మన పురాణాల ప్రకారం రాముడే దేవుడు. రాముడితో యుద్ధం చేసిన రావణుడు చెడ్డవాడు. అయితే ప్రతి పురాణాన్ని, పురాణంలోని ప్రతి పాత్రను రెండువైపులా చూడాలని చెబుతారు. మంచి వారిలో కూడా చెడు లక్షణాలు ఉండవచ్చు. చెడ్డవ్యక్తిలో కొన్ని మంచి లక్షణాలు ఉండవచ్చు. అలాగే రావణుడిని మనం దసరా రోజు చితి మంటల్లో పేర్చి కాల్చేస్తే… మరికొందరు మాత్రం దేవుడిలా పూజిస్తారు. ఎక్కడో కాదు మన దేశంలోనే రావణుడిని పూజించే ప్రజలు ఉన్నారు. అతడి మరణాన్ని తలుచుకొని దుఃఖిస్తారు. అతడిని పూజించి గౌరవిస్తారు. అతడిని పండితుడిగా భావిస్తారు. ఆరు శాస్త్రాలు నాలుగు వేదాల గురించి అతనికి అపారమైన జ్ఞానం ఉందని నమ్ముతారు. రావణుడిని ఇప్పటికీ దేవుడులా పూజించే ప్రదేశాలు భారతదేశంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి.
మందాసౌర్
మధ్యప్రదేశ్ నడిబొడ్డున మందసౌర్ అనే ఊరు ఉంది. ఈ ఊరికి రావణుడు అల్లుడు అవుతాడు. రావణుడి భార్య అయినా మండోదరి సొంత ఊరు మందసౌర్ గా చెప్పుకుంటారు. దీనివల్లే రావణడిని ఆ ప్రాంత ప్రజలు అల్లుడుగా గౌరవిస్తారు. భారతదేశంలోని చాలా ప్రదేశాల్లో దసరా రావణుడి దిష్టిబొమ్మ దహనంతో ముగుస్తుంది. కానీ ఆ రోజు మందసౌర్ ప్రజలు అతడి మరణానికి సంతాపంగా ఏడుస్తారు. పట్టణంలో 35 అడుగుల ఎత్తైన రావణుడి విగ్రహం కూడా ఉంది. దసరా సమయంలో అతని జ్ఞాపకార్థం అక్కడ ప్రార్థనలు చేస్తారు. అతడిని ఒక తెలివైన పండితుడిగా, శక్తివంతమైన రాజుగా చెప్పుకుంటారు.
బిస్రాఖ్
ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో బిస్రాఖ్ గ్రామం ఉంది. ఇదే రావణుడి జన్మస్థలంగా నమ్ముతారు. రావణుడి తండ్రి అయిన విశ్రవుడ పేరు మీదే ఈ గ్రామం పుట్టిందని చెప్పుకుంటారు. అందుకే ఈ గ్రామం దసరాను ఒక వేడుకలా నిర్వహించుకోదు. రావణుడి జ్ఞాపకార్థం సంతాప దినంగా భావిస్తుంది. ఆరోజు దిష్టిబొమ్మలను దహనం చేయరు. రావణుడికి శివుని పట్ల ఉన్న లోతైన భక్తిని తలుచుకుంటారు. అతని తెలివితేటలను చెప్పుకుంటారు.
రావణ్ గ్రామం
మధ్యప్రదేశ్ లోని విదిషా జిల్లాలో రావణ గ్రామ్ అనే ఊరు ఉంది. ఇది రావణుడితో ఎంతో అనుబంధాన్ని కలిగి ఉన్న గ్రామంగా చెప్పుకుంటుంది. ఇక్కడ ఉన్న ఒక ఆలయంలో పది అడుగుల రావణుడి విగ్రహం నిద్రావస్థలో కనిపిస్తుంది. అతడిని తెలివితేటలకు, బలానికి చిహ్నంగా భావిస్తారు. రావణుడికి శివుడి పట్ల ఉన్న భక్తి, వేదాలపై అతనికున్న పాండిత్యం గుర్తుచేసుకొని అతడు పూజలకు అర్హునిగానే చెబుతారు. రావణ గ్రామ నివాసితులు అతని దూషించేందుకు ఇష్టపడరు.
కాకినాడ
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ లో కూడా రావణుడి భక్తిని గుర్తించిన ప్రజలు ఉన్నారు. కాకినాడలో ఒక ఆలయాన్ని రావణుడు స్వయంగా నిర్మించాడని చెబుతారు. అది శివుడికి అంకితం చేసిన ఆలయం అని అంటారు. రావణుడి అచంచల విశ్వాసం, ఆధ్యాత్మిక బలం శివుడి అనుగ్రహాన్ని పొందాయని, శక్తివంతమైన వరాలు పొందేలా చేశాయని స్థానికులు నమ్ముతారు. నేటికీ ఆ ఆలయంలో శివునితో పాటు రావణుడిని కూడా పూజించే అలవాటు ఉంది.
మండోర్
రాజస్థాన్లోని జోధ్ పూర్ సమీపంలో ఉంటుంది మండోర్. రావణుడి భార్య అయినా మండోదరి పేరు మీద ఈ ఊరికి ఆ పేరు పెట్టారు. మండోదరి పూర్వీకులు గ్రామంలోనే ఉండేవారని నమ్ముతారు. దీని వల్లే రావణుడు కూడా ఈ ప్రాంతానికి గౌరవనీయమైన అల్లుడిగా మారాడు. రావణుడికి అంకితం చేసిన ఆలయం కూడా ఇక్కడ ఉంది. దసరా సమయంలో ఇక్కడ స్థానికులు రావణుడి ఓటమిని ఒప్పుకోరు. అతడిని ఒక పండితుడిగా, రాజుగా నమ్మకమైన భర్తగానే చెప్పుకుంటారు.
కాంగ్రా
హిమాచల్ ప్రదేశ్ లోని ఒక కొండ ప్రాంతం కాంగ్రా. ఇది ప్రశాంతమైన కొండ కోనలతో నిండి ఉంటుంది. రావణుడు శివుని ఆశీర్వాదం కోసం తపస్సు చేసింది కాంగ్రా ప్రాంతంలోనని చెప్పుకుంటారు. అతని భక్తి ఎంతో లోతైనదని, శివుడిని మెప్పించిందని అంటారు. కాంగ్రాలో ఉన్న ప్రజలు రావణుడి లోతైన ఆధ్యాత్మిక శక్తికి ఇప్పటికీ దేవుడిలాగే పూజిస్తారు. అతని తపస్సును పదేపదే తలుచుకుంటారు. శివునితో అతనికి ఉన్న అనుబంధాన్ని గౌరవిస్తారు.