Big Stories

Lakshmi Narasimha Swamy Temple: తెలుగునేల మీద నారసింహ క్షేత్రాలివే..!

 Lakshmi Narasimha Swamy Temple in telugu states

- Advertisement -

Lakshmi Narasimha Swamy Temple in telugu states:  తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడేందుకు శ్రీమహావిష్ణువు ఈ భూమ్మీద నరసింహావతారంలో ఆవిర్భవించాడు. మనిషి, సింహం రూపాల కలయికగా కనిపించే నారసింహుడు చూసేందుకు భీతిగొలిపేలా ఉన్నా.. తన భక్తుల పాలిటి ఆర్తజన రక్షకుడు. ఇటు.. తెలుగువారికి శ్రీ వేంకటేశ్వరుడితో బాటు నారసింహుడూ ప్రధాన కులదైవంగా ఉన్నాడు. ఈ తెలుగునేల మీద ఆయన 9 ప్రధానక్షేత్రాల్లో కొలువుదీరి భక్తుల పాలిట కొంగుబంగారంగా పూజలందుకుంటున్నాడు. అవే నవ నారసింహ క్షేత్రాలుగా పేరొందాయి. ఆ క్షేత్రాల వివరాలు..

- Advertisement -

మంగళగిరి: కృష్ణా నదీ తీరాన గుంటూరుకు సమీపంలోని మంగళగిరిలో నారసింహుడు.. కొండపై సుదర్శన నారసింహుడిగా, కొండకింద లక్ష్మీ నారసింహుడిగా దర్శనమిస్తాడు. కొండమీది చిన్న ఆలయంలో నోరు తెరచి కనిపించే నారసింహుడు.. భక్తులు అర్పించే పానకాన్ని స్వీకరిస్తాడు. ఈ పానకాల నరసింహుడు.. భక్తులు తన నోట్లో పోసిన పానకాన్ని స్వీకరించి, సరిగ్గా అందులో సగం తిరిగి నోటి నుంచి వదులుతాడు. రోజంతా భక్తులు పానకం పోస్తున్నా.. ఆ ఆలయంలో చిన్న ఈగ, దోమ, చీమ కనిపించవు. ఇక.. కొండ కింది కోవెలలో స్వామి లక్ష్మీనరసింహుడిగా దర్శనమిస్తాడు. అమరావతి పాలకుడు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు ఇక్కడ కట్టించిన 157 అడుగుల ఎత్తైన, 11 అంతస్తుల గాలిగోపురం.. రాష్ట్రంలోనే ఎత్తైనదిగా పేరొందింది.

మాల్యాద్రి: పూర్వం అగస్త్య మహాముని ఇక్కడ చేసిన తపస్సుకు మెచ్చి విష్ణువు.. నరసింహావతారంలో కొలువైన క్షేత్రమిది. జ్వాలా రూపంలో దర్శనమిచ్చిన స్వామిని.. అగస్త్యుడు ఇక్కడే ఉండి, వారంలో ఒకరోజు మానవులకు దర్శనమివ్వాలని కోరగా.. స్వామి ఇక్కడ కొలువయ్యాడని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడి కొండ పూలదండ(మాల) రూపంలో ఉన్నందున దీనిని మాల్యాద్రి, మాలకొండ అంటారు. ఇక్కడి లక్ష్మీ నరసింహుడు కేవలం శనివారం రోజునే భక్తులకు దర్శనమిస్తాడు. ప్రకాశం జిల్లాలోని కందుకూరు నుంచి పామూరు వెళ్లే దారిలోని వలేటివారి పాలెం గ్రామంలోని ఆలయాన్ని వారంలోని అన్ని రోజులూ తెరిచేందుకు భక్తులు గతంలో ప్రయత్నించగా పలు సమస్యలు ఎదురవటంతో కేవలం శనివారమే ఈ ఆలయాన్ని తెరుస్తారు. శనివారం ఉదయం అభిషేకంతో మొదలయ్యే సేవలు.. సూర్యాస్తమయ వేళకు ముగుస్తాయి. మాలకొండయ్య, మాలకొండమ్మ, మాల్యాద్రి అనే పేర్లు ఈయన పేరు మీద వచ్చినవే.

అంతర్వేది: హిరణ్యాక్షుడి కుమారుడైన రక్తావలోచనుని సంహారానంతరం వశిష్ఠుడి కోరికమేరకు విష్ణుమూర్తి ఇక్కడ లక్ష్మీనృసింహ స్వామిగా వెలిశాడనేది పురాణగాథ. వశిష్ఠమహర్షి ఇక్కడ యాగం చేసినందువల్లే దీనికి అంతర్వేది అనే పేరు వచ్చిం దట. ఇది మహిమాన్విత క్షేత్రంగా వెలుగొందుతోంది. త్రేతాయుగంలో రావణబ్రహ్మను సంహరించిన శ్రీరాముడు బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తిని పొందడానికి ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి విగ్రహాలను బట్టి క్రీ.శ. 300కు ముందు నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ తరవాత ఓడలరేవు గ్రామస్తులు దీన్ని పునరుద్ధరించారు. మాఘమాసంలో స్వామివారి కల్యాణోత్సవాలు కన్నులపండుగగా జరుగుతాయి.

Read more: బుధుడు మీనం రాశిలో సంచారం.. ఈ 3 రాశుల వారికి గుడ్ న్యూస్..

ధర్మపురి: హిరణ్యకశిపుడి సంహారం తర్వాత నరసింహ స్వామి ఈ పావన గోదావరీ తీరాన తపస్సు చేసిన క్షేత్రమే ధర్మపురి. ధర్మవర్మ అనే రాజు కోరిక మీదట స్వామి ఇక్కడ కొలువయ్యాడనీ, అందుకే దీనికి ధర్మపురి అనే పేరువచ్చిందని చెబుతారు. ఆంజనేయుడు క్షేత్రపాలకుడిగా ఉండే ఈ క్షేత్రంలో యమధర్మరాజు నారసింహుడిని సేవించుకుని, ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నాడని స్థల పురాణం చెబుతోంది. అందుకే ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలోని యమధర్మరాజు ఆలయాన్ని దర్శించుకున్నాకే.. ప్రధాన ఆలయంలోని నరసింహస్వామిని దర్శించుకుంటారు. ‘ధర్మపురికి పోయినవాడికి యమపురికి పోయే అవసరమే రాదు’ అనే నానుడి ఇందుకే పుట్టింది. కరీంనగర్ పట్టణానికి 80 కి.మీ దూరంలో ఈ క్షేత్రం ఉంది.

పెంచలకోన: హిరణ్యకశిపుడి సంహారం తర్వాత భీకర రూపంతో స్వామి ఇక్కడి కొండకోనల్లో తిరుగాడుతున్న వేళ.. ఈ అటవీ ప్రాంతంలోని చెంచులంతా ఆయనను చూసి ప్రాణభయంతో చెల్లాచెదురైపోయారట. కానీ.. ఆ చెంచుల రాజు కుమార్తె చెంచులక్ష్మి మాత్రం.. స్వామిని చూసి భయపడకుండా అలాగే నిలిచి ఆయనకు నమస్కరించి శాంతించమని ప్రార్థించిందట. ఆమె ధైర్యానికి, భక్తికి మెచ్చిన స్వామి ప్రసన్నుడు కాగా.. చెంచులక్ష్మి ఆయనకు సేవలు చేసిందనీ, ఆమెను వివాహమాడాలని భావించిన స్వామి.. చెంచురాజుకు కొంత ధనం సమర్పించి ఆమెను వివాహమాడి, ఆమెను పెనవేసుకుని శిలారూపంలో ఈ పెంచలకోన మీద ఉండిపోయాడని స్థలపురాణం చెబుతుంది. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో ఉంది. పెంచలయ్య, పెంచలమ్మ, పెంచల నాయడు, పెంచల రెడ్డి అనే పేర్లు ఈ స్వామి పేరిట వచ్చినవే.

వేదాద్రి: కృష్ణానదీ తీరాన చిల్లకల్లు గ్రామానికి 10 కి.మీ దూరాన ఈ క్షేత్రం ఉంది. సోమకాసురుడు అనే అసురుడు బ్రహ్మ చేతిలోని వేదాలను కాజేసి సముద్రంలో దాక్కోవటంతో విష్ణువు చేప (మత్స్యం) రూపంలో ఆ రాక్షసుడిని సంహరించి, వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించాడు. ఆ సమయంలో వేదాలు.. స్వామిని సేవించుకునే అవకాశం ఇవ్వమని కోరగా, హిరణ్యకశిపుడి సంహారం తర్వాత కృష్ణా తీరంలో కొలువుదీరతానని స్వామి వాటికి వరమిచ్చాడనీ, అందుకే ఇక్కడ వెలిశాడనీ చెబుతారు. ఈ క్షేత్రంలో స్వామి.. జ్వాల, సాలగ్రామ, యోగానంద, లక్ష్మీనరసింహ, వీర నరసింహుడనే 5 రూపాల్లో దర్శనమిస్తాడు.

అహోబిలం: తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడేందుకు స్వామి ప్రళయ భీకరమైన రూపంతో వచ్చి.. తన గోళ్లతో రాక్షస సంహారం చేసి ఆ ప్రాంతమంతా భీకరమైన అరుపులతో తిరుగుతూ ఇక్కడి బిలంలో కొలువయ్యాడు. దీనిని చూసిన దేవతలు ‘అహోవీరా.. అహో సూరా.. అహో బహుపరాక్రమా.. ఆహోబిలః ఆహోబిలః’ అని స్తుతించారు. కర్నూల్‌ జిల్లా ఆళ్లగడ్డకు 25 కి.మీ. దూరంలో ఉంది. స్వామి ఆవిర్భవించిన స్తంభాన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. జ్వాలా, అహోబిల, మాలోల, వరాహ, కారంజ, భార్గవ, యోగానంద, ఛత్రవట, పావన నారసింహ రూపాల్లో స్వామి ఇక్కడ దర్శనమిస్తాడు.

Read more: కార్తికేయుడి నాటి తపోభూమే.. నేటి కొమురవెల్లి..!

యాదాద్రి: పూర్వం బుుష్యశృంగుడనే మహాముని కుమారుడైన యాదుడు ఈ కొండమీద నారసింహుడి దర్శనం కోసం తపస్సు చేయగా.. స్వామి ఉగ్రరూపంలో దర్శనమిచ్చాడట. కానీ.. ఆయన భీకర రూపాన్ని చూడలేకపోయిన యాదుడు.. శాంతరూపంలో ఇక్కడ కొలువుండమని వేడుకొనగా, స్వామి లక్ష్మీసమేతుడై కొండపై కొలువుదీరాడట. స్వామిని సేవిస్తున్న యాదుడు.. మరొకసారి స్వామిని పలు రూపాల్లో చూడాలని కోరగా, ఆయన కోరిక మేరకు స్వామి.. జ్వాలా, యోగానంద, గండభేరుండ, ఉగ్రనారసింహ రూపాల్లో కనిపించాడు. యాదగిరీశుడి దర్శనంతో సకల రోగాలూ నశించి, మంచి ఆరోగ్యం సమకూరుతుందని భక్తుల విశ్వాసం. హైదరాబాద్‌కు 70 కి.మీ దూరంలో ఈ క్షేత్రం ఉంది.

సింహాచలం: తూర్పు కనుమల్లో సింహగిరి మీద గల క్షేత్రమే సింహాచలం. సాక్షాత్తూ ప్రహ్లాదుడి చేత ఈ స్వామి పూజలందుకున్నాడని, అనంతర కాలంలో పురూరవుడు అనే చక్రవర్తి.. పుష్పక విమానంలో వెళుతుండగా, పుట్టలోని స్వామి మూర్తి ఆకర్షించటంతో ఆకాశంలోని పుష్పక విమానం నేల మీదికి వచ్చిందని, తనను ప్రతిష్ఠించి చందనం పూయమని, ఏటా వైశాఖ శుద్ధ తదియ నాడు నిజరూప దర్శనం కల్పించాలని స్వామి పూరూరవుడిని ఆదేశించినట్లు స్థల పురాణం చెబుతోంది. నాటి నుంచి ఏటా ఇక్కడ చందనోత్సవం జరుపుతున్నారు. ఇక్కడ స్వామి వరాహ, సింహ, మానవ రూపాల కలయికగా దర్శనమిస్తాడు. విశాఖ పట్టణానికి సమీపంలోని ఈ కోవెల సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున ఉంది. ఇక్కడ స్వామి పశ్చిమ దిశగా కూర్చొని దర్శనమిస్తాడు. 11వ శతాబ్దంలో గజపతులు ఈ ఆలయాన్ని నిర్మించారు. దంపతులు ఆలయంలోని కప్పస్తంభాన్ని కౌగిలించుకుంటే.. వారి కోరికలు తీరతాయని ప్రతీతి. ఈ స్వామిని ఉత్తరాంధ్ర భక్తులు ‘అప్పన్న’ అని పిలుచుకుంటారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News