పనీర్ వంటకాలు అనగానే పనీర్ బిర్యాని, పనీర్ బటర్ మసాలా, పాలక్ పనీర్ వంటివే గుర్తుకు వస్తాయి. ఎప్పుడూ అవే చేసుకుంటే ఎలా? ఒకసారి కొత్తగా స్వీట్ ను ప్రయత్నించండి. చాలా తక్కువ సమయంలోనే మీరు పనీర్ బర్ఫీని తయారు చేయవచ్చు. బయట స్వీట్ట్ షాపులో కొనే తీపి పదార్థాల కన్నా ఈ పనీర్ బర్ఫీ ఆరోగ్యకరం. పైగా చాలా రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి ఇంట్లోనే కేవలం పావుగంటలో పనీర్ బర్ఫీ ఎలా చేయాలో తెలుసుకోండి.
పనీర్ బర్ఫీ రెసిపీకి కావలసిన పదార్థాలు
పనీర్ తురుము – 400 గ్రాములు
కండెన్స్‌డ్ మిల్క్ – 300 గ్రాములు
పాలపొడి – అరకప్పు
ఫుల్ క్రీం పాలు – అరకప్పు
యాలకుల పొడి – అర స్పూను
చక్కెర – పావు కప్పు
పనీర్ బర్ఫీ రెసిపీ
1. స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు పోసి మరిగించండి.
2. అవి బాగా మరిగాక తురిమిన పనీర్ ను అందులో వేసి బాగా కలపండి.
3. ఈ మిశ్రమం దగ్గరగా చిక్కబడే వరకు ఉడికించండి.
4. ఇప్పుడు అందులో కండెన్స్‌డ్ మిల్క్ కూడా వేసి బాగా కలపండి.
5. ఆ తరువాత పాల పొడి, పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలపండి.
6. గడ్డలు ఏర్పడకుండా నిత్యం కలుపుతూ ఉండండి.
7.ఇది చిక్కగా దగ్గరగా హల్వా లాగా అయ్యేవరకు కలపాలి.
8.ఆ తర్వాత దాన్ని గోరువెచ్చగా అయ్యేవరకు ఉంచాలి.
9. ఒక ప్లేటుకి కొంచెం నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పరచాలి. దాన్ని చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి.
10. కావాలంటే ఫ్రిజ్లో పెట్టుకుంటే త్వరగా చల్లారిపోతుంది. ఒక అరగంట తర్వాత దాన్ని ముక్కలుగా కోసుకుంటే బర్ఫీలు రెడీ అయిపోతాయి.
11. పైన పిస్తా పప్పులు లేదా బాదం పప్పులు వంటివి చల్లుకుంటే రుచిగా ఉంటాయి.
ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో ఒకసారి పనీరు బర్ఫీ చేసి చూడండి మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.
ఎవరైనా ఇంటికి అతిధులు హఠాత్తుగా వచ్చినప్పుడు ఈ పనీర్ బర్ఫీని చేసి పెడితే వారికి కొత్తగా టేస్టీగా అనిపిస్తుంది. అలాగే పిల్లలకు కూడా స్వీట్లు బయటకొనే బదులు ఇలా ఇంట్లోనే పనీర్ బర్ఫీలా చేసి పెట్టండి. ఇది ఎంతో బలం కూడా. ఇందులో మనం పంచదారను తక్కువే వేసాము. మిగతాదంతా కూడా పాలు ఆధారిత పదార్థాలతోనే పదార్థాలే అధికంగా ఉన్నాయి. కాబట్టి ఒక బర్ఫీ తిన్న కడుపు నిండినట్టు అనిపిస్తుంది. శక్తి కూడా నిరంతరం అందుతుంది.