BigTV English

Lord shiva Temples in World: స్థితికంఠుడి ఆలయాలు అపురూపాలు – మీకు తెలియని శివాలయాలెన్నో

Lord shiva Temples in World: స్థితికంఠుడి ఆలయాలు అపురూపాలు – మీకు తెలియని శివాలయాలెన్నో

Lord shiva Temples in World: అసలే.. భోళా శంకరుడు! ఆపై భక్తుల కోసమే వెలిసిన మహా దేవుడు. అలాంటి శివుడు కేవలం ఈ హిందూ దేశంలోనే కాదు.. ప్రపంచ దేశాల్లోనూ కొలువయ్యాడు. భక్తుల కొంగుబంగారమైన నిలిచాడు. నేపాల్, శ్రీలంక, పాకిస్థాన్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఇలా ఎన్నో దేశాల్లో.. ప్రఖ్యాత క్షేత్రాల్లో లింగరూపుడై వెలిశాడు. అక్కడున్న భక్తులంతా.. పరమశివున్ని వందల ఏళ్లుగా పరమభక్తితో కొలుస్తున్నారు. ఇంతకీ ఆ ఆలయాలేంటి? వాటి ప్రాముఖ్యతేంటి?


శివుడంటే.. మాటలకందని మహిమాన్విత దేవుడు!

వెండి కొండల్నే కాదు.. ఈ జగాన్నే ఏలేటోడు శివుడు. ఆది, అంత్యాలు లేనోడు.. కంటిచూపుతోనే ఈ సృష్టిని నడిపేటోడు ఆ పరమేశ్వరుడు. ఈ సృష్టిలో ప్రతి చోటు తనదే. భక్తజన ప్రియంకరుడిగా.. భక్తులు కోరిన చోటల్లా వెలిసి.. వారికి అండగా నిలిచినోడు పరమేశ్వరుడు. శివుడంటే.. మాటలకందని మహిమాన్విత దేవుడు. కొలిచేకొద్దీ కొంగుబంగారమయ్యే శక్తి స్వరూపుడు. కేవలం ఈ భారత నేలమీదే కాదు.. ప్రపంచ దేశాల్లోనూ కొలువై.. ఎక్కడికక్కడ భక్తులకు దర్శనమిస్తున్నాడు. వివిధ దేశాల్లోని ప్రఖ్యాత శైవక్షేత్రాలన్నీ.. నిత్యం శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.


నేపాల్‌లో పశుపతినాథ్‌గా కొలువైన పరమేశ్వరుడు

భారత్ తర్వాత ఎక్కువ శివాలయాలున్న దేశం నేపాల్. సుప్రసిద్ధ 275 శైవక్షేత్రాల్లో పశుపతినాథ్ ఆలయం ఒకటి. ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయాన్ని.. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో సోమదేవ్ రాజవంశానికి చెందిన పశుప్రేక్ష అనే రాజు నిర్మించాడని ప్రతీతి. పశుపతినాథుడి దర్శనానికి.. హిందువులు మాత్రమే వెళ్లగలరు. ఇతర మతాలకు చెందిన వారికి ఆలయ ప్రవేశం లేదు.  ఈ పశుపతినాథ్ ఆలయాన్ని.. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్‌నాథ్‌లో సగంగా భావిస్తారు.

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పంచముఖ శివలింగం

ఈ ఆలయం నేపాల్ రాజధాని ఖాట్మండుకు దగ్గరలో.. భాగమతి నది ఒడ్డున కొలువై ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పంచముఖ శివలింగం ఉంటుంది. ఈ ఐదు ముఖాలు విభిన్నమైన లక్షణాలని కలిగి ఉంటాయి. దక్షిణం వైపు అఘోర ముఖం, పడమర వైపు సద్యోజాత్, తూర్పు వైపు తత్పురుష, ఉత్తరం వైపు అర్ధనారీశ్వర ముఖమని చెబుతారు. పైకి ఉండే ముఖాన్ని.. ఇషాన్ ముఖ అంటారు. ఇది.. భగవాన్ పశుపతినాథుడికి సంబంధించిన ఉత్తమ ముఖంగా భావిస్తారు. మత గ్రంథాల ప్రకారం పశుపతినాథ్.. పరబ్రహ్మ శివుని శాశ్వతమైన రూపం.

శివుని దర్శనానికి ముందు నందిని దర్శనం చేసుకోకూడదు

హిందూ పురాణాల ప్రకారం.. పశుపతినాథ్ ఆలయ చరిత్ర వేల సంవత్సరాల నాటిది. ఈ పంచముఖ లింగాన్ని దర్శిస్తే.. మనిషి మోక్షాన్ని పొందుతారని విశ్వసిస్తారు. పశుపతినాథ్ ఆలయానికి వెళ్లిన వారెవరైనా.. శివుని దర్శనానికి ముందు నందిని దర్శనం చేసుకోకూడదు. అలా చేస్తే.. మృగం రూపంలో జన్మిస్తారని నమ్ముతారు. ఇక.. పురాణకాలం నుంచి ఈ ఆలయంలోకి.. పక్కనే ఉన్న ఆర్య ఘాట్ నీటిని మాత్రమే తీసుకెళ్తారు. ఇతర ప్రదేశాల నుంచి తెచ్చిన నీటితో.. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించడం నిషేధం.

పశుపతినాథుడు లేని కేదార్‌నాథ్ దర్శనం అసంపూర్ణంగా పరిగణిస్తారు

ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌కు, నేపాల్‌కు చెందిన పశుపతినాథ్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. పశుపతినాథుడు లేని కేదార్‌నాథ్ దర్శనం అసంపూర్ణంగా పరిగణిస్తారు. పురాణాల ప్రకారం కేదార్‌నాథ్‌లో శివుడి శరీరం ఉందని.. పశుపతినాథ్‌లో శివుడి తల ఉందని విశ్వసిస్తారు. అందుకే.. కేదార్‌నాథ్, పశుపతినాథ్ ఆలయాలని దర్శిస్తేనే.. సంపూర్ణమని చెబుతారు. పరమశివుడు కేదార్‌నాథ్‌లో నంది మూపురం రూపంలోనూ.. పశుపతినాథ్‌లో నంది తల రూపంలోనూ కొలువై ఉన్నట్లు చెబుతారు.

శివుడిని క్షమాపణ కోరేందుకు పాండవులు కాశీకి వెళతారు

పురాణాల ప్రకారం.. మహాభారత యుద్ధంలో తన సొంతవారి మరణానికి కారణమైన పాండవులపై శివుడు కోపంగా ఉంటాడు. యుద్ధం ముగిశాక.. తమ పాప ప్రక్షాళనకు.. పాండవులు శివుడిని పూజించాలనుకున్నారు. అలా.. శివుడిని క్షమాపణ కోరేందుకు పాండవులు కాశీకి వెళతారు. అయితే పాండవులకు తన దర్శనభాగ్యం కలిగించకూడదనుకున్న శివుడు.. వారణాసి నుంచి మాయమై కేదార్‌నాథ్‌ చేరుకున్నాడు. శివుడిని వెంబడిస్తూ పాండవులు కూడా కేదార్‌నాథ్ చేరుకుంటారు.

నేపాల్‌లో పశుపతినాథ్ పేరుతో ప్రసిద్ధి

అక్కడ.. శివుడు నంది రూపాన్ని ధరించి సంచరిస్తుండగా.. పాండవులు గుర్తిస్తారు. అప్పుడు.. భూమిలోకి వెళ్లి అదృశ్యం కావాలనుకుంటాడు పరమేశ్వరుడు. ఇది గ్రహించిన భీముడు.. నంది రూపంలోని శివుడిని పట్టుకుంటాడు. దాంతో.. శివుడి తల మరో ప్రదేశానికి చేరుకుంటుంది. శరీరం కేదార్‌నాథ్‌లోనే మిగిలిపోయింది. అప్పటి నుంచి శివుని శరీర భాగాన్ని కేదార్‌నాథ్‌లో పూజించడం ప్రారంభమైంది. శివుడి తల చేరిన ప్రదేశమే.. నేపాల్‌లో పశుపతినాథ్ పేరుతో ప్రసిద్ధి చెందింది.

నేపాల మహత్యం హిమవత్ ఖండంలో ఉంది

గో ఇతిహాసం ప్రకారం.. ఓరోజు శివుడు పార్వతితో కలిసి భాగమతి నదీ తీరంలోని మృగస్థలి అనే ప్రదేశంలో.. పార్వతీ సమేతంగా వచ్చి.. జింక అవతారంలో నిద్రిస్తారు. ఆయన్ని తిరిగి కాశీ తరలించేందుకు.. దేవతలు కొమ్ములు పట్టుకొని లాగుతారు. ఒ ఒత్తిడికి జింక కొమ్ము నాలుగు ముక్కలుగా విరిగి.. అక్కడి నేలపై పడతాయి. ఆ నాలుగు కొమ్ములే.. చతుర్ముఖ లింగంగా ఏర్పడిందని.. నేపాల మహత్యం హిమవత్ ఖండంలో ఉంది.

పశుపతినాథుడి ముందు ఎవరైనా సరే.. నిజం చెప్పి తీరాల్సిందే!

నేపాల్ ప్రజలు తాము చల్లగా ఉండటానికి పశుపతినాథుడే కారణమని భావిస్తుంటారు. ఇక్కడి ఆలయ అర్చకులు.. నేరుగా నేపాల్ రాజుకే జవాబుదారీగా వుంటారు. దీనిని బట్టి.. ఈ ఆలయం నేపాల్‌కి ఎంత ప్రత్యేకమైనదో తెలుస్తుంది. పశుపతినాథుడి ముందు ఎవరైనా సరే.. నిజం చెప్పి తీరాల్సిందే! అబద్ధం చెప్పడానికి వీలు లేదు. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు.. ఆలయంలోని ధర్మశాల ముందు ప్రమాణం చేయించడం కూడా ఓ ఆచారం.

విదేశాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తారు

నేపాల్‌లో తరచుగా ప్రకృతి విపత్తులు సంభవిస్తుంటాయి. అయినప్పటికీ.. పశుపతినాథ్ ఆలయం వాటన్నింటిని తట్టుకొని మరీ నిలబడింది. ఇప్పటికీ.. ఆలయం ఏమాత్రం చెక్కుచెదరలేదు. మహాశివరాత్రి రోజున పశుపతినాథుని దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి భక్తులు అపరిమిత సంఖ్యలో వస్తారు. పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివరాత్రి రోజున ఇక్కడ భాగమతి నదిలో స్నానమాచరించి.. పశుపతినాథుడిని దర్శించుకుంటే పుణ్యం దక్కుందని భక్తులు విశ్వసిస్తారు.

ప్రపంచ దేశాల్లోనూ కొలువై దర్శనమిస్తున్న పరమశివుడు

పరమశివునికి సంబంధించిన అనేక పురాతన ఆలయాలు.. భారతదేశంలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. అఖండ భారతంలో భాగమైన అన్ని దేశాల్లోనూ.. ప్రాచీన శివాలయాలున్నాయ్. లయకారుడిని వివిధ రూపాలతో, నామాలతో భక్తులు ఇప్పటికీ పూజిస్తున్నారు. అలా.. శ్రీలంకలో మున్నేశ్వరం, పాకిస్థాన్‌లో కటాసరాజ ఆలయం.. సుప్రసిద్ధ శైవక్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. ప్రతి ఆలయానికి ఓ చరిత్ర, ఆధ్యాత్మిక విశిష్టత ఉన్నాయి.

శ్రీలంకలో పురాతన శివుని కోవెల మున్నేశ్వర ఆలయం

శ్రీలంకలోని ఐదు పురాతన ఆలయాల్లో మున్నేశ్వరం ఒకటి. ఇది.. ఆ దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ఈ ఆలయంలోని శివలింగం శ్రీరాముని అవతారం కంటే ముందు నుంచే ఉందని ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక్కడ శివున్ని.. మున్నైనాథ్ స్వామిగా కొలుస్తారు. పార్వతిదేవిని.. వడివాంబిగా దేవిగా పిలుస్తారు. రావణసంహారం కోసం శ్రీరామచంద్రుడు శ్రీలంకకు వచ్చినప్పుడు.. ఇక్కడి శివలింగాన్ని పూజించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం 1000 CE కాలంలోనే నిర్మించారని చెబుతుంటారు. ఈ ప్రాంతంలో శివునికి అంకితం చేసిన పురాతన పంచ ఈశ్వరాల్లో మున్నేశ్వర ఆలయం ఒకటి.

శ్రీలంకలో పురాతన శివుని కోవెల మున్నేశ్వర ఆలయం

ఈ ఆలయంతో ముడిపడి ఉన్న అనేక పురాణాలు.. వివిధ మత, జాతి సమూహాలతో మారుతూ వచ్చాయి. హిందూ తమిళులకు మున్నేశ్వరం ఓ శివాలయం. అదే.. పట్టువా వెలుపలి నుంచి వచ్చిన సింహళ బౌద్ధులకు.. మున్నేశ్వరం ఓ దేవత ఆలయం. ఈ ఆలయాన్ని పోర్చుగీసు అధికారులు రెండుసార్లు విధ్వంసం చేశారు. అయినప్పటికీ.. స్థానికులు రెండుసార్లు ఆలయాన్ని పునర్నిర్మించారు. ఇప్పుడున్న ఆలయాన్ని 1875లో.. కొలంబోకు చెందిన శ్రీ కుమారస్వామి గురూజీ అనే భక్తుడు నిర్మించాడు. మున్నేశ్వరం ఆలయం శివరాత్రి, నవరాత్రి ఉత్సవాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో జరిగే ఉత్సవాలకు.. శ్రీలంకలోని ప్రతి మూల నుంచి భక్తులు భారీ సంఖ్యలో వచ్చి పాల్గొంటారు.

శ్రీలంక అంటే గుర్తొచ్చేది రామాయణమే

శ్రీలంక అంటే గుర్తొచ్చేది రామాయణమే. అందులోనూ రావణ లంకగానే.. శ్రీలంక ఎక్కువ ప్రసిద్ధి చెందింది. అలాంటి రావణ లంకలో కొలువైంది.. ఈ మున్నేశ్వర దేవాలయం. రావణుడు.. గొప్ప శివ భక్తుడు. ఆ పరమశివునికి సైతం అత్యంత ఇష్టమైనవాడు. శివునికి ఉన్న గొప్ప భక్తుల్లో రావణుడు ఒకరు. అందుకే.. ఏ భక్తునికీ దక్కని గౌరవం రావణాసురుడికి దక్కింది. నంది వాహనం లాగే.. ఆ శివుడి ఊరేగింపులో ఇప్పుడు రావణ వాహనం కూడా ఉంది. ఉత్సవాల్లో.. పరమశివుడిని రావణ వాహనంపై ఊరేగించడం సంప్రదాయంగా వస్తోంది. పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తుల్ని.. రావణ వాహనంపై అధిష్టించి.. శాస్త్రోక్తంగా పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

పాకిస్థాన్‌లోనూ 5 వేల ఏళ్ల నాటి పురాతన శివాలయం

మన దాయాది దేశం పాకిస్థాన్‌లో.. హిందూ దేవాలయాలుండటం చాలా అరుదు. అలాంటి వాటిలో చారిత్రక విశిష్టత కలిగిన దేవాలయం.. కటాసరాజ ఆలయం. ఒకప్పుడు అఖండ భారతంలో భాగమైన పాకిస్థాన్‌లో.. ఈ పురాతన శివాలయం కొలువై ఉంది. సుమారు 5 వేల ఏళ్ల క్రితం నాటి ఈ గుడి.. శివునికి అంకితమై ఉంది. పాకిస్థాన్‌ పంజాబ్ రాష్ట్రంలోని చక్వాల్ జిల్లాకు.. దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ చారిత్రక ఆలయం. ఇది.. మహాభారతకాలం నాటి ఆలయమని చెబుతారు.

హిందువులకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం కటాసరాజ ఆలయం

అందులోని.. యక్ష ప్రశ్నల సన్నివేశం.. ఈ కటాస క్షేత్రంలోని అమృత్‌కుండ్ దగ్గరే జరిగింది. ఇక్కడే మరో ఏడుగురు దేవుళ్లు, దేవతల ఆలయాలున్నాయి. వీటిని.. సత్గ్రహ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడే. పాండవులు.. వనవాసం గడిపింది కూడా ఇక్కడే. కటాసరాజ ఆలయంలోని శివలింగాన్ని శ్రీకృష్ణుడే స్వయంగా తయారుచేసినట్లుగా చెబుతారు. అందుకే ఈ తీర్థ క్షేత్రానికి ఇంతటి ఘనకీర్తి లభించిందంటారు.

ప్రతి ఏటా వేలాది మంది హిందూ భక్తులు

కటాసరాజ్ ఆలయం హిందువులకు ఓ ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ప్రతి ఏటా వేలాది మంది హిందూ భక్తులు.. ఇక్కడికి దర్శనానికి వస్తుంటారు. ఈ ఆలయం.. ఓ పెద్ద చెరువు చుట్టూ నిర్మించారు. ఇది.. సాక్షాత్తూ.. ఆ పరమశివుని కన్నీటితో ఏర్పడిందని నమ్ముతారు. పురాణాల ప్రకారం శివుడు తన భార్య సతీదేవితో ఇక్కడే నివసించాడని ప్రతీతి. దక్ష యజ్ఞంలో సతీదేవి ప్రాయోప్రవేశం చేసి మరణించడంతో.. శివుడు కన్నీళ్లని ఆపుకోలేకపోయాడు.

ఈ ఆలయం.. పాకిస్థాన్‌లోని ఓ ప్రధాన టూరిస్ట్ స్పాట్

అలా.. శివుని కన్నీరు నుంచి ఈ సరస్సు ఉద్భవించింది. దాని వల్లే.. ఈ ఆలయానికి కటాస్ అనే పేరొచ్చిందంటారు. ఈ సరస్సులో స్నానమాచరిస్తే.. చేసిన పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. మహా శివరాత్రి వేళ.. భక్తజనం ఈ ఆలయాన్ని విశేషంగా దర్శిస్తారు. ఈ ఆలయం.. పాకిస్థాన్‌లోని ఓ ప్రధాన టూరిస్ట్ స్పాట్. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ కూడా ఈ కటాస్‌రాజ్ ఆలయాన్ని సందర్శించినట్లు చరిత్ర చెబుతోంది. దేశ విభజనకు ముందు ఈ ఆలయానికి భారతీయులు కూడా వెళ్లేవారు. కాలక్రమేణా.. భారత్ నుంచి రాకపోకలు తగ్గిపోయాయి.

ఇండోనేషియాలో అతిపెద్ద హిందూ ఆలయం ప్రంబనన్

భారతదేశానికి ఆవల ఉన్న ప్రాచీన ఆలయాల ప్రస్తావన ఎప్పుడొచ్చినా.. ఇండోనేషియాలోని ప్రంబనన్ ఆలయం గురించి కచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే.. ఇది ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ ఆలయం. ఆ మాటకొస్తే.. ప్రపంచంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటి. లక్షన్నర చదరపు మీటర్ల వైశాల్యంతో.. 150 అడుగులకి పైగా ఎత్తున్న విమానగోపురంతో.. వెయ్యేళ్ల చరిత్రకు చిహ్నంగా ఉండే ఈ ఆలయం ఇప్పటికీ ప్రముఖ క్షేత్రంగా భాసిల్లుతోంది. ఇందులో కొలువై ఉన్న త్రిమూర్తుల్లో.. పరమశివుని ఆలయం ప్రధానంగా కనిపిస్తుంది.

వెయ్యేళ్ల చరిత్రకు చిహ్నంగా ప్రంబనన్ ఆలయం

ఎనిమిదో శతాబ్దంలో.. ఇండోనేషియాలోని జావా ద్వీపంపై సంజయ అనే రాజవంశం ఓ వెలుగు వెలిగింది. అందులో ఓ రాజు తొమ్మిదో శతాబ్దిలో ఒపాక్ అనే నదిని దారిమళ్లించి మరీ.. ఈ ప్రంబనన్ ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాతి వారసులు కూడా దీనిని కొనసాగించడంతో.. ఓ బృహత్తరమైన ఆలయం రూపుదిద్దుకుంది. ఆ సమయంలో.. రాజ్యంలో జరిగే పూజలకు, ఉత్సవాలకు, యజ్ఞయాగాలకు, ఇతర ఆధ్యాత్మిక క్రతువులన్నింటిని.. ప్రంబనన్ ఆలయం వేదికగా ఉండేది.

ప్రంబనన్ ఆలయంలో ప్రధాన దైవం పరమశివుడే!

అందుకే.. ఈ ఆలయంలో వివిధ దేవతలకు చెందిన దాదాపు 240 ఆలయాలు కనిపిస్తాయి. ఈ ప్రంబనన్ ఆలయాన్ని త్రిమూర్తుల పేరున నిర్మించినప్పటికీ.. సంజయ వంశ రాజులు శైవారాధకులు కావడంతో.. ప్రధాన ఆలయంలో శివుడే దర్శనమిస్తాడు. ఈ 3 ఆలయాలకు ఎదురుగా.. ఆయా దేవతల వాహనాలైన నంది, గరుడ, హంసలకు కూడా ఆలయాలుండటం మరో విశేషం.

ఇప్పటికీ ప్రముఖ క్షేత్రంగా భాసిల్లుతున్న ప్రంబనన్ ఆలయం

ప్రంబనన్ ఆలయ గోపురాలు, విగ్రహాలే కాదు.. గోడలు, స్తంభాల పైనా అద్భుతమైన శిల్పచాతుర్యం కనినిస్తుంది. రామాయణ, భాగవత ఘట్టాలు సైతం ఇక్కడ చిత్రాలుగా దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు శిథిలావస్థకు చేరినా.. వేల ఏళ్ల కిందట ఇక్కడ అద్భుతమైన ఆధ్యాత్మిక సామ్రాజ్యం విలసిల్లిందని చెప్పేందుకు అడుగడుగునా ఏదో ఒక ఆనవాలు కనిపిస్తూనే ఉంటుంది. వందల ఏళ్ల క్రితం.. అనేక కారణాలతో ప్రంబనన్ ఆలయం ప్రాభవం తగ్గింది. తర్వాతి కాలంలో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడంతో.. ఈ చారిత్రక ఆలయం కాలగర్భంలో కలిసిపోకుండా.. ఇప్పటికీ ఠీవిగా నిలిచి ఉంది.

ఆస్ట్రేలియాలో 13వ జ్యోతిర్లింగంగా కొలువైన శివుడు

ఇక.. భారతదేశంలో 12 జ్యోతిర్లింగ క్షేత్రాలుంటే.. ఆస్ట్రేలియాలో 13వ జ్యోతిర్లింగం ఉందనే పురాణగాథలున్నాయి. ఇది.. 1999లో నేపాల్ రాజు బీరేంద్ర బీర్ బిక్రమ్ షా దేవ్.. ఆస్ట్రేలియాకు బహుమతిగా ఇచ్చిన చివరి జ్యోతిర్లింగంగా చెబుతారు. శివపురాణం ప్రకారం.. ఇది పదమూడవ జ్యోతిర్లింగం.

ఆస్ట్రేలియాలోని మింటో నగరంలో ముక్తి గుప్తేశ్వర్ ఆలయం

ముక్తి అనే పేరుతో.. అత్యున్నత శక్తితో ఆత్మ ఐక్యత దశను ఇది సూచిస్తుంది. అందువల్ల.. 13 జ్యోతిర్లింగాల్లో.. ముక్తి లింగం చివరిది. దీనిని.. ప్రతి వందేళ్లకు ఓసారి జరిగే.. వివిధ నక్షత్రాలు, గ్రహాల కూటమి సమయంలో.. ప్రతిష్టించారు. ఆస్ట్రేలియాలోని మింటో నగరంలో.. ఈ ముక్తి గుప్తేశ్వర్ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది.. మానవ నిర్మిత గుహ ఆలయం. శివునికి ఉన్న 1129 పేర్లలో ఈ ముక్తి-గుప్తేశ్వర్ ఒకటి.

భూగర్భంలో ఉన్న ముక్తి గుప్తేశ్వర్ ఆలయం

ఈ ముక్తి గుప్తేశ్వర్ ఆలయం భూగర్భంలో ఉంది. ఇది.. భూతల్లికి దగ్గరగా ఉండేలా నిర్మించారు. భక్తి ప్రారంభ విధానాన్ని కాపాడేలా, ధ్యానం కోసం నిశ్శబ్ద వాతావరణాన్ని నిర్వహించేలా.. దీనిని రూపొందించారు. ఈ ముక్తి గుప్తేశ్వర ఆలయం.. శివుడికి అంకితం చేసిన ఏకైక మానవ నిర్మిత గుహ ఆలయమని నమ్ముతారు. ఈ మందిరం లోపల.. 1128 చిన్న ఆలయాలున్నాయి. అదేవిధంగా.. మిగతా పన్నెండు జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు, శివుని రుద్ర నామాలను సూచించే.. 108 మానవ నిర్మిత లింగాలు, సహస్ర నామాల్ని సూచించే వెయ్యికి పైగా లింగ ప్రతిపూరాలు ఈ ముక్తి గుప్తేశ్వర్ ఆలయంలో కనిపిస్తాయి. ఆస్ట్రేలియాలో నివసించే హిందువులు.. ఇక్కడి శివుడిని దర్శించుకుంటారు.

ఒమన్‌లోని మస్కట్‌లో కొలువైన పరమశివుని దివ్యమందిరం

మధ్యప్రాచ్యంలోని పురాతన హిందూ దేవాలయాల్లో ఒకటి.. మోతీశ్వర్ మందిర్. అరబ్ దేశాల్లో.. హిందూ దేవాలయం ఉండటమనేది చాలా అరుదు. అలాంటిది.. ఒమన్‌లోని మస్కట్‌లో కొలువై ఉంది ఈ పరమశివుని దివ్యమందిరం. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పురాతన ఆలయాన్ని.. ఒమన్‌లో నివసిస్తున్న హిందూ భక్త సమాజం సందర్శిస్తుంది. అక్కడ కొలువై ఉన్న పరమశివున్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో.. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది.

మస్కట్‌లో వందల ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన ఆలయం

ఒమన్‌లో.. ఆధ్యాత్మికతకు కొలువైన శక్తిమంతమైన కేంద్రంగా ఈ ఆలయం విలసిల్లుతోంది. ఓల్డ్ మస్కట్‌లోని ముత్రా ప్రాంతంలో.. అల్ ఆలం ప్యాలెస్‌ సమీపంలో ఉన్న ఓ శివాలయ సముదాయం ఈ కోవెల. ఈ ఆలయాన్ని.. 1909 సంవత్సరంలో అఖండ భారతంలోని సింధ్ పాకిస్థాన్ సమాజం నిర్మించిందని నమ్ముతారు. మస్కట్ ఎడారి ప్రాంతమైనప్పటికీ.. ఈ దేవాలయం ఆవరణలో ఉన్న బావిలో.. ఎప్పుడూ నీరు ఉంటుంది.

ఈ దేశం ఆవల ఉన్న మరెన్నో దేశాల్లో కొలువైన శివుడు

నిరాకారుడైన పరమశివుడు.. లింగాకారంలో ఈ జగమంతా ఉన్నాడు. ఒక్క భారత్‌లోనే కాదు.. ఈ దేశం ఆవల ఉన్న మరెన్నో దేశాల్లో.. భక్తులను కాపాడే భగవంతుడిగా కొలువై ఉన్నాడు. ఆ ఈశ్వరుడు కొలువై ఉన్న ప్రతి చోటా.. ఏదో ఒక చరిత్ర ఉంది. మరెన్నో శివలీలలు ముడిపడి ఉన్నాయి. ఈ ప్రపంచంలో హిందూ సమాజం ఎక్కడున్నా.. అక్కడ ఆ పరమేశ్వరుడు అంతర్లీనంగా ఉంటాడు. ఈ జగమంతటినీ కాపాడుతూ ఉంటాడని.. పరమశివుని పరమభక్తులు విశ్వసిస్తారు.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×