Bathukamma 2025: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ పూల పండుగలో ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన ప్రసాదం, ఒక ప్రత్యేకమైన రంగుతో బతుకమ్మను అలంకరించి పూజిస్తారు. మూడవ రోజు బతుకమ్మను ముద్ద పప్పు బతుకమ్మ అని పిలుస్తారు. ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గౌరమ్మను కొలిచి, ముద్ద పప్పు నైవేద్యంగా సమర్పిస్తారు.
ముద్దపప్పు బతుకమ్మ ప్రాముఖ్యత:
నవరాత్రిలో మూడవ రోజున అమ్మవారు చంద్ర ఘంటా దేవి రూపంలో పూజలందుకుంటారు. ఆమె ధైర్యానికి, శాంతికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. బతుకమ్మ పండుగలో మూడవ రోజున ఈ శక్తిని ఆరాధిస్తారు. ఈ రోజున బతుకమ్మకు ముఖ్యంగా తామర పువ్వులు, గునుగు పూలు, తంగేడు, కట్ల పూలను ఉపయోగిస్తారు. ఈ పూజ ఆయురారోగ్యాలను, శ్రేయస్సును ప్రసాదిస్తుందని నమ్మకం. ముఖ్యంగా, ముద్ద పప్పు నైవేద్యం సమర్పించడం వెనుక ఒక ఆరోగ్యకరమైన కారణం కూడా ఉంది. పండుగ రోజుల్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, పోషకాలు నిండిన ముద్ద పప్పు తీసుకోవడం ద్వారా శక్తిని పొందుతారు.
పూజ విధానం, నైవేద్యం:
ముద్దపప్పు బతుకమ్మ రోజున, ఆడపడుచులు ఉదయం స్నానమాచరించి, పూజకు సిద్ధమవుతారు. సాయంత్రం వేళ.. వివిధ రంగుల పూలతో అందంగా బతుకమ్మను పేర్చుతారు. గుమ్మం ముందు లేదా పూజ గదిలో బతుకమ్మను ఉంచి, మధ్యలో గౌరమ్మను (పసుపుతో చేసిన గౌరీ దేవి) పెడతారు. గౌరమ్మను ఆ డపడుచులు దేవతగా పూజిస్తారు.
ఈ రోజున ప్రధాన నైవేద్యం ముద్దపప్పు. దీనిని పెసర పప్పుతో తయారు చేస్తారు. పెసర పప్పును నీటిలో నానబెట్టి, ఉడ కబెట్టి, కొద్దిగా బెల్లం లేదా ఉప్పు, నెయ్యి కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది అత్యంత సాధారణమైన, కానీ పోషకాలు నిండిన ప్రసాదం.
Also Read: తెలంగాణలో బతుకమ్మ పండగను ఎందుకు జరుపుకుంటారు ? అసలు కారణం ఇదే !
సందేశం, సాంస్కృతిక విలువ:
బతుకమ్మ పండుగ ప్రకృతితో మనకున్న బంధాన్ని, పూలకున్న ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ముద్ద పప్పు బతుకమ్మ రోజున.. పెసర పప్పును నైవేద్యంగా ఇవ్వడం ద్వారా పోషకాహార విలువలను చాటి చెబుతుంది. ఇది కేవలం ఒక ఆచారంగా కాకుండా.. ఆరోగ్యకరమైన జీవనశైలికి మార్గదర్శకంగా నిలుస్తుంది.
ఈ రోజున మహిళలందరూ కలిసి ఇళ్లలో పేర్చిన బతుకమ్మను తీసుకు వచ్చి కూడళ్లలో పెట్టి బతుకమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ ఆడతారు. ఈ ఉత్సవం మహిళల ఐక్యతకు.. సంతోషానికి, ఆధ్యాత్మిక భావనకు ప్రతీక. ఈ రోజున నిర్వహించే పూజ, పాటలు, నైవేద్యం భక్తి భావాన్ని, ఆనందాన్ని పంచుతాయి.
చివరగా.. ముద్ద పప్పు బతుకమ్మ రోజున గౌరమ్మను ఆరాధించడం ద్వారా భక్తులకు ఆరోగ్యం, సంపద, ఆనందం లభిస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ పండుగ ప్రకృతి ఆరాధనతో పాటు, సమాజం లోని మహిళలందరినీ ఒకచోట చేర్చి, వారి మధ్య బంధాలను మరింత బల పరుస్తుంది.