Chidambaram Temple: పంచభూత లింగాలు ఎక్కడెక్కడ ఎలా వెలశాయి? అవి దక్షిణ భారతదేశంలోనే ఎందుకు కొలువుదీరాయి? ఇక్కడ ఏయే లింగాలు ఏయే తత్వాలను తెలియ చేస్తాయి? ఆకాశ లింగంగా చిందరంలోని నటరాజ స్వామి వారి ఆలయం ఎందుకంత ప్రసిద్ధి చెందింది? దీని వెకగల కారణాలేంటి? స్థలపురాణం ఎలాంటిది? చిదంబరానికి ఎలా చేరుకోవాలి?
చిదంబరం- ఆకాశ తత్వానికి ప్రతీక
జంబుకేశ్వం- జలతత్వానికి ప్రతీక
అరుణాచలం- అగ్ని తత్వానికి ప్రతీక
కాంచీపురం- భూ తత్వ ప్రతీక
శ్రీకాళహస్తి- వాయు తత్వానికి ప్రతీక
చిదంబరం- శ్రీకాళహస్తి.. పంచభూత లింగ యాత్ర
చిదంబర రహస్యం అనే మాట వినే ఉంటాం. అలాంటి చిదంబర రహస్యం అన్న మాట మరెక్కడి నుంచో పుట్టలేదు. ఇదిగో ఈ చిదందరంలోని నటరాజ స్వామివారి ఆలయంలో పుట్టింది. హిందూ మతాచారాన్ని బట్టీ చూస్తే చిదంబరం అనేది శివుడి అయిదు పంచభూత లింగాల్లో ఒకటి. చిదంబరం ఆకాశతత్వానికి ప్రతీక అయితే.. తిరువనైకవల్ జంబుకేశ్వర లింగం జలతత్వానికి ప్రతీక. తిరువన్నామలైలోని అరుణాచలేశ్వరుడు అగ్ని తత్వానికి ప్రతిరూపం.. ఇక కంచి ఏకాంబరేశ్వరుడు భూ తత్వానికి తార్కారణం కాగా.. ఏపీలోని ఒకే ఒక్క పంచభూత లింగంగా కొలువుదీరిన.. శ్రీకాళహస్తీస్వరుడు వాయు తత్వానికి నిదర్శనం.
చిదంబరం- ఆకాశ తత్వానికి ప్రతీక
ఆకాశ లింగమైన చిదంబరం నుంచి వాయు లింగమైన శ్రీకాళహస్తి వరకూ చేసే యాత్రను పంచభూత లింగ యాత్ర అంటారు. ఈ యాత్రలో చిదంబరం, తర్వాత జంబుకేశ్వరం, ఆ పై అరుణాచలేశ్వరం, అటు పిమ్మట కాంచీపురం చివరిగా.. శ్రీకాళహస్తీశ్వర దర్శనంతో ఈ యాత్ర దివ్యంగా సవ్యంగా ముగుస్తుంది.
వాయులింగేశ్వరుడిచ్చే ప్రాణం పోసుకుని..
అయితే మరో లెక్క ప్రకారం.. వాయులింగేశ్వరుడు ఇచ్చే ప్రాణం తీసుకుని.. పృధ్వీ లింగేశ్వరుడి అనుగ్రహ ప్రకారం.. ఈ భూవిపై జన్మించి.. జల లింగేశ్వరుడి ద్వారా జలంతో ప్రాణం నిలుపుకుని.. అగ్ని లింగేశ్వరుడి ద్వారా వేడి చేయబడ్డ ఆహారంతో జీవిస్తూ.. సంపూర్ణ జీవన యానం చేసి చివరికి చేరుకోవల్సిందే ఆకాశలింగమని కూడా అంటారు. ఈ రకంగా చూస్తే ఈ యాత్రను ఏపీలోని శ్రీకాళహస్తీశ్వరుడి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది.
చిత్.. ఆకాశంలోంచి పుట్టిన అంబరమే చిదంబరం
మొదటగా చిదంబరం విషయానికి వస్తే.. చిదంబరం అనే ఈ పదం ఎలా పుట్టిందో చూస్తే.. చైతన్యం అనే పదంలోంచి పుట్టిన చిత్.. ఆకాశంలోంచి పుట్టిన అంబరం.. అనే రెండు పదాల మేలు కలయికగా చెబుతారు. మన ఆధ్యాత్మికతను అనుసరించి చెబితే.. చివరికి మనిషి చేరాల్సిన పదం పథం రెండూ ఇదే.
చిత్ ప్లస్ అంబళం నుంచి పుట్టినది చిదంబరం
మరొక సిద్ధాంతం ప్రకారం చూస్తే.. చిత్ ప్లస్ అంబళం నుంచి పుట్టినది చిదంబరం అని అంటారు. అంబళం అంటే కళా ప్రదర్శన చేసే ఒకానొక వేదిక. చిదాకాశం అనేది పరమేశ్వరుని చిద్విలాసం లేదా ఆనందం ఈ చిదానందాన్ని దర్శిస్తే ఇక ఆ జన్మకు విముక్తి లభిస్తుందని కూడా విశ్వసిస్తారు. మరో వర్ణన ప్రకారం.. ఆ దైవం చిత్రమైన నృత్యం సాగించే వేదికనే చిత్రాంబళం అంటారనీ.. అదే చిదంబరం అయిందని భావిస్తారు.
ఆ పాములే మెడలో మాలగా ధరించిన శివుడు
ఇక శివుడు మెడలో సర్పాలతో, పులి చర్మధారిగా ఎలా అవతరించాడు? ఆ నటరాజ స్వామి భంగిమ ఎక్కడి నుంచి ఆవిర్భవించిందీ? నటరాజు కాలి కింద నలిగే ఆ రాక్షసుడు ఎవరు? అన్నది కూడా మనకు చిదంబర కథనంలోనే దర్శనమిస్తుంది.
ఆ పులిని చీల్చి చెండాడి చర్మధారిగా మారిన శివుడు
తిల్లై వనాలలో కొందరు రుషులు యజ్ఞయాగాదులు చేసుకుంటూ ఈ ప్రాంతంలోనే నివసిస్తూ ఉండేవారట. వీరు సంచరించే వనాలలోకి శివుడు ఒక యాచకుడిగా. విష్ణువు మోహినీ అవతార రూపిణిగా.. ఇక్కడ సంచరిస్తూ ఉంటుందట. ఈ ఇద్దరినీ చూసిన రుషి పత్నులు తీవ్రమోహావేశంలో పడిపోతారట. దీంతో రుషులు ఆ ఆదిభిక్షువుపై పాములను విసురుతారట. వాటిని ఆయన తన మెడలో ధరిస్తాడట. ఆపై పులిని ప్రయోగిస్తారట. ఆ వ్యాగ్రాన్ని చీల్చి చెండాడి దాని చర్మం ఒలిచి తన ఒంటికి చుట్టుకుంటాడట ఆ పరమేశ్వరుడు.
ఆ రాక్షసుడిని కింద పడేసి నిజరూప దర్శనం
ఇలాక్కాదని చెప్పి ముయాలకన్ అనే ఒక రాక్షసుడ్ని ప్రయోగిస్తారట ఆ రుషులు. దీంతో ఆ రాక్షసుడ్ని నేలపై పడవేసి.. అతడి వెన్ను ముఖపై కాలు పెట్టి ఎటూ కదలకుండా చేసి తన నిజరూప దర్శనం ఇస్తాడట ఆ పరమేశ్వరుడు. అలా శివుడి మెడలోకి పాములు రావడం, ఒంటి మీదకు పులి చర్మం, ఇక ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ నృత్యాకృతి కూడా అపుడే దర్శనమిచ్చిందని అంటారు మన పండితులు. ఎప్పుడైతే శివుడలా ఆనంద తాండవం చేస్తూ కనిపిస్తాడో.. అప్పుడా రుషులు సైతం లొంగిపోతారట. శివుడ్ని ఏ మంత్రతంత్రాలతోనూ.. లొంగదీసుకోవడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వస్తారట.
ప్రఖ్యాత నృత్య రీతి అప్పుడే పుట్టిందనే కథనం
శివుడి ఈ నృత్య రూపం ప్రపంచ ప్రఖ్యాతి. సకల కళా జగత్తుకు కూడా ఆయనే అధినాయకుడు. అలా చిందంబర నటరాజ స్వామి వారి మూర్తి ఆవిర్భావం జరిగిందని అంటారు. శివుడు సహజంగా లింగాకారంలో మాత్రమే దర్శనమిస్తాడు. కానీ ఇక్కడి శివుడు మాత్రం సర్వాలంకార భూషితుడైన ఆ నటరాజ రూపంలో దర్శనమిచ్చే అరుదైన ఆలయాల్లో ఇదీ ఒకటి.
తమిళనాడు, కడలూర్ జిల్లాలో గల చిదంబరం
చిదంబరం తమిళనాడులోని.. కడలూర్ జిల్లా, కారైకల్ కి ఉత్తరంగా అరవై కిలోమీటర్ల దూరంలోని చిదంబరం అనే పట్టణంలో ఉంటుంది. ఈ ఆలయ సముదాయం.. నగర నడిబొడ్డున 40 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఉంటుంది. ఇక్కడ శైవ వైష్ణవ ఆలయాలుంటాయి. సరిగ్గా అదే సమయంలో వైష్ణవులకు శ్రీరంగం ఎలాగో.. శైవులకు చిదంబరం అలాగని అంటారు.
32 కి.మీ. దూరంలో మేలకదంబూర్
చిదంబరానికి 32 కిలోమీటర్ల దూరంలో మేలకదంబూర్ ఆలయంలో తాండవ భంగిమలోనే మరొక రకం కనిపిస్తుంది. ఈ ఆలయంలో నటరాజు దున్నపోతు మీద నర్తిస్తున్నట్టుగా తెలుస్తుంది.
చిదంబర శివుడికి సభానాయకర్ గా పేరు
చిదంబరంలో వెలసిన శివుడ్ని సభానాయకర్ గా కూడా పిలుస్తారు ఇక బంగారు గోపురం కల ఈ గర్భగుడిలో మూడు రూపాలలో సాక్షాత్కరిస్తాడు శివుడు. మనిషి రూపంలో కనిపించే నటరాజు ఒక రూపం కాగా.. చంద్రమౌళీశ్వర స్పటిక లింగరూపం మరొకటి. సరిగ్గా అదే సమయంలో నిరాకార స్వరూపంలోనూ దర్శనమిస్తాడు స్వామి. చిదంబర రహస్యమంటే మరేదో కాదు గర్భగుడిలోని శూన్య ప్రదేశమే. ఇదే ఇక్కడ ప్రత్యేకం.
తూర్పు గోపురంపై 108 భరత నాట్య భంగిమలు
ఈ ఆలయంలోని మరిన్ని విశిష్టతలను బట్టీ చూస్తే.. ఆలయానికి 9 ముఖ ద్వారాలుండగా.. వీటిలో నాలుగింటిని ఏడు అంతస్తులలో నిర్మించారు. ఇవి తూర్పు-పడమర- ఉత్తర- దక్షిణాల్లో ఉన్నాయి. తూర్పు గోపురంపై భారతీయ నృత్య రూపమైన భరతనాట్యంలోని 108 భంగిమలకు చెందిన శిల్పాలు చెక్కబడి ఉంటాయి.
చిత్ సభ, కనక సభ, నృత్య సభ, రాజసభ, దైవ సభ
ఇక్కడ ఐదు సభా వేదికలున్నాయి. వీటినే మందిరాలని కూడా అంటారు. నటరాజ స్వామి, ఆయన దేవేరి శివగామసుందరి అమ్మవారు కొలువైన గర్భగుడిని చిత్ సభై అంటారు. చిత్ సభైకి ఎదురుగా ఉన్న కనక సభలో ప్రతి రోజూ చేయాల్సిన క్రతువులన్నిటినీ ఇక్కడ నిర్వహిస్తారు. ఇక ఆలయ ధ్వజస్తంబానికి దక్షిణంగా ఉన్న నృత్య సభలో నటరాజు కాళికాదేవితో కలసి నాట్యం చేశాడని ప్రతీతి. రాజసభ.. వేయి స్థంభాల మండపం. ఇక్కడ యోగాభ్యాసంలోనే పరాకాష్టగా పిలిచే.. ఆసనం కనిపిస్తుంది. ఇదే సహస్రార చక్రంలోంచి ఆత్మ భగవంతునిలో ఐక్యమవుతుందని చెప్పే స్థితికి తార్కారణం. దైవ సభలో.. కొలువైన పంచమూర్తులు.. ఎవరని చూస్తే వినాయక, సోమస్కంద, శివానంద నాయకి, చండికేశ్వరులు ప్రధానంగా కనిపిస్తారు.
పరమానంద కూంభం అనే బావి నుంచే నీటి సేకరణ
ఈ ఐదు సభల్లో లేని మిగతావి ఏంటని చూస్తే.. పతంజలి, వ్యాగ్ర లింగం, తిరు ఆదిమూలనాథర్, ఉమాదేవితో పాటు పరమేశ్వరుడి అరవై మూడు మంది భక్తుల విగ్రహాలు, శివగామి, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య, వల్లీదేవసేన వంటి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి.
కుయ్య తీర్ధం, వ్యాగ్ర పథ తీర్ధం, అనంత తీర్ధం, నాగశేరి..
ఒక ఆలయానికి మూడు ముఖ్యమైన విషయాలుంటాయి… అవి స్థాన బలం, మూర్తి స్వరూపం, తీర్ధం.. ఈ మూడే ఆ స్థలాన్ని పుణ్య స్థలంగా మార్చుతాయని అంటారు. అందుకే ఈ ఆలయం చుట్టుపక్కల ఎన్నో జలాశయాలున్నట్టు తెలుస్తుంది. ఆలయ ప్రాంగణంలోనే శివగంగ రూపంలో కోనేరు దర్శనమిస్తుంది. ఇక పరమానంద కూంభం అనే బావి కూడా ఉంటుంది. ఆలయానికి అవసరమయ్యే నీరు ఇక్కడి నుంచే సేకరిస్తారు. వీటితో పాటు కుయ్య తీర్ధం, వ్యాగ్ర పథ తీర్ధం, అనంత తీర్ధం, నాగశేరి అనే కోనేరు కూడా కనిపిస్తుంది. వీటితో పాటు మరో కోనేరు తిరుపర్కదాల్ సైతం అగుపిస్తుంది.
చిదంబరంలోనే గోవిందరాజ పెరుమాళ్ ఆలయం
చిదంబర ఆలయ ప్రాంగణంలోనే గోవిందరాజ పెరుమాళ్ ఆలయం సైతం దర్శనమిస్తుంది. ఆయన సతీమని పుండరీక వల్లీ తాయార్ విగ్రహం కూడా ఇక్కడ కొలువై ఉంటుంది. దీన్నే తిల్లై తిరుచిత్రకూటం అని అంటారు. ఇది 108 వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. కొందరిది దివ్య దేశంలో ఒకటి కాదని కూడా అంటారు. కానీ దాన్ని పెద్దగా లెక్కించరు. ఇక్కడ విష్ణువుఎందుకు కొలువుదీరాడని చూస్తే.. పరమేశ్వరుడు తన సతీమణితో చేసిన నృత్యానికి న్యాయనిర్ణేతగా ఉండమని ఈ గోవింద రాజ స్వామిని కోరాడనీ.. దీంతో ఆయనిక్కడ కొలువుదీరాడని చెబుతారు.
అంతిమ విజేతగా నిలిచేది శివుడే
ఒక సమయంలో ఇద్దరూ సమ ఉజ్జీలుగా నాట్యం చేస్తుంటే.. శివుడ్ని కాలు పైకి ఎత్తి అలాగే ఉంచమని గోవిందరాజస్వామి సలహా ఇచ్చాడనీ.. ఈ భంగిమ స్త్రీలకు వర్తించదు కాబట్టి.. అంతిమ విజేతగా శివుడు నిలుస్తాడని ఇక్కడి కథనం.
1880ల కాలం నుంచి కొనసాగుతున్న వివాదం
ఈ ఆలయంలో మరో వివాదం ఏంటంటే ఇక్కడ దీక్షితులు మాత్రమే శివార్చన చేయాలన్న వ్యవహారం. ఇది ఒక సమయంలో ప్రభుత్వానికి దీక్షితులకూ మధ్య గొడవగా రూపాంతరం చెందింది. చిదంబర ఆలయ దీక్షితుల వివాదం 1880ల కాలం నుంచి ఉంది. ఇప్పటి వరకూ ఎందరో ముఖ్యమంత్రులు, మరెందరో అధికారులు, కోర్టు అప్పీళ్లు తీర్పులుగా అనేకరకాలుగా మలుపులు తిరుగుతూనే వస్తోందీ వివాదం.
అరుణాచలం కేవలం 1 డిగ్రీ, తిరునైక్కవల్ 3 డిగ్రీల తేడా..
ఇక ఈ ఆలయ స్థలం దాని స్వరూప స్వభావాల విషయానికి వస్తే.. కాళహస్తి, కాంచీపురం, చిదంబరంలోని మూడు ఆలయాలు ఒకే సరళరేకలో నిలిచి ఉండటం.. ఇటు సాంకేతిక అటు జ్యోతిష, భౌగోళిక విచిత్రంగా భావిస్తారు. మిగిలిన రెండు ఆలయాల్లో ఒకటైన అరుణాచలం కేవలం 1 డిగ్రీతేడాలో, తిరునైక్కవల్ మూడు డిగ్రీల తేడాలో మాత్రమే ఉంటాయి. అంటే ఈ పంచభూత క్షేత్రాలు సుమారు ఒకే సరళరేకలో ఉన్నట్టుగానే భావిస్తారు భక్తులు. వీటిలో మూడు మాత్రం ఖచ్చితమైన తూర్పు రేఖాంశంలో ఉండటం విశేషంగా చెప్పుకొస్తారు.
9 ముఖ ద్వారాలు, నవరంద్రాలకు ప్రతీక
ఇక చిదంబరంలోని9 ముఖ ద్వారాలు మానవ శరీరంలోని నవరంద్రాలకు సూచిక. గర్భగుడి అయిన చిత్ సభ లేదా పొన్నాంబళాన్ని హృదయ స్థానంగా భావిస్తారు.. దాన్ని చేరుకోడానికి ముందుండే ఎత్తైన కనక సభ నుంచి వెళ్లాల్సిన ఐదు మెట్లు శి-వా-య-న-మ అనే పంచాక్షరిని సూచిస్తుందని అంటారు.
21, 600 బంగారు పలకలు 21, 600 శ్వాసలు
28 స్థంభాలతో కట్టిన గర్భగుడి.. శివపూజలో అవలంభించే ఇరవై ఎనిమిది ఆచారాలను సూచిస్తుందట. పై కప్పులోని 64 దూలాలు.. అరవై నాలుగు కళలకు ప్రసిద్ధిగా చెబుతారు. ఇందులోని అనేక అడ్డ దూలాలు అనేకానేక రక్తనాళాలను సూచిస్తాయట. పైకప్పు మీద శివాయనమ అనే నామాన్ని చెక్కిన 21, 600 బంగారు పలకలు 21 వేల 600 శ్వాసలను సూచిస్తాయట.. ఈ బంగారు పలకలను బిగించడానికి వాడిన 72 వేల బంగారు మేకులను మానవ శరీరంలోని నాడుల సంఖ్యను సూచిస్తుందట. పై కప్పుపై ఉంచిన 9 కలశాలను నవశక్తి రూపాలను తెలియ చేస్తాయని అంటారు. ఇక మహారాష్ట్రలోని సతారలోని ఆదిత్యనగరిలో ఉన్న ఉత్తర చిదంబరం.. ఈ దక్షిణ నటరాజ ఆలయానికి నకలుగా భావిస్తారు.
చిదంబరానికి ట్రైన్, బస్, ఫ్లైట్ మూడు మార్గాలు
ఇంతకీ ఈ చిదంబర ఆలయానికి ఎలా వెళ్లాలో చూస్తే.. ట్రైన్, బస్, ఫ్లైట్ మూడు మార్గాల ద్వారా వెళ్లవచ్చు. ఇక్కడికి దగ్గర్లోని ఎయిర్ పోర్ట్, తిరుచిరాపల్లి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. ఇది చిదంబరానికి 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక దగ్గర్లోని రైల్వే స్టేషన్ చిదంబరం రైల్వే స్టేషన్. బస్సులో కూడా చిదంబరం చేరుకోవచ్చు. చెన్నై నుంచి పలు నగరాల నుంచి చిదంబరానికి నేరుగా బస్సు సౌకర్యం ఉంటుంది ఉంటుంది. పాండిచ్చేరి బస్సు ఎక్కితే.. ఆలయం దగ్గరే దింపుతారు.. కాబట్టి ఇది మంచి ఛాయిస్ గా చెబుతారు.
ఆలయ దర్శన వేళలు
ఆలయ దర్శన సమయాలేంటని చూస్తే ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకూ.. సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకూ మాత్రమే తెరిచి ఉంచుతారు.