Bathukamma 2025: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అద్భుతమైన పండుగ బతుకమ్మ. ప్రకృతిని దైవంగా భావించి, పూలను పూజించే ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. పండగ సందర్భంగా ఆడపడుచులు రంగు రంగుల పూలతో బతుకమ్మను పేరుస్తారు. ఆ బతుకమ్మనే గౌరమ్మగా భావించి కొలుస్తారు. చిన్నా పెద్దా అందరూ కొత్త బట్టలు ధరించి, ఆభరణాలతో అలంకరించుకుని.. బతుకమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. కాగా.. బతుకమ్మ పండగ సమయంలో తెలంగాణలోని చెరువులు, వాకులు, వంకలు పులకించిపోయి బతుకమ్మను ఆహ్వానిస్తారు. బతుకమ్మతో వెళ్లడానికి పూలు కూడా పయనం అవుతాయి.
బతుకమ్మ పండగ వెనుక ఉన్న చరిత్ర:
బతుకమ్మ పండగకు వెయ్యేళ్ల చరిత్ర ఉందని చెబుతారు. ఇది వేములవాడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం వేములవాడలో జరిగిన ఒక సంఘటనతో ముడిపడి ఉంది.
పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పాలించేవారు. వారి సామంతులుగా వేములవాడ చాళుక్యులు ఉండేవారు. క్రీ.శ. 973లో చాళుక్య రాజు తైలపాడు పాలనలో ఉన్నప్పుడు, చోళులు, రాష్ట్ర కూటుల మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో చాళుక్యులు రాష్ట్ర కూటులకు మద్దతుగా నిలిచారు.
తర్వాత తైలపాడు కుమారుడైన సత్యాస్రాయుడు రాజ్యాన్ని పాలించాడు. వేములవాడలో అప్పటికే ప్రసిద్ధి చెందిన రాజ రాజేశ్వర ఆలయం ఉండేది. ప్రజలు ఇక్కడ పార్వతీ సమేతుడైన శివలింగాన్ని కొలిచేవారు. చోళ రాజులు కూడా ఈ దైవాన్ని అత్యంత శక్తివంతమైనదిగా నమ్మేవారు. పరాంతక సుందర చోళుడు రాజరాజేశ్వరి భక్తుడిగా మారాడు. తన కుమారుడికి రాజరాజ అని పేరు కూడా పెట్టాడు. ఈ రాజ రాజ చోళుని కుమారుడే రాజేంద్ర చోళుడు.
క్రీ.శ. 1006లో రాజ రాజ చోళుడు, సత్యాస్రాయుడిపై యుద్ధానికి వెళ్ళినప్పుడు, సేనాధిపతిగా ఉన్న రాజేంద్ర చోళుడు వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి, అక్కడి భారీ శివలింగాన్ని తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు.
రాజరాజ చోళుడు తన కొడుకు ఇచ్చిన శివలింగం కోసం తంజావూరులో బృహదీశ్వరాలయం నిర్మించాడు. చోళుల శాసనాల్లోనూ ఈ విషయం గురించి ప్రస్తావించారు. అయితే.. ప్రజలు ఎంతో పవిత్రంగా కొలిచే రాజరాజేశ్వరి ఆలయం కూల్చివేయడం, పార్వతిని బృహదమ్మగా భావించి, ఆమె నుంచి శివలింగాన్ని వేరుచేయడం తెలంగాణ ప్రజలను తీవ్రంగా కలచివేసింది.
Also Read: తీరొక్క పూలతో ఊరంతా పండగ.. బతుకమ్మ సంబురాలు ఎప్పటి నుంచి ?
వారి దుఃఖాన్ని తెలియ జేస్తూ, పార్వతి లేని శివుడి గురించి పాటలు పాడుతూ,..పూలతో మేరు పర్వతంలా బతుకమ్మలను పేర్చడం ప్రారంభించారు. ఈ సంప్రదాయం వెయ్యేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. బతుకమ్మ అనే పేరు కూడా బృహదమ్మ అనే పదం నుంచే వచ్చిందని చరిత్ర కారులు చెబుతారు. శివుడు లేని పార్వతి గురించి జాన పద పాటలు అల్లుకుని, చరిత్రను గుర్తు చేసుకుంటూ ఈ పండుగను జరుపు కోవడం మన సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని తెలంగాణ వ్యాప్తంగా నేటికి కొనసాగిస్తున్నారు.
Also Read: దుర్గాదేవిని ఈ ఎర్రటి పూలతో పూజిస్తే.. కష్టాలన్నీ తొలగిపోతాయ్ !