపరమైన అధ్యయనాలు, సాంస్కృతిక ఆచారాలను బట్టి ఆలయంలోని వివిధ వేడుకలు ఆధారపడి ఉంటున్నాయి. అయితే ఈ అట్టుకల్ భగవతి ఆలయం ప్రాంగణంలోకి పూర్తిగా పురుషులు నిషిద్ధం కాదు. భద్రతా సిబ్బంది, ఆలయ అధికారులు, పూజారులు, ప్రత్యేక పాసులు కలిగిన పురుషులు మాత్రం వెళతారు. సాధారణ పురుషులు మాత్రం వెళ్లలేరు.
అటుకల్ భగవతి ఆలయం స్త్రీ లింగత్వాన్ని ఉన్నతంగా చూపించడానికి నిర్మించారని చెబుతారు. మహిళల నాయకత్వం గురించి, వారి భక్తిని ప్రపంచానికి చెప్పేందుకు ఇలాంటి నియమాలు పెట్టారని అంటారు.
ఆరోజు ఆలయంలోకి అడుగు పెట్టకపోయినా… ఆలయం బయట మాత్రం పురుషులకు తగిన గౌరవం లభిస్తుంది. ఈ పండుగకు ఎంతోమంది విదేశీయులు కూడా వచ్చి బియ్యము బెల్లంతో పరమాన్నాన్ని వండి సమర్పిస్తారు.