BigTV English

Varalakshmi Vratam 2024: వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. పూరీ జగన్నాథస్వామి ఆలయంలో లక్ష్మీదేవి చరిత్ర తెలుసా ?

Varalakshmi Vratam 2024: వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. పూరీ జగన్నాథస్వామి ఆలయంలో లక్ష్మీదేవి చరిత్ర తెలుసా ?

Varalakshmi Vratam 2024:


సిరులను కురిపించే కల్పవల్లి లక్ష్మీదేవి.
పాడిపంటలు, పసిడిరాశులు ప్రసాదించే తల్లి లక్ష్మీదేవి.
సుఖ సంతోషాలు, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలను ప్రసాదించే అమ్మగా ప్రజలు లక్ష్మీదేవిని పూజిస్తారు. లక్ష్మీదేవి హిందూ మతంలో ప్రధాన దేవత, ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణుమూర్తి భార్య, పార్వతి, సరస్వతితో పాటు లక్ష్మీ ముగ్గురు అమ్మలలో ఒకరు.

భారతదేశంలో దీపావళి పండుగ నాడు హిందువులు లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. లక్ష్మీదేవి ఆభరణాలను ధరించి మెత్తం నాలుగు చేతులతో.. రెండు చేతులతో పుష్పాలను, ఇంకో రెండు చేతులతో బంగారు నాణేలను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈమె తామర పువ్వు మీద కూర్చుని ఏనుగులతో చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.


పూరీ జగన్నాథ ఆలయంలో లక్ష్మీదేవికి సంబంధించిన కథ గురించి చూద్దాం..

పూర్వం ఒకసారి పూరీ అనే గ్రామానికి చెందిన శ్రియ, చండాలిక అనే వారు లక్షీదేవిని పూజించగా.. జగన్నాథుడు ( శ్రీకృష్ణుడు) భార్య లక్ష్మీదేవిగా వారి ఇంటికి వెళుతుంది. వారు అంటరాని కులంలో జన్మించి, పూరీ గ్రామం నుండి బహిష్కరించబడి, గ్రామం చివరన ఒక పూరి పాకలో జీవిస్తుంటారు. వారి భక్తికి సంతోషించిన లక్ష్మీదేవి వారు పెట్టిన ప్రసాదాలు స్వీకరించి, వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి..వారి గుడిసెను పెద్ద రాజ భవనంలా మార్చివేస్తుంది.

ఈ విషయం విన్న బలభద్రుడు అంటరానివారి ఇంటిని సందర్శించిన లక్ష్మీదేవిని విడిచిపెట్టమని జగన్నాథుడిని ఆజ్ఞాపిస్తాడు. అన్న బలభద్రుడి ఆజ్ఞను శిరసావహించిన జగన్నాథుడు లక్ష్మి దేవిని విడిచిపెడతాడు.. అప్పుడు లక్ష్మి పూరీ గ్రామాన్ని విడిచి శ్రియ,చండాలిక ఇంటిలోనే ఉండసాగింది. ఆ తర్వాత బలభద్ర భగవానుడు పూరీలోని పెద్ద వంటగదిలో వంట చేద్దామని వస్తాడు.

Also Read: వరలక్ష్మీ వ్రతం చేసుకోవడానికి అద్భుతమైన ముహూర్తం ఇదే..

అయితే ఆ వంటశాలకు అధిపతి అయిన లక్ష్మీ దేవి అక్కడ లేకపోవడంతో కట్టెల పొయ్యికూడా వెలగదు. బియ్యం, కూరగాయలు అన్నీ మాయమైపోతాయి. తినడానికి అక్కడ ఏమీ మిగలవు. అన్నం లేకపోవడంతో పూరీ దేవాలయంలోని సుభద్ర, బలభద్రుడి సహా జగన్నాథుడు కూడా ఆకలికి అలమటిస్తారు. దేవాలయానికి వచ్చిన భక్తులు, పూజారులతో సహా ఆ గ్రామంలోని ప్రజలందరూ అన్నం దొరక్క, ఆకలికి తట్టుకోలేక ఏడుస్తుంటారు. క్రమంగా పూరీ గ్రామంలో శాంతి, సంపద, శ్రేయస్సు, శక్తి దూరమై దురదృష్టం, ఆకలి ప్రవేశిస్తుంది. ప్రజలు అన్నంకోసం ఒకరిని ఒకరు కొట్టుకుంటూ, చంపుకుంటూ జీవిస్తుంటారు.

బలభద్ర భగవానుడు,సుభద్రా దేవి అలాగే జగన్నాథుడు వీధుల్లోకి వచ్చి అన్నం కోసం ప్రజల్ని వేడుకుంటుంటారు. అయినా వారికి తినడానికి తిండి దొరకదు. ఒంట్లో శక్తిలేక అలాగే రోడ్డుమీద కూలబడతాడు బలభద్రుడు.

అప్పటికి గాని బలభద్ర భగవానుడికి తాను చేసిన తప్పేంటో తెలిసివస్తుంది. ఇప్పటి వరకు తను సంపాదించి అన్నం తింటున్నాడనుకున్నాడు కానీ అసలు ఆ సంపదకు, శక్తికి మూలం లక్ష్మీదేవి అని గ్రహించలేక పోయాడు.

చివరకు జగనాథుడు ఆహారం కోసం వెతుకుతూ ఊరి చివరకు వస్తాడు.. అక్కడ ఒక అంటరాని స్త్రీ అన్నం తినడం చూసి, నాకు అకలిగా ఉంది కొంచెం అన్నం పెట్టమని చేతులు జోడించి అడుగుతాడు. ఆ అంటరాని స్త్రీ జగన్నాథుడికి అన్నం పెడుతుంది. జగన్నాథుడు అన్నం తినగానే అతని కడుపునిండి, వంట్లోకి శక్తి వస్తుంది, అప్పుడు ఆ అంటరాని స్త్రీ లక్ష్మీదేవిగా మారుతుంది. జగన్నాథుడు లక్ష్మీదేవిని తనతో రావాలని వేడుకుంటాడు, అందుకు అంగీకరించిన లక్ష్మీ పూరీ గ్రామంలోకి ప్రవేశిస్తుంది.

లక్ష్మీదేవి దేవాలయంలోకి ప్రవేశించగానే వంటగదిలో కట్టెల పొయ్యి ఆటోమేటిక్ గా వెలిగి, అన్నం, కూరలు తయారవుతాయి. అప్పుడు బలభద్ర భగవానుడు, సుభద్రా దేవితో పాటు గ్రామ ప్రజలందరూ ఆవురావురమంటూ అన్నం తిని శక్తిని పొందుతారు. బలభద్రుడు, లక్ష్మీదేవిని క్షమించమని వేడుకుని, దేవాలయంలోని పెద్ద వంటశాలలో నివశించమని కోరతాడు. అప్పటి నుండి లక్ష్మీదేవి అక్కడే ఉండి పూరీ దేవాలయానికి వచ్చే భక్తులకు అన్నం, కమ్మని కూరలతో కడుపు నింపుతుంది. ఇక్కడ అన్నం లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది. లక్ష్మీదేవి కారణంగా పూరీ దేవాలయ వంటశాల ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఈ కథ లక్ష్మీ పురాణంలో పేర్కొనబడింది.

ఇప్పుడు లక్ష్మీదేవికి సంబంధించిన ఇంకో కథ తెలుసుకుందాం..

ఒకసారి లక్ష్మీదేవికి ఒక ఇంటి యజమానిపై కోపం వచ్చి “నేను ఈ ఇంటినుండి వెళ్లి పోతున్నాను. ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది. ఇప్పుటివరకు నీ ఇంట్లో ఉన్నందుకు ఏదైన వరం కోరుకో ఇస్తాను.” అని అంటుంది. అప్పుడు ఆ ఇంటి యజమాని లక్ష్మీదేవితో “తల్లీ నీవు వెళ్లిపోతుంటే ఆపే శక్తి నాకు లేదు. అలాగే దరిద్రదేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు. మీలో ఒకరు వున్నచోట ఇంకోకరు వుండరు. కాబట్టి దరిద్ర దేవత వచ్చిన తర్వాత కూడా మా ఇంటిలో ఇప్పుడు ఉన్నట్లే ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమాభిమానాలు అలాగే వుండేలా చూడమంటాడు. అప్పుడు లక్ష్మీదేవి ‘తథాస్తు!’ అని ఆ ఇంటినుండి వెళ్లిపోతుంది.

Also Read: వరలక్ష్మీ వ్రతం రోజు కలశ స్థాపన చేయు విధానం.. పూజా పద్ధతి

కొన్నిరోజుల తర్వాత ఇంటి యజమాని భార్య గుడికి వెళుతూ.. కూరలో ఉప్పు, కారం సరిపోయేలా వేయమని కోడళ్లకు చెప్పి వెళుతుంది. కొద్దిసేపటి తర్వాత చిన్న కోడలు వచ్చి కూరలో ఉప్పు కారం వేసి బట్టలు ఉతకడానికి వెళుతుంది. ఇంకొంతసేపటికి పెద్దకోడలు వచ్చి కూరలో తగినంత ఉప్పు, కారం వేసి వేరేపనిలో పడిపోతుంది. తర్వాత అత్తగారు వచ్చి కోడళ్లు ఇద్దరు ఎవరి పని వారు చేసుకోవడం చూసి వీళ్లు కూరలో ఉప్పు, కారం వెయ్యలేదేమో అని అనుకుని తనూ వేస్తుంది.

మధ్యాహ్నం పూట ఇంటి యజమాని వచ్చి అన్నం తింటూ కూరలో ఉప్పు, కారం ఎక్కువయిందని గ్రహించి, దరిద్ర దేవత తన ఇంటిలోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు. ఏమి మాట్లాడకుండా భోజనం చేసి వెళ్లిపోతాడు. తర్వాత పెద్దకొడుకు వచ్చి భోజనం చేస్తూ కూరలో ఉప్పు, కారం ఎక్కువయిందని గ్రహించి ‘నాన్న గారు తిన్నారా?’ అని భార్యను అడుగుతాడు.”తిన్నారు!’అని భార్య చెబుతుంది. దాంతో ‘నాన్న ఏమీ అనకుండ తిన్నాడు. నేనెందుకు అనాలి?’ అని, ఏమి అనకుండా అన్నం తిని వెళ్లిపోతాడు. ఇలా ఆ ఇంటిలో ఉన్న వారంతా భోజనం చేసి కూర గురించి మాట్లాడకుండా వుంటారు.

ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత ఆ ఇంటి యజమాని దగ్గరకు వచ్చి ‘నేను ఇక్కడ ఉండలేను వెళ్లిపోతున్నాను. ఉప్పు, కారం ఎక్కువయిన వంట తిని కూడ, మీరు మీ భార్యలను తిట్టలేదు. అత్త కోడళ్లు కూడా ఒకళ్ళను ఒకరు తిట్టుకోలేదు. మీరందరూ ఐక్యమత్యంగా చాలా ప్రేమగా ఉన్నారు, ఇటువంటి చోట నేనుండను!’ అని వెళ్లిపోతుంది. దరిద్ర దేవత వెళ్లిపోవటంతో ఆ ఇంట మళ్లీ లక్ష్మీదేవి ప్రవేశించి.. నివసిస్తుంది. కనుక, ఏ ఇంటిలోనైతే ‘ప్రేమ,అభిమానం,అప్యాయతలు ’ కళకళలాడుతుంటాయో ఆ ఇల్లు లక్ష్మికి నివాసం అవుతుంది.

ఇప్పుడు మన దేశంలో లక్ష్మీ దేవికి ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం..

1.చత్తర్పూర్ మందిర్

చత్తర్‌పూర్ మందిర్ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో ప్రసిద్ధ కుతాబ్ మినార్ నుండి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక అందమైన లక్షీదేవి దేవాలయం, ఇది దక్షిణ, ఉత్తర భారతీయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది.

2.చౌరాశి ఆలయం

చౌరాశి దేవాలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని చంబా లోయ నుండి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న భ్రమూర్ వద్ద ఉంది. లక్ష్మీ దేవి, గణేషుడు, మణి మహేషుడు మరియు నార్ సింగ్ యొక్క ప్రధాన ఆలయాలను చౌరాశి దేవాలయాలు అని పిలుస్తారు.

3.మహా లక్ష్మి దేవాలయం

ముంబైలోని మహాలక్ష్మి ఆలయం నగరంలోని పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది ముంబైలోని బ్రీచ్ కాండీ వద్ద బి.దేశాయ్ రోడ్‌లో ఉంది, ముంబైలోని ప్రజలు అత్యధికంగా సందర్శించే దేవాలయాలలో మహాలక్ష్మి దేవాలయం ఒకటి.

4.శ్రీపురం గోల్డెన్ టెంపుల్

శ్రీపురం స్వర్ణ దేవాలయం తమిళనాడులోని వెల్లూరు నగరంలో “మలైకోడి” అని పిలువబడే ప్రదేశంలో పచ్చని, కొండల పాదాల దిగువన నిర్మించిన ఒక ఆధ్యాత్మిక ఉద్యానవనం. ఈ ఆలయం వెల్లూరు నగరానికి దక్షిణాన తిరుమలైకోడి వద్ద ఉంది. తిరుమలైకోడి వెల్లూరు నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×