Big Stories

Komuravelli Mallanna: కార్తికేయుడి నాటి తపోభూమే.. నేటి కొమురవెల్లి..!

 

- Advertisement -

Komuravelli Mallanna

- Advertisement -

Komuravelli Mallanna Temple History: తెలంగాణలో సుప్రసిద్ధ శైవక్షేత్రాలలో కొమురవెల్లి మల్లన్న ఆలయం ఒకటి. అపర శ్రీశైలంగా భక్తులు భావించే ఈ క్షేత్రంలో పూర్వం కొంతకాలం పాటు కుమారస్వామి తపస్సు ఆచరించాడనీ, అందుకే అది ‘కుమారవెల్లి’ అయిందనీ, కాలక్రమంలో ‘కొమురవెల్లి’, ‘కొమ్రెల్లి’గా మారిందని చెబుతారు. సిద్ధిపేట నుంచి 24 కి.మీ. దూరంలోని ఈ క్షేత్రం ఉంది.

కాకతీయుల కాలం నుంచి ఈ ఆలయం ఉన్నట్లు జానపద గాథలను బట్టి తెలుస్తోంది. శివభక్తుడైన కొమురయ్య శివ దర్శనం కోరి గొప్ప తపస్సు చేయగా, నేటి కొమురవెల్లిలోని ఓ మల్లెతోటలోని పుట్టలో మట్టి లింగంగా ఉన్నానని, ఆ మట్టితో తన రూపాన్ని తయారుచేసి ప్రతిష్ఠించాలని కలలో కనిపించి సూచిస్తాడు. స్వామి చెప్పిన చోట ఉన్న పుట్టలోని శివలింగాకృతిలోని మట్టిని నేటి మూర్తిగా మలచి ప్రతిష్ఠించారు. మల్లెపూల పొదల వద్ద కనిపించిన ఆ స్వామిని మల్లికార్జునుడిగా కొలిచేవారు. నాడు సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ తమమాచరించి, సర్పరూపంలో ఆ లింగాన్ని పరిరక్షించేవాడని చెబుతారు. మరో జానపద గాథ ప్రకారం.. శివ భక్తులైన మాదిరాజు, మాదమ్మ దంపతులకు పరమశివుడు.. కుమారుడిగా జన్మించాడనీ, ఆయనే నేటి దైవమనీ చెబుతారు.

సాధారణంగా శివుడు లింగాకారంలో కనిపిస్తాడు. కానీ.. కొమరవెల్లిలో స్వామి కోర మీసాలతో, గంభీరమైన ఆకారంతో, పెద్దపెద్ద విచ్చుకున్న కళ్లతో, శిరసున పెద్ద సర్పపు పడగతో దర్శనమిస్తాడు. ఇది శివుని రూపాల్లో ఒకటైన మార్తాండ భైరవుడి రూపమనీ చెబుతారు. మనం మల్లన్న అని పిలిచే రూపాన్నే కన్నడిగులు మల్హార దేవుడనీ, మరాఠీలు ఖండోబా అని పిలుస్తారు. మల్లన్నకు ఇరువైపులా దేవేరులుగా కేతమ్మ, మేడలమ్మ కొలువై ఉంటారు. వందల ఏళ్ల నుంచి ఆ గుహలో పూజలందుకుంటున్నా.. నేటికీ మల్లన్న మట్టి మూర్తి చెక్కు చెదరకపోవటం విశేషం. స్వామి వారి ఎడమ చేతి గిన్నెలోని పసుపును బండారి అంటారు. అత్యంత పవిత్రమైన, మహిమాన్వితమైన దీనిని భక్తులు తమ నుదిటికి రాసుకుంటారు.

మల్లన్న దేవుడు యాదవ, లింగబలిజ సామాజిక వర్గాలకు చెందిన కేతమ్మ, మేడాలమ్మలను పెళ్లాడాడని జానపద గాథలను బట్టి తెలుస్తోంది. అందుకే నేటికీ ఈ ఆలయంలో ఆ కులాల పూజారులే పూజాదికాలు నిర్వహిస్తారు. వీరశైవ ఆగమ విధానం, ఒగ్గు పూజారుల విధానం అనే రెండు విధానాల్లో ఇక్కడ స్వామిని పూజిస్తారు.

Read more: నష్టాలను దూరం చేసే.. నవగ్రహ ఆలయాలు..!

సాధారణంగా ఆలయాల్లో మనకు వేప, రావి, జమ్మి, మారేడు వంటి దేవతా వృక్షాలు కనిపిస్తాయి. కానీ.. కొమురవెల్లి ఆలయంలో పెద్ద గంగరావి చెట్టు కనిపిస్తుంది. స్వామి మండపం ఎదురుగా ఉండే ఈ చెట్టుకిందనే భక్తులు పట్నాలు(ప్రత్యేక ముగ్గులు) వేసి, మొక్కులు చెల్లించుకొంటారు. ప్రదక్షణాలు, కొబ్బరికాయలు కొట్టటం, తలనీలాలతో బాటు భక్తులు బంతిపూల మాలనూ ఈ చెట్టుకే సమర్పించటం విశేషం. ఎన్ని వాతావరణ మార్పులొచ్చినా.. ఈ చెట్టు ఏడాది పొడవునా పచ్చగా కళకళలాడుతూ ఉండటం విశేషం. అనారోగ్యంతో ఉన్నవారికి చెట్టుకింద రాలిన ఆకులను భక్తులు ఇంటికి తీసుకుపోయి.. తినిపిస్తే వ్యాధులు నయమవుతాయని చెబుతాయి. ఆలయంలో స్వామిని ప్రతిష్ఠించిన రోజునే ఈ చెట్టు మొలిచిందని చెబుతారు. ఈ చెట్టుకు, దానికింది ‘వరాల బండ’కు పూజలు చేస్తే తప్పక సంతానం కలుగుతుందని నమ్ముతారు.

తంటాలు తీరితే టెంకాయ కడతామని, పంటలు పండితే పట్నాలు వేస్తామనీ, కష్టాలు తీరితే కోడెను అర్పిస్తామని, చల్లగా దయజూస్తూ.. చల్లకుండలెత్తుతామని ఇక్కడకొచ్చే భక్తులు మొక్కుకుంటారు. సంక్రాంతి నుంచి ఉగాది వరకు ప్రతి ఆది, బుధవారాలలో మల్లన్న జాతర జరుగుతుంది. స్వామి వారి దేవేరి మేడలమ్మను యాదవులు తమ ఆడపడుచుగా భావించి, ఈ మూడు నెలల్లో వచ్చే ఏదో ఒక ఆది, బుధ వారాల్లో ఆమెకు బోనం, ఒడిబియ్యం పోస్తారు. అమ్మవారికి బోనం సమర్పించిన ఈ కుండలను పాలు పిండేందుకు యాదవులు వాడతారు. దీనివల్ల తమ పాడి బాగుంటుందని వారి విశ్వాసం. అలాగే మహాశివరాత్రికి ఇక్కడ 49 వరుసలతో పెద్ద పట్నం (ముగ్గు) వేసి స్వామిని ముగ్గుమధ్యలోకి ఆవాహన చేసి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ ముగ్గును పూజ తర్వాత తీసుకుపోయి తమ పొలాల్లో చల్లుకుంటే మంచి పంటలు పండుతాయని భక్తుల విశ్వాసం.

మార్గశిర మాసంలో స్వామి వార్షికోత్సవాలు జరుగుతాయి. ఇందులో భాగంగా మార్గశిర మాసపు చివరి ఆదివారం రోజున స్వామి కల్యాణాన్ని వీర శైవ ఆగమం ప్రకారం నిర్వహిస్తారు. ఇందులో పగిడన్న వంశీయులు స్వామి వారి తరపున, మహాదేవుని వంశం వారు అమ్మవార్ల తరపున కర్తలుగా వ్యవహరిస్తారు. ఉగాది ముందు వచ్చే ఆదివారం నాటి అగ్నిగుండం కార్యక్రమంతో ఈ వార్షిక వేడుకలు ముగుస్తాయి. ఈ అగ్నిగుండం వేడుకలో కణకణమని మండే నిప్పుల మీద స్వామి ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు.

జానపద సంప్రదాయాలకు కాణాచిగా నిలుస్తున్న కొమురవెల్లి మల్లికార్జునుడి పేరుమీదనే ప్రభుత్వం ఇక్కడికి సమీపంలోని సాగునీటి పథకానికి మల్లన్న సాగర్ అని నామకరణం చేసింది. హైదరాబాద్‌ ‌నుంచి సుమారు 85 కి.మీ, వరంగల్‌ ‌నుంచి 110 కి.మీ దూరంలోని ఈ పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులు కొమురవెల్లికి దగ్గర్లోనే ఉన్న కొండ పోచమ్మ ఆలయాన్ని, కొమురవెల్లి నుంచి 28 కి.మీ. దూరంలోని కోటి లింగేశ్వర స్వామిని, సుమారు 45 కి.మీ దూరంలో ఉన్న వర్గల్‌లోని సరస్వతీదేవి ఆలయాన్నీ దర్శించుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News