BJP Leaders: తెలంగాణ బీజేపీలో కారు పార్టీ చిచ్చు రేపిందా? కేటీఆర్ వ్యవహారం ఆ పార్టీలో నేతల మధ్య చిచ్చు రాజేసిందా? లగచర్ల దాడి కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలని ఒకరంటే.. ప్రభుత్వానిదే తప్పని మరొకరు ఎందుకంటున్నారు? ఆ పార్టీ రెండుగా చీలిందనే వాదన ఊపందుకుందా? అవుననే అంటున్నారు కొందరు రాజకీయ నేతలు.
అధికారంలో లేనప్పుడు కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ విపక్షాలకు దొరకడం కాస్త కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఆ పార్టీలో ఎవరో ఒకరుంటే మరింత ఈజీగా కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంటుంది.
రీసెంట్‌గా కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఢిల్లీకి వెళ్లిన వెంటనే కేంద్రమంత్రితో సమావేశం కావడం, ఆపై సాయంత్రానికి మీడియా ముందుకు రావడం, రాత్రి వేళ బీజేపీ అగ్రనేతలను కవడం చకచకా జరిగిపోయింది.
ఈ పరిణామాలు వెనుక బీజేపీ ఎంపీ ఒకరున్నారని, ఆయన సహకారంతో ఇదంతా జరిగిందని అంటున్నారు. ఢిల్లీకి కేటీఆర్ వెళ్లగానే నేరుగా ఆ ఎంపీతో కాసేపు మంతనాలు జరిపారని అంటున్నారు. కేంద్రమంత్రి ఆఫీసులో ఆయనతో ఫోటోలు కూడా దిగారట.
ALSO READ: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ.. రంగంలోకి ట్రాన్స్‌జెండర్లు
గతంలో కేసీఆర్ స్వయంగా ఆయన్ని బీజేపీలోకి పంపారనే వాదనలూ లేకపోలేదు. జరుగుతున్న పరిణామాలను గమనించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, ఈ రెండు పార్టీలు ఒక్కటేనని విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల నుంచి తాము ఇదే చెబుతున్నామని, చివరకు అదే నిజమైందని అంటున్నారు.
లేటెస్ట్‌గా లగచర్ల దాడి కేసులో కూడా తెలంగాణ బీజేపీ నేతలు రెండుగా చీలిపోయినట్టు కనిపిస్తోంది. ఈ ఘటనలో కేటీఆర్‌ను జైలుకి పంపించాలని ఎంపీ అర్వింద్ ప్రస్తావించారు. మరో ఎంపీ ఈటెల మాటలు బీఆర్ఎస్ వత్తాసు పలికేలా ఉన్నాయి. దీంతో తెలంగాణ బీజేపీ రెండువర్గాలు చీలిపోయిందని చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.
మూసీ పునరుజ్జీవన, హైడ్రా విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు రెండుగా చీలిపోయిన విషయం తెల్సిందే. బీజేపీలో ఓ వర్గం బీఆర్ఎస్‌కు సపోర్టు చేయగా, మరో వర్గం అధికార ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది.
బీజేపీ-బీఆర్ఎస్ ఒకటేనన్న ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటేనంటూ ఆయన కొత్త పల్లవిని ఆయనెత్తుకున్నారు. ఈ డ్యామేజ్‌ని నివారించకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం కలిగే అవకాశముందని కొందరు బీజేపీ నేతల మాట.