Sponsorship for Pakistan: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో పాకిస్తాన్ పై ఘన విజయం సాధించింది.
విరాట్ కోహ్లీ 111 బంతులలో వంద పరుగులు చేసి శతకంతో చెలరేగడంతో 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలోనే నాలుగు వికెట్ల నష్టానికి చేదించింది. ఈ విజయంతో భారత్ సెమిస్ లోకి అడుగుపెట్టింది. ఇక పాకిస్తాన్ జట్టు టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించినట్లే. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు మ్యాచ్లలో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్తాన్ జట్టుకి ఆర్థికంగా, మార్కెట్ వ్యూహ పరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది.
ఈ ఓటమి తర్వాత స్పాన్సర్లను ఆకర్షించడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు {పిసిబి}కి పెద్ద సవాల్ గా మారింది. 2009లో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సు పై లాహోర్ లో ఉగ్రదాడి జరగగా.. అప్పటినుండి 2019 వరకు పాకిస్తాన్ లో పర్యటించేందుకు ఏ క్రికెట్ జట్టు సాహసించలేదు. దీంతో యూఏఈ ని తటస్థ వేదికగా చేసుకుని పాకిస్తాన్ సిరీస్లను ఆడింది. ఈ కారణంగా వేలకోట్లు నష్టపోయింది పిసిబి.
ఆ తరువాత కాస్త కోలుకున్నట్లు కనిపించినా.. కరోనా వైరస్ కారణంగా మళ్లీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. స్పాన్సర్స్ ముందుకు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఇక చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ పాకిస్తాన్ లో 1996 ప్రపంచ కప్ తర్వాత జరిగిన అతిపెద్ద ఐసీసీ టోర్నమెంట్. కానీ ఈసారి పాకిస్తాన్ జట్టు అంచనాలను అందుకోలేకపోయింది. అయితే పీసీబీకి ఐసీసీ ఆదాయంలో తన వాటా హామీ ఇవ్వబడినప్పటికీ.. గేటు రసీదులు, టికెట్ అమ్మకాలు, గ్రౌండ్ ఆదాయంలో నష్టపోతుంది.
అంతేకాకుండా పాకిస్తాన్ జట్టు పేలవమైన ప్రదర్శన వల్ల దాని బ్రాండ్ విలువకు దెబ్బ తగిలి అవకాశం ఉంది. ముఖ్యంగా భారత జట్టు చేతిలో పరాజయం అనంతరం పిసిబి చైర్మన్ నఖ్వీ పై విమర్శలు పెరిగాయి. అతడు స్టేడియాల ఆధునికరణ పై ఎక్కువగా దృష్టి సారించి.. జట్టును గెలిపించే స్థాయికి తీసుకురావడంపై తక్కువ ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలు వచ్చాయి. ఇక మార్కెటింగ్, యాడ్స్ రంగంలో ఉన్న తాహిర్ రెజా అభిప్రాయం ప్రకారం.. “పాకిస్తాన్ లో క్రికెట్ కి క్రేజ్ ఉన్నప్పటికీ.. బ్రాండ్ స్పాన్సర్ల కోసం ప్రధానంగా ప్రదర్శనలే కీలకం.
కానీ జట్టు అంచనాలకు తగ్గట్లుగా రాణించకపోవడంతో కంపెనీలు తమ పెట్టుబడులను ఇతర వినోద రంగాలలో పెట్టడానికి మోగ్గు చూపుతాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ జట్టు తక్కువ ప్రదర్శన చేయడం కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ పదవ ఎడిషన్ పై కూడా ప్రభావం పడనుంది” అని అన్నాడు. ఇక పాకిస్తాన్ జట్టు మెరుగైన ప్రదర్శన చేయకపోవడం వల్ల లీగ్ కోసం ప్రయోజకులు పెట్టుబడులకు వెనకాడతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్తులో పాకిస్తాన్ క్రికెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు.
Sponsorship of Pakistan pic.twitter.com/diQVTxcN5Q
— RVCJ Media (@RVCJ_FB) February 25, 2025