ఈసీ నిబంధనలను సవాలు చేస్తూ పిటీషన్ వేసిన అధికార వైసీపీకి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఆ పార్టీ వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఆర్వో సంతకం లేకున్నా ఓటుగా పరిగణించాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను కోర్టు సమర్థించింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని తెల్చి చెప్పింది. ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే కౌంటింగ్ ప్రక్రియ ముగిసాక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించి ఈపీ దాఖలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొత్తం దాదాపు అయిదున్నర లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారి.. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 38,865 ఓట్లు పోలయ్యాయి. భారీగా పోలైన పోస్టల్ బ్యాలెట్ల కారణంగా ఎన్నికల ఫలితాలు సైతం కాస్త ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. సగటున ప్రతి నియోజకవర్గంలో 3 వేల మంది వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. దాంతో ఏపీ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నాయి.
Also Read: ’ఎగ్జిట్‘ ఎఫెక్ట్.. ఏపీలోపెరిగిన బెట్టింగ్ బాబుల హడావుడి
ఈ నేపథ్యంలో అధికార వైసీపీకి పోస్టల్ బ్యాలెట్ వ్యవహారం ఒక చాలెంజ్ గా మారింది. పోస్టల్ బ్యాలెట్ పైనే పలువురు అభ్యర్థుల భవిష్యత్తు ఆధారపడి ఉందని వైసీపీ భావిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి ఈసీ ఇచ్చిన నిబంధనల సడలింపు తమకు ఇబ్బందికరంగా మారిందన్నది వైసీపీ భావన. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అధిక సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు. మొదటి నుంచి ఉద్యోగులు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
వైసీపీ కూడా అదే భావనలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎక్కువ పర్సెంట్ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడితే ఇబ్బంది అవుతుందని వైసీపీ భావిస్తోంది. అందుకే, నిబంధనల సడలింపుపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో నిబంధనల సడలింపు ఈసీ రూల్స్ కు విరుద్ధమని వైసీపీ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే వైసీపీ పిటీషన్‌ను హైకోర్టు కొట్టి పారేసింది.. హై కోర్ట్ తీర్పును సుప్రీం లో సవాలు చేస్తామని చెప్పిన వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు .. పోస్టల్ ఓటింగ్‌పై వైసీపీ అలా పట్టుదలకు పోతుండటంతో ఎన్డీఏ కూటమి నేతలు తమ వారిని అలెర్ట్ చేస్తున్నారు.
ఆ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ పై సుప్రీం కోర్టులో టీడీపీ విశాఖపట్నం సౌత్ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ కేవియట్ పిటీషన్ దాఖలు చేశారు .. హైకోర్టులో కూడా ఇంప్లీడ్ పిటీషన్ వేసిన వెలగపూడి తరపున సీనియర్ లాయర్ పోసాని వెంకటేశ్వర్లు, రవితేజలు ఈసీ ఉత్తర్వులు సరైనవేనని తమ వాదనలు వినిపించారు. తాజాగా సుప్రీం కోర్టులో వెలగపూడి తరపున సీనియర్ న్యాయవాది గుంటూరు ప్రభాకర్ పిటీషన్ వేశారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి వైసిపి కి ఏపీ హైకోర్ట్ లో ఎదురుదెబ్బ తగలడంతో ఆ పార్టీనేతలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. హై కోర్ట్ తీర్పును సుప్రీంలో సవాలు చేస్తామంటున్నారు.. వైసీపీ సుప్రీం ను ఆశ్రయిస్తే తమ వాదన కూడా విన్న తరువాతే నిర్ణయం తీసుకోవాలని వెలగపూడి కేవియట్ లో పేర్కొన్నారు.
Also Read: ఏపీలో కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్.. గెలిచేదెవరు? ఓడేదెవరు?
ఇది చాలదన్నట్లు పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి పోస్టాఫీస్ కేంద్రంగా వైసీపీ కుట్రకు తెరలేపినట్టు బహిర్గతమైంది. వైసీపీ నేతల ఒత్తిడితో వివిధ ప్రాంతాల్లోని పోస్టల్ సిబ్బంది సర్వీస్ ఓట్లను వెనక్కి పంపారని సమాచారం. 122 ఒంగోలుకు చెందిన పోస్టల్ బ్యాలెట్ సర్వీస్ ఓట్లను మే 27 వరకు ఉంచుకుని.. ఆ తర్వాత వెనక్కి పంపింది ఒంగోలు పోస్టల్ సిబ్బంది. హైదరాబాద్‍లో పలు పోస్టాఫీసుల్లో ఏపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పేరుకుపోయాయంటున్నారు.
ఒంగోలు వ్యవహారంపై టీడీపీ నేతల ఆరా తీయగా.. నిజమేనని తేలింది. దీనితో ఫిర్యాదు చేస్తామనడంతో.. అధికారులు హడావుడిగా మళ్లీ ఒంగోలుకు పంపుతున్నారు. కాగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వైసీపీ ఇదే తరహాగా చేసిందని కూటమి పక్షాలు అనుమానిస్తున్నాయి. మొత్తానికి పోస్టల్ బ్యాలెట్ అధికారపక్షానికి నిద్రలేకుండా చేస్తున్నట్లు కనిపిస్తుంది.