BigTV English

Kotappakonda Temple: చేదుకో కోటయ్యా.. ఆదుకోవయ్యా..!

Kotappakonda Temple: చేదుకో కోటయ్యా.. ఆదుకోవయ్యా..!
Kotappakonda

Kotappakonda Sri Trikoteswara Swami Temple: మన దేశంలో అనేక క్షేత్రాల్లో పరమేశ్వరుడు స్వయంభువుగా వెలసి పూజలందుకుంటున్నాడు. ఒక్కోచోట ఒక్కో పేరుతో, ఒక్కోరీతిన ఆయన కొలువై ఉన్నాడు. అయితే.. మిగిలిన శివ క్షేత్రాలకు భిన్నమైన, విలక్షణమైన స్థలపురాణం గల ఒక అద్భుత ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. అదే కోటప్పకొండ. గుంటూరు జిల్లాలోని నరసరావు పేటకు 14 కి.మీ దూరంలో ఈ క్షేత్రం ఉంది.


ఈ క్షేత్రంలో మూడు పర్వతాలుంటాయి. త్రి అనగా.. మూడు, కూటము.. అనగా కొండశిఖరం. ఈ మూడు కొండలు.. ఎటునుంచి చూసినా త్రిభుజాకారంలో కనిపిస్తుంటాయి. సకల చరాచర సృష్టిలోని సమస్త జీవకోటికి ఆధారభూతుడు, రూపరహితుడు, నాగాభరణ భూషితుడైన ఆ ముక్కంటి ఇక్కడ త్రికూట పర్వతం మీద ‘త్రికోటేశ్వరుడు’ అనే పేరుతో పూజలందుకుంటున్నాడు. స్వామి ఇక్కడికి రావటం వెనక గల పురాణ గాథ కృతయుగం నాటిది.

దక్షయజ్ఞం సమయంలో పిలవకుండా వచ్చావని.. తండ్రి అయిన దక్షుడు.. అవమానించటంతో.. సతీదేవి ఆ యజ్ఞంలో దూకుతుంది. ఈ సంగతి తెలుసుకున్న పరమేశ్వరుడు.. తన తల వెంట్రుకతో.. మహోగ్రరూపం కలిగిన వీరభద్రుడిని సృష్టించి, యజ్ఞాన్ని ధ్వంసం చేయిస్తాడు.


పట్టలేనంత ఆగ్రహంతో పరమేశ్వరుడి సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని, తాండవం చేస్తాడు. ఆయనను చూసి వణికిపోయిన మునులు, దేవతలు పరమేశ్వరుడిని శాంతింపజేయగా, ఆయన బాల బ్రహ్మచారిగా ఇక్కడి త్రికూటాచలం మీది రుద్రశిఖరం మీద కూర్చొని మునులకు, సిద్ధులకు జ్ఞానాన్ని బోధించేవాడు.

Read More: ఏ అభిషేకం చేస్తే శివుడి అనుగ్రహం కలుగుతుంది..

ఆ సమయంలోనే శివుని సేవించేలా భాగ్యం కోసం విష్ణువు.. ఇక్కడికి ఈశాన్య దిశగా ఉన్న శిఖరంపై (విష్ణుశిఖరం) మీద తపస్సు చేయగా.. పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు.
అదే సమయంలో బ్రహ్మ కూడా తపస్సు చేసి.. తన పేరుమీదున్న మూడోశిఖరమైన బ్రహ్మశిఖరం మీద శాశ్వతంగా కొలువుండాలని కోరగా.. కలియుగంలో అది జరుగుతుందని వరమిస్తాడు. ఇప్పడు మనం చూసే ప్రధాన ఆలయం బ్రహ్మ శిఖరం మీదే ఉంది.

కోటప్పకొండ సమీపంలోనే కొండకావూరు అనే గ్రామం ఉంది. శతాబ్దాల నాడు అక్కడ పశుపాలకులు నివసించేవారు. ఆ పశుపాలకుల నాయకుడికి ‘ఆనందవల్లి’ అనే కూతురుండేది. అమె ఒకనాడు ఆమె కోటప్పకొండ మీది పరమేశ్వరుని దర్శించుకోగానే.. ఆమె భక్తి పదిరెట్లయింది. నాటి నుంచి ఆమె రోజూ తమ గ్రామం నుంచి కాలి నడకన ఆవుపాల చెంబు తీసుకుని కొండనెక్కి, అక్కడి పాపనాశన తీర్థం నుంచి నీటని తీసుకుని స్వామిని అభిషేకించేది.

గొల్లల ఇంటి యువతి గనుక ఆమెను అందరూ గొల్లభామ అనేవారు. ఒకనాడు ఆమె కొండనెక్కుతుండగా.. ఒక కాకి ఆమె చేతిలోని పాలచెంబును కాలితో తన్నిందట. దీంతో ఆనందవల్లి ఆగ్రహంతో.. ‘నేటి నుంచి మళ్లీ ఈ కొండపై కాకి అనేదే అడుగుపెట్టటానికి వీల్లేదు’ అని శపించిందట. నేటికీ వేలాది చెట్లున్న కోటప్పకొండ మీద ఒక్క కాకి కూడా కనిపించదు.

శంకరుడు బాలికను పరీక్షించేందుకు పురుష స్పర్శ ఎరుగని ఆమె గర్భవతి అయ్యేలా చేస్తాడు. కానీ.. ఆమె కొండనెక్కటం మానలేదు. దీనికి సంతోషించిన శివుడు ఒక సన్యాసి రూపంలో వెళ్లి.. భిక్ష పెట్టమని అడుగుతాడు. ఆమె సంతోషంగా స్వామిని తన ఇంటికి ఆహ్వానించగా.. ‘నువ్వు వెనకకు చూడకుండా కొండదిగి వెళ్ళు. నీ వెనకే నేను వస్తాను. వెనుకకు చూసావంటే మాత్రం నేను ఆగిపోతాను’ అంటాడు.

దీనికి సరేనన్న ఆనందవల్లి.. నిండు గర్భంతో కొండదిగసాగింది. ఆమె వెనుకే ఆ ప్రణవ స్వరూపుడు నడుస్తూ వస్తుంటే… సమస్త భువనాలు కంపించేలా శబ్దాలు రాసాగాయి. దుర్బల శరీరం.. పైగా గర్భం. ఎండధాటికి అలసిన ఆనందవల్లి.. ఏమిటా అంటూ వెనక్కి తిరిగి చూడగా.. ఆ యతి అదృశ్యమై పోయాడు.

‘నా మాటను పాటించని కారణంగా నేను ఇక్కడే కలియుగాంతం వరకు త్రికోటేశ్వరునిగా నిలబడి పోతాను. నీ భక్తికి మెచ్చి నీకూ ఓ వరమిస్తాను. కోరుకో’ అనే ఆకాశవాణి వినిపించిందట. యతి రూపంలో వచ్చిన పరమేశ్వరుడిని గుర్తించలేకపోయాననే చింతతో ఆమె ప్రాయోపవేశానికి సిద్ధపడగా.. స్వామి సాక్షాత్కరించటం, ఆమెకు కాన్పు జరిగి.. క్షణంలో బిడ్డ మాయమవటం జరిగిందట.

స్వామిని చూసిన ఆనందవల్లి.. భక్తితో స్త్రోత్రం చేసి.. ఇంకేమీ వద్దని కోరగా.. ‘నీకు ఈ క్షేత్రంలో స్థిరవాసం అనుగ్రహిస్తున్నాను. భక్తులు నిన్ను దర్శించాకే.. నా దర్శనానికి వస్తారు’ అని వరమిచ్చి మాయమయ్యాడు. మెట్లమార్గంలోని గొల్లభామను దర్శించాకే.. నేటికీ భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటారు.

ఈ తర్వాతి రోజుల్లో కోటప్పకొండ సమీపంలోని యలమంద అనే గ్రామానికి చెందిన సాలంకయ్య శివభక్తుడు.. ఇక్కడి కొండల్లో కట్టెలు కొట్టుకు బతుకుతూ.. స్వామి దర్శనానికి వచ్చే సాధుసంతులను సేవించేవాడు. ఒకనాడు సాలంకయ్య కొండమీది స్వామిని దర్శించుకుని వస్తుండగా, ఒక జంగమదేవర కనిపించగా.. ఆయనను తన ఇంటికి ఆహ్వానించాడు. ఆ యతి కొంతకాలం వారి ఇంటిలోనే ఉండేవాడు. పాలు తప్ప ఏమీ సేవించేవాడు కాదు.

Read More: శివరాత్రి ఎలా ప్రత్యేకమైందంటే..

ఒకరోజు కట్టెలు కొట్టేందుకు వెళ్లిన సాలంకయ్యకు నిధి దొరుకుతుంది. ఆ మాట చెప్పేందుకు జంగమదేవర కోసం ఇంటికి రాగా.. ఆయన కనిపించడు. ఆయన కోసం తెగ వెతికి అలిసి అడవిలో నిద్రపోగా.. కలలో స్వామి కనిపించి.. ‘ఇన్నాళ్లూ నీ ఇంటిలో ఉన్నది నేనే. బ్రహ్మపర్వతం మీద నాకు ఆలయం నిర్మించు’ అని చెప్పగా.. అలా సాలంకయ్య తొలి ఆలయాన్ని నిర్మించాడు. గర్భాలయం వెనుక నేటికీ సాలంకయ్య లింగ, మండపాన్ని మనం చూడవచ్చు.

తర్వాతి కాలంలో.. దీనిని చోళులు, శాతవాహనులు, చాళుక్యులు, విజయనగర రాజులు, పలువురు జమీందారులు అభివృద్ధి చేశారు. స్వామి బాల బ్రహ్మచారి అవతారంలో వచ్చినందున.. ఇక్కడ ఆలయంలో అమ్మవారి సన్నిధి ఉండదు. ధ్వజస్తంభం కూడా ఉండదు. రుద్రశిఖరం మీది స్వామిని ‘పాత కోటయ్య స్వామి’గా పిలుచుకుంటారు.

ఇక్కడి కొండపై వసతి, ఉచిత భోజన సదుపాయం ఉంది. కొండ క్రింది నుంచి నేరుగా బస్సులో చేరుకోవచ్చు. నిత్యం వందలాది భక్తులు, పర్వదినాలలో వేలాదిగా, శివరాత్రికి లక్షలాదిగా భక్తులు ‘చేదుకో.. కోటయ్యా..ఆదుకోవయ్యా’ అని స్వామిని పిలుస్తూ.. కొండకు చేరుకుంటారు. మహాశివరాత్రికి ఇక్కడి ప్రభలు కట్టుకుని వచ్చి మొక్కు తీర్చుకోవటం, వాటిని చూసేందుకు లక్షలాది మంది తరలిరావటం విశేషం.

Tags

Related News

Karthika Masam 2025: కార్తీక మాసంలో చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటి ?

Bhagavad Gita Shlok: కోపం గురించి భగవద్గీతలో ఏం చెప్పారు ? 5 ముఖ్యమైన శ్లోకాలు..

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఈ పరిహారాలు చేస్తే.. డబ్బే డబ్బు !

Atla Taddi 2025: ఆడపడుచుల పండుగ అట్లతద్ది.. రాకుమారి కథ తెలుసా?

Vastu Tips: ఇంట్లో డబ్బు, బంగారం ఈ దిశలో ఉంచితే.. సంపద రెట్టింపు !

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఇవే !

Vastu For Staircase: ఇంటి లోపల.. మెట్లు ఏ దిశలో ఉండాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసం, ఏ రోజు నుంచి ప్రారంభం ? పూర్తి వివరాలివిగో..

Big Stories

×