మహాశివరాత్రికి రేగు పండ్లను ఇప్పటికే ఎంతో కొని ఇంట్లో పెట్టుకుని ఉంటారు. వీటిని శివుడికి నైవేద్యంగా పెట్టే సంప్రదాయం చాలా చోట్ల ఉంది. శివరాత్రికి పాలాభిషేకాలు, మారేడు పత్రాలు సమర్పించాక చివరిలో గుప్పెడు రేగు పండ్లను కూడా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల శివుడి తమ కోరికలు తీరుస్తాడే నమ్మకం ఎంతో మంది ఉంది. అయితే రేగుపండ్లు శివునికి సమర్పించాక వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే ఇంకా మంచిది. వాటిలో ఎన్నో పోషకాలు నిండుగా ఉంటాయి.
ఇప్పుడు జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఒత్తిడి, సమయానికి భోజనం తినకపోవడం వల్ల చాలా మందికి జీర్ణ సమస్యలు, అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సీజనల్ పండ్లు తినడం శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రేగు పండు చిన్నదే అయినా పోషకాలు ఎక్కువగా ఉండే పండు ఇది. ఇందులో విటమిన్ C, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ వంటి పోషకాలు ఉండటం వల్ల శరీరానికి బలం ఇస్తుంది. ఇవి శరీరాన్ని రోగాల నుంచి కాపాడటంలో సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
Also read: Maha shivarathri: శివరాత్రికి వీరు మాత్రం ఉపవాసం చేయకూడదు, ఎందుకో తెలుసా?
తింటే ఎన్ని లాభాలో
రేగు పండులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు తగ్గడానికి ఇది సహాయపడుతుంది. కడుపు ఆరోగ్యం బాగుంటే మొత్తం శరీరం చురుకుగా పనిచేస్తుంది. అందుకే పాత కాలం నుంచి ఈ పండును ఆరోగ్యానికి మంచిదిగా భావిస్తున్నారు. ఇంకా రేగు పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ C ఎక్కువగా ఉండటం వల్ల జలుబు, ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీరంలో ఉన్న హానికరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావం తగ్గుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యం, రక్తప్రసరణ కూడా మెరుగుపడుతాయని నిపుణులు చెబుతున్నారు.
నిద్ర పడుతుంది
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, రేగు పండ్లు నరాల వ్యవస్థను ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. కొందరికి నిద్ర సమస్యలు, ఆందోళన వంటి సమస్యలు ఉంటాయి. ఇలాంటి వారికి ఈ పండు కొంత వరకు ఉపశమనం ఇవ్వగలదని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నిద్ర నాణ్యత మెరుగుపడటానికి కూడా ఇది సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఏ ఆహారం అయినా మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువగా తింటే పొట్ట సమస్యలు రావచ్చు. అలాగే మధుమేహం, రక్తపోటు లేదా ఇతర వ్యాధులు ఉన్నవారు వైద్యుల సలహాతోనే ఎక్కువగా తీసుకోవడం మంచిది. సీజన్‌లో లభించే ఈ సహజమైన పండ్లు సరైన మోతాదులో తింటే ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Also read: Weightloss Roti: బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని రోటీలు తినాలి? ఏ పిండితో చేసిన రోటీ తింటే మంచిది?