Ram Lalla Surya Tilak| శ్రీరామ నవమి వేడుకలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా రాముని జన్మస్థలమైన అయోధ్య నగరం కూడా ఈ వేడుకల కోసం సిద్ధమవుతోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్‌ను అయోధ్య ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది. చైత్ర మాసం మహానవమి తిధి హిందూ సంస్కృతిలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ రోజున లోక రక్షకుడు శ్రీ మహా విష్ణువు శ్రీ రాముడిగా అవతరించాడు. ఇది విష్ణువు ఏడవ అవతారంగా భావిస్తారు, కాబట్టి ఈ రోజునే శ్రీరామ నవమి వేడుకగా జరుపుకుంటారు.
అయోధ్యలో రామ కథ కార్యక్రమం
మార్చి 29 నుంచి ఏప్రిల్ 6 వరకు వసంత నవరాత్రి వేడుకల సందర్భంగా అయోధ్యలో శ్రీ రామ కథను నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రకటించింది. భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి అయోధ్యలో భారీ ఏర్పాట్లు చేశారు.
శ్రీరామ నవమి వేడుకల షెడ్యూల్
ఈ సంవత్సరం శ్రీరామ నవమి ఏప్రిల్ 6, ఆదివారం రోజున జరగనుంది. ఈ వేడుకలు చైత్ర శుక్ల నవమి రోజుతో పూర్తవుతాయి. ఇది విక్రమ్ సంవత్ 2081 హిందూ నూతన సంవత్సరం ప్రారంభం లోని శుక్ల పక్షం తొమ్మిదవ రోజు.
Also Read: తిరుమలకు వెళ్తున్నారా? శ్రీరామనవమి కార్యక్రమాలు అస్సలు మిస్ అవ్వకండి!
వేడుకల షెడ్యూల్:
బాల రామయ్యకు అభిషేకం: ఉదయం 9:30 నుండి 10:30 వరకు
బాల రామయ్య ఆరాధన: ఉదయం 10:40 నుండి 11:45 వరకు
బాల రామయ్య జననం: మధ్యాహ్నం 12:00 గంటలకు
హారతి మరియు సూర్య తిలక వేడుక: మధ్యాహ్నం 12:00 గంటలకు
ప్రత్యేక సూర్య తిలక క్షణం
శ్రీరాముని జన్మ సమయం మధ్యాహ్నం 12 గంటలుగా పరిగణించబడుతుంది. ఈ క్షణంలో సూర్య కిరణాలు బాల రాముడి నుదిటిపై 4 నిమిషాలపాటు పడుతాయి. భక్తులు ఈ దైవిక క్షణాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని అయోధ్య ఫైజాబాద్‌లోని 50కి పైగా స్క్రీన్లలో, దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అలాగే ఆన్‌లైన్ లైవ్ ప్రసారం కూడా ఉంటుంది.
యూట్యూబ్ లైవ్ లింక్: https://www.youtube.com/watch?v=nyd-xznCpJc
వివరణాత్మక వేడుకల షెడ్యూల్:
ఉదయం 10:40 నుండి 11:45: శ్రీరాముడిని అలంకరించడం జరుగుతుంది. ఈ సమయంలో భక్తులు దేవుడిని దర్శించవచ్చు.
ఉదయం 11:45: నైవేద్యం సమర్పణ కోసం గర్భ గుడి తలుపులు మూసివేయబడతాయి.
మధ్యాహ్నం 12:00: బాల రామునికి హారతి అర్పించాక, గర్భ గుడి తలుపులు తెరవబడతాయి.
సూర్య కిరణాలు బాల రాముని నుదిటిపై తిలకంగా పడే దృశ్యం.. సుమారు 4 నిమిషాలపాటు భక్తులు ఈ దైవిక క్షణాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించవచ్చు.
ఈ వేడుకల సమయంలో వాల్మీకి రామాయణం, రామచరితమానస పారాయణం జరుగుతుంది. అలాగే 1 లక్ష దుర్గా సప్తశతి మంత్రాలతో నైవేద్యాలు సమర్పిస్తారు.
సూర్య తిలకం ప్రాముఖ్యత
శ్రీ రాముడు.. దశరథ మహారాజు జ్యేష్ట పుత్రుడు. సూర్య వంశానికి చెందినవాడు. వీరి ఇక్ష్వాకు వంశానికి కులదైవం సూర్య నారాయణుడు. పురాణాల ప్రకారం చైత్ర మాసం శుక్ల పక్షం 9వ రోజున మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించాడు. సనాతన ధర్మంలో శక్తికి మూలం, గ్రహాల రాజుగా సూర్యుడుని పరిగణించారు. సూర్యుడు తన కిరణాలతో శ్రీరామునికి తిలకం అర్పించడం ద్వారా బాలరాముని విగ్రహంలో దైవత్వం మేల్కొంటుందని భక్తుల విశ్వాసం.