ఎవరైనా మరణించినప్పుడు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శరీరాన్ని దహనం చేసేందుకు స్మశానానికి తీసుకెళ్తారు. కానీ అక్కడ పురుషులు మాత్రమే ఉంటారు, స్త్రీలు కనిపించరు. కొంత దూరం వరకు వెళ్లి తిరిగి వచ్చేస్తారు. ఇలా స్త్రీలు దహన కార్యక్రమాలకు వెళ్లడం ఎందుకు నిషేధించారో చాలామందికి తెలియదు. గరుడ పురాణం ఈ విషయాన్ని వివరిస్తోంది.
మహిళలు ఎందుకు వెళ్లకూడదు?
గరుడ పురాణం చెబుతున్న ప్రకారం స్త్రీలు పురుషులు కంటే ఎక్కువ భావోద్వేగానికి లోనవుతారు. ఎవరైనా మృతదేహాన్ని దహనం చేస్తున్నప్పుడు వారు ఏడ్చే అవకాశం ఉంది. అలా ఏడిస్తే ఆ వ్యక్తి ఆత్మకు శాంతి లభించదు. అప్పుడు అతను మోక్షం లేక ఆత్మ రూపంలోనే తిరుగుతూ ఉంటాడు. అందుకే స్త్రీలను అక్కడికి అనుమతించరు. మరణించిన వ్యక్తి తన కర్మల ప్రకారం స్వర్గానికి లేదా నరకానికి వెళతారు. ఇలా దానం చేస్తున్నప్పుడు మహిళలు ఏడిస్తే అతనికి ఆ రెండు ద్వారాలు మూసుకుపోతాయి. అతను ఎక్కడికి వెళ్లలేక భూమిపైనే ఆత్మ రూపంలో తిరుగుతూ ఉంటాడు.
స్త్రీలు చూడలేరు
అంతేకాదు స్మశాన వాటికలో మహిళలు చూడడానికి వీలులేని భయానకమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మృతదేహాన్ని దహనం చేస్తున్నప్పుడు దాన్ని కర్రతో కొట్టడం వంటివి చేస్తారు. అలాగే ఆ పుర్రెను పగలగొడతారు. ఇలాంటివి చూసి తట్టుకునే మానసిక సామర్థ్యం మహిళలకు ఉండదు. వారు బలహీనంగా ఉంటారు. కాబట్టి స్మశానానికి వారిని అనుమతించరు.
అంతేకాదు స్మశాన వాటికలలో ఎన్నో ఆత్మలు తిరుగుతాయని చెబుతారు. హిందూ మత ప్రకారం పురుషులకంటే స్త్రీల పట్లే ఆత్మలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తాయి. దీనివల్ల స్త్రీలు హృదయంలోనే కాదు శారీరకంగా కూడా బలహీనంగా ఉంటారు. అలాంటప్పుడు ఆత్మలు వారి శరీరాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని చెబుతారు. అందుకే స్మశాన వాటికకు స్త్రీలను అనుమతించరు.
గరుడ పురాణం చెబుతున్న ప్రకారం అంత్యక్రియలకు వెళ్లిన కుటుంబ సభ్యుడు తలకు గుండు చేయించుకోవాలి. స్త్రీలు వెళ్లినా కూడా గుండు చేయించుకోవడానికి వీలుండదు. స్త్రీలకు జుట్టు కత్తిరించకూడదు. దీని కారణంగా కూడా దహన సంస్కారాలకు వెళ్లేవారు స్త్రీలు వెళ్లడం అనేది నిషేధించారు.
ఇంటి నుండి మృతదేహాన్ని స్మశాన వాటికకు తీసుకువెళ్లిన తర్వాత ఇంటిని పవిత్రంగా శుద్ధి చేయాలి. అలా శుద్ధి చేసే శక్తి మహిళలకే ఉంది. వారు స్మశాన వాటికకు వెళితే ఇంటిని శుభ్రం చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు. ఇదే ఆలోచించి మహిళలను స్మశాన వాటికకు రాకుండా నిషేధం విధించారు. వారి ఇంటి దగ్గరే ఉండి ఇంటిని పరిశుభ్రంగా చేయడం వారి విధిగా మార్చారు.