Cyclone Montha: రాష్ట్రంలో కొనసాగుతున్న మొంథా తుఫాను నేపథ్యంలో తలెత్తే పరిణామాలపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న మహబూబాబాద్, ములుగు జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అత్యవసర చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
చలిగాలులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, పశువుల కాపరులు తమ పశువులు, పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, అలాగే ప్రజలు వాగులు, చెరువులు దాటే ప్రయత్నం చేయరాదని, నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సీతక్క కోరారు.
పలు చోట్ల రైళ్లు నిలిచిపోయినట్లు సమాచారం అందుతున్న నేపథ్యంలో, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు ఆహారం, తాగునీరు వంటి అవసరాలు తీర్చాలని సూచించారు. తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని మంత్రి సీతక్క కోరారు.
మరోవైపు తెలంగాణలో పలు జిల్లాల్లో మొంథా తుఫాన్ ప్రభావం పడిందని ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 12 నుంచి 24 గంటల్లో తుఫాన్ తీవ్రత తగ్గనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.