Tirumala Update: అసలే కార్తీకమాసంలో వచ్చే పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి రానే వచ్చింది. దీనితో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా ఓంకార నాదం వినిపిస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. అలాగే కార్తీక పౌర్ణమి శోభ కనిపిస్తోంది. వేకువజామున నుంచే పవిత్ర నదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
నదిలో కార్తీక దీపాలు వదిలి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమలకు కూడా భారీగా భక్తులు చేరుకుంటున్నారు. తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి.
ఎటుచూసినా భక్తజనసందోహం తిరువీధులలో కనిపిస్తోంది. అలిపిరి నుండి గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. శ్రీ శ్రీనివాసా శరణు.. శరణు అంటూ భక్తులు కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. దీనితో భక్తుల సేవలో తరించే టీటీడీ, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా.. అన్ని చర్యలు చేపట్టింది.
శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ ప్రకటించింది. అలాగే సోమవారం స్వామి వారిని 56,711 మంది భక్తులు దర్శించుకోగా.. 19,775 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అంతేకాదు స్వామి వారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 3.64 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా శ్రీవారి సర్వ దర్శనానికి 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీశైలంలో పోటెత్తిన భక్తులు
నంద్యాల జిల్లా శ్రీశైలంలో కార్తీక మాసం పౌర్ణమి కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద,ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు.
కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు కంపార్ట్మెంట్స్ పాలు, ప్రసాదాలు అందచేస్తున్నారు. శని,అది,సోమవారాలలో స్పర్శ దర్శనం,సామూహిక, గర్భాలయా అభిషేకాలు నిలుపుదల చేశారు. కార్తీక మాసం పౌర్ణమి కావడంతో రద్దీ దృష్ట్యా భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.