రివ్యూ : టచ్ మీ నాట్ వెబ్ సిరీస్
తారాగణం : నవదీప్, దీక్షిత్ శెట్టి, కోమలీ ప్రసాద్, సంచితా పూనాచా, బబ్లూ పృథ్వీరాజ్ తదితరులు
దర్శకుడు : రమణ తేజ
ఓటీటీ : జియో హాట్ స్టార్
Touch Me Not Series Review : ‘టచ్ మీ నాట్’ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నవదీప్, దీక్షిత్ శెట్టి, కోమలీ ప్రసాద్, సంచితా పూనాచా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ రమణ తేజ దర్శకత్వంలో రూపొందింది. తెలుగులో తీసిన ఈ సిరీస్ హిందీ, మలయాళ, కన్నడ, తమిళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. సైకోమెట్రీ ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ థ్రిల్లర్ ప్రియుల మనసులను టచ్ చేసిందా? లేదా ? అనే విషయాన్ని రివ్యూలో తెలుసుకుందాం.
కథ
రాఘవరావు (నవదీప్) ఒక ఎస్పీ. తన చిన్నప్పుడు జరిగిన అపార్ట్‌మెంట్ అగ్ని ప్రమాదంలో తల్లిని కోల్పోతాడు. అదే సంఘటనలో రిషి (దీక్షిత్ శెట్టి) తన తల్లిదండ్రులను కోల్పోతాడు. ఆ టైమ్ లో రాఘవ్ రిషిని కాపాడతాడు. ఆ విషాదానికి కారణమైన వాచ్‌మెన్ (దేవి ప్రసాద్) కుమార్తె మేఘ (కోమలి ప్రసాద్), అలాగే రిషిని రాఘవనే పెంచుతాడు. అగ్నిప్రమాదం నుండి తప్పించుకునే సమయంలో రిషి తలకు గాయమవుతుంది. దీంతో అతనికి సైకోమెట్రీ స్కిల్స్ (జనాలను లేదా వారు ముట్టుకున్న వస్తువులను తాకగానే గతాన్ని చెప్పగల సూపర్ పవర్) వస్తుంది. పది సంవత్సరాల తరువాత ఓ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో అనేక మంది చనిపోతారు. ఇది అచ్చం అపార్ట్మెంట్ అగ్ని ప్రమాదంలాగే జరుగుతుంది. దీంతో రిషి పవర్స్ తో ఎస్పీ రాఘవ్ ఈ కేసును చేధించాలని అనుకుంటాడు. మరి రిషికి ఉన్న సూపర్ పవర్స్ ఈ కేసును ఎలా పరిష్కరించడంలో సహాయపడతాయి? రాఘవ్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగింది ? తాము అనాథలు కావడానికి కారణమైన వాచ్ మెన్ కూతురు మేఘను రాఘవ్ ఎందుకు పెంచుతున్నాడు? అనే విషయాలను సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ
ఈ సిరీస్ ను 2019 కొరియన్ డ్రామా సిరీస్ ‘హి ఈజ్ సైకోమెట్రిక్’ ఆధారంగా రూపొందించి, తెలుగు ఆడియన్స్ కు సైకోమెట్రీ అనే కొత్త కాన్సెప్ట్ ను పరిచయం చేశారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్‌గా రూపొందిన ‘టచ్ మీ నాట్’, ఆడియన్స్ కు ఆ థ్రిల్ అందించాలంటే స్ట్రాంగ్ డీటైలింగ్ అవసరం. కానీ దర్శకుడు రమణ తేజ ఎలాంటి థ్రిల్ లేకుండానే కీలకమైన దర్యాప్తు సన్నివేశాలను వేగంగా పూర్తి చేశాడు. ఇలాంటి సినిమాలకు క్రైమ్ ఆయువుపట్టు. కానీ దర్శకుడు థ్రిల్ మిస్ చేసి, డ్రామాకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చాడు. ఇన్వెస్టిగేషన్ తో సహ డైలాగులు కూడా సిరీస్ పై క్యూరియాసిటీని పెంచలేకపోయాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో కామెడీ బాగానే వర్కౌట్ అయ్యింది. అలాగే కీలక పాత్రల మధ్య భావోద్వేగ బంధం, వారి కథలు ముడిపడి ఉన్న విధానం బాగుంది.
రమణ తేజ ప్రధాన కథాంశంలోకి తీసుకెళ్లడానికి చాలా టైమ్ తీసుకున్నాడు. ఓ ఎపిసోడ్ మొత్తాన్ని పాత్రల పరిచయాలకు అంకితం చేస్తాడు. ఇందులో మొత్తం 6 ఎపిసోడ్ లు ఉండగా, ఒక్కో ఎపిసోడ్ 30 నిమిషాల పాటు ఉంటుంది. కానీ ఎపిసోడ్స్ అన్నీ నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ వస్తుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇందులో ట్విస్ట్ లు ఊహించడమేమి అంత కష్టం కాదు. ఇక స్టోరీ పెద్దగా లేకుండానే సిరీస్ మొత్తాన్ని లాక్కొచ్చారు. క్లైమాక్స్ లో తన తల్లి మరణంలో మేఘ పాత్ర ఉందని తెలిసినప్పటికీ, రాఘవ్ ఆమెను ఎందుకు పెంచాలని అనుకున్నాడనే సస్పెన్స్ తో, బోలెడన్ని క్వశ్చన్ మార్క్ లతో అసలు కథను సీజన్ 2లో చూపిస్తామని ఎండ్ కార్డ్ వేశారు.
ఈ సిరీస్‌లో నటీనటుల నటన కీలక పాత్ర పోషిస్తుంది. దీక్షిత్ శెట్టి, నవదీప్, కోమలీ ప్రసాద్ వంటి అనుభవజ్ఞులైన నటులు వారి పాత్రల్లో బాగా నటించారు. బబ్లూ పృథ్వీరాజ్ స్క్రీన్ టైమ్ చాలా తక్కువ. మహతి స్వరసాగర్ సంగీతం, నిర్మాణ విలువలు బాగన్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది.
చివరగా
సైకోమెట్రీ అనే కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన రొటీన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా ఈ సిరీస్. థ్రిల్లింగ్ ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తే టచ్ అవ్వడం కష్టమే. ఈ డ్రామా సిరీస్ ను అంచనాలు లేకుండా చూస్తే బెటర్. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడవచ్చు.
Touch Me Not Review Series Rating : 2 /5