వైన్ కార్క్ అంటే వైన్ సీసాలను మూయడానికి ఉపయోగించే ఒక వస్తువు. ఈ కార్క్ అనేది చెట్టు బెరడు నుండి తయారవుతుంది. కొన్నిసార్లు ఈ కార్క్‌ను సింథటిక్ పదార్థాలతో కూడా ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఓక్ చెట్టు నుంచి తీసిన బెరడు నుండి ఈ కార్కులను తయారు చేస్తూ ఉంటారు. ఇది వైన్ సీసాలో గాలి చొరబడకుండా కాపాడుతుంది. ఇలా మూత పెట్టి ఉంచేందుకు సాధారణ ప్లాస్టిక్ లేదా స్టీలు క్యాపులను కాకుండా కార్కులనే ఎందుకు ఉపయోగిస్తారు? దీనికి బలమైన కారణాలు ఎన్నో ఉన్నాయి.
మూతలు బదులు కార్కులు
కార్కులను వందల సంవత్సరాలుగా ఆల్కహాల్ కోసం ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వైన్ బాటిళ్లను మూసివేయడానికి కార్కులనే ఉపయోగిస్తారు. ఇలా కార్కులు పెట్టడం వల్ల ఆ బాటిల్ కు ఒక ఫ్యాన్సీ, క్లాసిక్ లుక్ వస్తుంది. చూడగానే ఆసక్తిగా అనిపిస్తుంది. కాబట్టి వైను బాటిళ్లకు ఇలా కార్కులనే ఉపయోగిస్తూ ఉంటారు.
వైన్ ఒక రకమైన ఆల్కహాల్. ఇది వయసు ముదురుతున్న కొద్ది రుచిగా మారుతుంది. అందుకే కార్క్ ను పెట్టడం వల్ల చాలా తక్కువ సూక్ష్మమైన పరిమాణంలో మాత్రమే గాలిని బాటిల్ లోకి ప్రవేశించేందుకు అనుమతిస్తుంది. ఈ గాలి ఆ వైన్ రుచిని మరింతగా టేస్టీగా మారుస్తుంది. సాధారణ మూతలు పెడితే గాలి లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. అప్పుడు వోడ్కా, విస్కీ వంటివి మరింత రుచిగా మారవు. కాబట్టి ఇలా కార్కులను ఉపయోగిస్తారు.
చెట్టు బెరడుతో మూతలు
కార్క్ ను చెట్టు బెరడు నుండి తయారుచేస్తారని ముందుగానే చెప్పుకున్నాం. కాబట్టి ఇది మృదువుగా సాగే గుణంతో ఉంటుంది. కార్క్‌ను బాటిల్ లోకి చూసినప్పుడు అది గట్టిగా సరిపోయేలా తయారు చేస్తారు. కాబట్టి అందులోని ద్రవం కూడా లీక్ అవదు. కార్కులు సహజంగా రీసైకిలింగ్ అవుతాయి. కాబట్టి పర్యావరణానికి కూడా ఇవి ఎంతో మంచిది.
కార్క్ ఉన్న బాటిళ్లను తెరవడం కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇది కూడా వేడుకల సమయంలో ఆనందాన్ని ఇస్తుంది. ఇందుకోసం కూడా వైన్ బాటిళ్లకు కార్క్ లను పెడుతూ ఉంటారు
అయితే అన్ని ఆల్కహాల్ బాటిళ్లకు వీటిని వాడరు. వోడ్కా, విస్కీ వంటి వాటికి ఎక్కువగా సాధారణ మూతలనే పెడతారు. వీటికి గాలి అవసరం లేదు. మెరిసే వైన్లకు మాత్రం కార్కులను ఉపయోగిస్తారు. ఇవి ఒక ప్రత్యేకమైన రూపాన్ని, రుచిని అందిస్తాయి.
కార్క్స్ ఖరీదైనవేమీ కాదు. ఈ కార్కులు తక్కువ ధరకే లభిస్తాయి. చెట్టు బెరడు నుంచే తయారు చేస్తారు. కాబట్టి ఇది వైన్స్ రుచిని కూడా చెడగొట్టదు. కాబట్టి ఎంతోమంది ఈ కార్కులను వాడేందుకు ఇష్టపడుతున్నారు.