RCB after IPL trophy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} చరిత్రలో తొలిసారిగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {RCB} కప్ కొట్టిన విషయం తెలిసిందే. 18 ఏళ్లుగా కలగా ఉన్న టైటిల్ ని సొంతం చేసుకుంది ఆర్సిబి. 2025 ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్ లో ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
Also Read: T20 World Cup: ఇంగ్లాండ్ చేతిలో చిత్తు.. కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్న టీమిండియా ప్లేయర్లు !
దీంతో 6 పరుగుల తేడాతో ఆర్సిబి విజయం సాధించింది. అయితే ఏ సమయంలో ఆర్సీబీ కప్ గెలిచిందో కానీ.. అప్పటినుండి అన్ని దరిద్రాలు చుట్టుకున్నాయని తాజాగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆర్సిబి విజయోత్సవ పరేడ్ వేళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జూన్ 4న జరిగిన ఈ తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు.. ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్ ఎలా నిర్వహిస్తారని చీఫ్ జస్టిస్ తో కూడిన ధర్మాసనం మండిపడింది. ఈ ఘటన వెనక కారణాలను తేల్చాలని సిఎం సిద్దరామయ్య సర్కార్ ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సిఐడి పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని {SIT} ని ఏర్పాటు చేసింది. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ పై చర్యలకు ఉపక్రమించింది.
ఈ క్రమంలో ఆర్సిబి మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను అరెస్ట్ చేశారు. అతడు ముంబై వెళుతుండగా బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు చేసి విచారణకు తరలించారు. నిఖిల్ తో పాటు విజయోత్సవ ఈవెంట్ నిర్వాహక సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన ముగ్గురు సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు.. కార్యదర్శి ఏ శంకర్, కోశాధికారి ఈఎస్ జైశ్రీరామ్ తమ పదవులకు రాజీనామా చేశారు.
ఇవే కాకుండా.. ఈ తొక్కిసలాట ఘటన జరిగినప్పటినుండి ఆర్సిబి సోషల్ మీడియాలో పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఈ ఘటనలు మాత్రమే కాకుండా తాజాగా.. ఆర్సిబి స్టార్ బౌలర్ యశ్ దయాళ్ వివాదాల్లో చిక్కుకున్నాడు. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ కి చెందిన ఓ యువతీ దయాల్ పై తీవ్ర ఆరోపణలు చేసింది.
Also Read: Kevin Pietersen: భార్యకు తెలియకుండా కెవిన్ పీటర్సన్ అరాచకం… ఆ హీరోయిన్ తో సీక్రెట్ రిలేషన్ !
అతడి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆన్లైన్ పోర్టల్ లో ఫిర్యాదు చేసింది. కాబోయే కోడలు అంటూ తనని దయాల్ వాళ్ళింట్లో పరిచయం చేశాడని, ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా హింసకు గురి చేశాడని పేర్కొంది. కొంతకాలం తర్వాత అతడికి వేరే అమ్మాయితో సంబంధాలు ఉన్నాయని తెలిసిందని ఫిర్యాదులో పేర్కొంది. ఇలా ఆర్సిబి కప్ గెలిచినప్పటి నుండి అన్నీ దరిద్రాలే అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.