Bhogi Pallu: దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు కూడా సంక్రాంతి పండగను ఎంతో ఉత్సాహంగా, వైభవంగా జరుపుకుంటారు. కొత్త సంవత్సరం మొదట్లో వచ్చే సంక్రాంతి పండగ అంటే.. తెలుగిళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ పండుగకు ముందురోజు వచ్చే బోగి రోజు ప్రత్యేకంగా పిల్లలతో ముడిపడి ఉంటుంది.
ముఖ్యంగా సంక్రాంతి పండగకు ముందురోజున చిన్నారులపై పెద్దలు బోగి పళ్లు పోసే సంప్రదాయం తరతరాలుగా కొనసాగుతోంది. కానీ ఈ ఆచారం ఎందుకు మొదలైంది? దీని వెనుక ఉన్న ఆచారం ఏమిటి? అసలు పిల్లల మీదే భోగి పళ్లు పోయడానికి గల కారణం ఏమిటి.. ఇలా చాలా ప్రశ్నలు మనలో కొంతమందికి తలెత్తవచ్చు. ఇప్పుడీ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సంక్రాంతి పండగకు ముందు రోజు బోగి పళ్లను చిన్నపిల్లల తలపై పోస్తుంటారు. ఇందులో భాగంగా పూర్వం నుంచే రేగిపళ్లు, చెరకు ముక్కలు, పూలు, నాణేలను కలిపి పిల్లలపై పోసే ఆచారం ఉంది. సాధారణంగా మొదటిసారి సంక్రాంతి జరుపుకుంటున్న పిల్లలకు ఈ వేడుక ఘనంగా నిర్వహిస్తారు. ఇంట్లోని పెద్దవాళ్లు, అత్తలు, అమ్మమ్మలు పిల్లల చుట్టూ కూర్చొని, ఆశీర్వచనాలతో భోగి పళ్లు పోస్తారు.
Also Read: ఉద్యోగం కోసం నగరానికి.. ఉత్సాహం కోసం ఊరికి.. సంక్రాంతికి ప్రజలు తమ సొంత గ్రామాలకే ఎందుకొస్తారు?
ఈ ఆచారంలో ఉపయోగించే రేగిపళ్లు, చెరకు, పూలు అన్నీ ప్రకృతితో నేరుగా సంబంధం కలిగి ఉన్నవే. రేగిపండు బలాన్ని, ఆరోగ్యాన్ని సూచిస్తే.. చెరకు తీపిని, సంతోషాన్ని సూచిస్తుంది. పిల్లల జీవితం తీపిగా, ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్ష ఈ ఆచారంలో దాగి ఉంటుందన్న మాట.
పిల్లలపై బోగి పళ్లు పోయడం ద్వారా చెడు దృష్టి, ప్రతికూల శక్తులు దూరమవుతాయన్న నమ్మకం ఉంది. నాణేలు, పళ్లు పోయడం వల్ల పిల్లలపై ఉన్న చెడు ప్రభావాలు తొలగి, మంచి శక్తి వస్తుందని పెద్దలు విశ్వసించేవారు. అందుకే ఈ ఆచారాన్ని ఆశీర్వాదంగా భావిస్తారు. అలాగే బోగి పళ్లు పిల్లల ఎదుగుదలతో కూడా ముడిపడి ఉంటుంది. రేగిపళ్లు గట్టిగా ఉంటాయి, చెరకు నెమ్మదిగా పెరుగుతుంది. పిల్లలు కూడా జీవితంలో ఓపికగా, బలంగా ఎదగాలని ఈ ఆచారం సూచిస్తుంది. ఇది శారీరక ఎదుగుదలతో పాటు మానసిక బలానికి కూడా సంకేతం అని చెప్పవచ్చు.
అలాగే ఈ వేడుకలో కుటుంబ సభ్యులంతా ఒకచోట చేరుతారు. ఈ నేపథ్యంలో పిల్లలకు పెద్దల ప్రేమ, ఆశీర్వాదం అందుతుంది. ఇది పూర్వం నుంచి నేటి తరానికి సంస్కృతి బదిలీ అయ్యే సందర్భంగా మారుతుంది. దీంతో పిల్లలకు తమ సంప్రదాయం పట్ల అనుబంధం ఏర్పడుతుంది.
నేటి ఆధునిక జీవనశైలిలోనూ పెద్దలు పాటిస్తూ వస్తున్న ఆచారాన్ని నేటి తరం కూడా పాటించడం అనేది చాలా ప్రత్యేకం. కాలం మారినా, జీవనశైలి మారినా బోగి పళ్లు ఆచారం మాత్రం ఇప్పటికీ నిలిచింది. ఇది కేవలం పండుగ ఆచారం మాత్రమే కాదు.. పిల్లలపై ప్రేమను, ఆశను, ఆశీర్వాదాన్ని చూపించే అందమైన సంప్రదాయం. అందుకే ఈ రోజుకీ బోగి పళ్లు తెలుగు సంస్కృతిలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది.
Also Read: సాంబార్ లేనిదే సంక్రాంతి పండగ అసంపూర్ణం.. ఇంట్లో అద్భుతంగా తయారు చేసుకునే సింపుల్ పద్ధతి!